ఫిజిక్ విషయంలో ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండే హీరో విక్రమ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలా రిస్క్ చేయడమంటేనే తనకిష్టం అంటున్నాడు హీరో విక్రమ్. ఓ సినిమా కథ ఓకే చేయాల్సి వస్తే, ఆ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్ని ముందుగానే ఆలోచిస్తాడట విక్రమ్. ఒక్కసారి ఒప్పుకున్నాక అది ఎలాంటి రిస్క్ అయినా సరే, వెనక్కి తగ్గే ప్రశక్తే ఉండదంటున్నాడు. అంతేకాదు 'సినిమానే నాకు జీవితం. ఆ సినిమానే నన్నింత వాణ్ని చేసింది. అందుకే సినిమా అంటే ఎప్పటికీ ఇష్టం చచ్చిపోదు..' అని విక్రమ్ చెబుతున్నాడు.
రిస్క్ చేయకపోతే లైఫ్‌లో ఏదీ సాధించలేం. భయపడుతూ పోతే ఎప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు రాదు. అందుకే సాధించిన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడానికి ఎంత రిస్క్ చేయాల్సి వచ్చినా తగ్గేది లేదు అంటున్నాడు విక్రమ్. తాజాగా విక్రమ్ నటించిన సినిమా 'స్కెచ్'. ఇటీవలే తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. త్వరలోనే తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే తన మనసులోని మాటల్ని మీడియాతో పంచుకున్నాడు విక్రమ్.
విక్రమ్ కొడుకు ధృవ్ కూడా హీరోగా వస్తున్న సంగతి తెలిసిందే. అదే విషయం ఆయన ముందు ప్రస్థావిస్తే, 'కొడుకు హీరో అయ్యాడు కదా, విక్రమ్ ఇంక సినిమాలు తగ్గించేస్తాడేమో అని కొందరు అనుకోవచ్చు. కానీ ధృవ్‌తో పోటీపడి అంతకన్నా ఎక్కువ సినిమాలు చేస్తాను. కానీ తగ్గించను. ఇది నాకు ఇప్పుడు ఛాలెంజింగ్ టాస్క్..' అంటున్నాడు విక్రమ్. అంతేకాదు నా ఆలోచనల్ని మాత్రం కొడుకు మీద రుద్దను..వాడి కెరీర్ వాడిష్టం అని విక్రమ్ అన్నారు.