రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం `క్రాక్`. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే.. `క్రాక్` విడుదలకు విశాల్ సినిమా అడ్డుపడుతోంది. విశాల్ కథానాయకుడిగా నటించిన `అయోగ్య` సినిమా గుర్తుండే ఉంటుంది. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న `టెంపర్`కి ఇది తమిళ రీమేక్. తమిళంలో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించారు.
ఇప్పుడు `క్రాక్`కీ ఆయనే నిర్మాత. `అయోగ్య` సినిమా తమిళంలో ఫ్లాప్ అయ్యింది. బయ్యర్లకు నిర్మాత దాదాపు 8 కోట్లు బాకీ పడ్డారు. ఆ బాకీ సంగతి తేల్చాక గానీ `క్రాక్` సినిమాని విడుదల చేయకూడదని అక్కడి బయ్యర్లు నిర్మాత ఠాగూర్‌పై కోర్టు కెక్కారు. దాంతో ఈ సినిమా విడుదలకు న్యాయస్థానం స్టే విధించింది. సంక్రాంతికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఇష్యూని క్లియర్ చేసుకోవడానికి ఠాగూర్ మధుకి కావల్సినంత సమయం ఉంది. ఇదే గొడవ విడుదలకు ముందు జరిగి ఉంటే.. కచ్చితంగా `క్రాక్` ఇబ్బందుల్లో పడేదే.