లైగర్ ఫ్లాప్ తో... ఆ అప్పులన్నీ పూరి జగన్నాథ్ పై పడ్డాయి. ఈ సినిమా కొన్న బయ్యర్లు ఇప్పుడు పూరిని పీడిస్తున్నారు. పూరి కూడా...`అందరికీ సెటిల్ చేస్తా` అనే అంటున్నాడు.కానీ పూరి దగ్గర డబ్బుల్లేవు. కనీసం పాతిక కోట్లుంటే గానీ, ఈ లెక్క తేలదు. ఆ డబ్బుల కోసం పూరి ఇప్పుడు కుస్తీ పాట్లు పడుతున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.
ఓ సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడిది ఎంత బాధ్యతో, హీరోదీ అంతే బాధ్యత. సినిమా పోతే... హీరోలు పారితోషికాలు తిరిగి ఇచ్చిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు లైగర్ ఫ్లాపులో విజయ్ దేవరకొండ పాత్ర కూడా ఉంటుంది. తన వంతు బాధ్యతగా ఎంతో కొంత చెల్లిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి ఈ సినిమాతో విజయ్ కూడా నష్టపోయాడు. ఎందుకంటే ఈ సినిమా కోసం విజయ్ పారితోషికం తీసుకోలేదు. విజయ్ కి కేవలం నామమాత్రపు మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చారు. సినిమా బిజినెస్ అయిపోయిన తరవాత ఇస్తామన్న డబ్బులు ఇంకా చెల్లించలేదు. అంటే ఈ సినిమాతో విజయ్ కి దక్కిందేం లేదన్నమాట. అందుకే విజయ్ కామ్ గా అయిపోయాడు. లేదంటే ఈపాటికి జనాలు విజయ్‌పై కూడా పడుదురు.