విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం `దమ్కీ`. ఈ సినిమాకి తానే దర్శకుడు. ఫిబ్రవరిలో విడుదల అవుతోంది. ఈ సినిమాకి ఏకంగా మూడు నెలల సమయం ఉంది. అంతలోనే ట్రైలర్ 1.0 అంటూ అప్పుడే హంగామా మొదలెట్టేశారు. ఈ సినిమా ట్రైలర్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్ బాగానే ఉంది కానీ... `గౌతమ్ నంద` రిఫరెన్సులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఇందులో.
గౌతమ్ నందలో ఇద్దరు గోపీచంద్‌లు. ఒకరు ధనవంతుడు.. ఇంకోకడు మిడిల్ క్లాస్. అనుకోకుండా... ధనవంతుడి ప్లేస్ లోకి మిడిల్ క్లాస్ గోపీచంద్ వెళ్తాడు. అక్కడి నుంచి కథ మారిపోతుంది. సేమ్ టూ సేమ్.. దమ్కీ కథ కూడా ఇంతే. ఇందులోనూ ఇద్దరు హీరోలు. ఒకరు రాజు.. ఇంకొకరు పేద. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తారు. వెళ్లాక ఏం జరిగిందన్నదే కథ. గౌతమ్ నంద హిట్టు సినిమా ఏం కాదు. ఏవరేజ్ గా ఆడింది. ఆ మాటకొస్తే నిర్మాతలకు డబ్బులు కూడా మిగల్లేదు. అలాంటి కథని... ఫ్రీ మేక్ చేశారా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరైనా సరే, హిట్టు సినిమాలో పాయింట్ ని లేపేస్తారు. పోయి .. పోయి ఫ్లాపు సినిమానికాపీ కొట్టాడేంటో విశ్వక్ సేన్..? మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.