రాజమౌళి, వినాయక్ సమకాలీన దర్శకులు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. అయితే ఓ విషయంలో రాజమౌళి సలహా తీసుకుంటానంటున్నాడు.. వినాయక్. అది.. `ఛత్రపతి` రీమేక్ విషయంలో. విషయం ఏమిటంటే.. రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వినాయక్ దర్శకుడు. తనకీ ఇదే తొలి హిందీ చిత్రం.
అయితే ఛత్రపతి రీమేక్ లో చాలా మార్పులు చేశార్ట. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథని మార్చారని వినాయక్ చెబుతున్నాడు. అంతేకాదు... ఈ సినిమా రీమేక్ విషయంలో రాజమౌళి సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానంటున్నాడు వినాయక్. ``రాజమౌళిని కలవాలి. ఆయనతో మాట్లాడాలి. అయితే ఆయన షూటింగులతో బిజీగా ఉన్నారు. సమయం కుదిరినప్పుడు ఈ రీమేక్ గురించి ఆయనతో చర్చిస్తా`` అని వినాయక్ చెప్పుకొచ్చాడు. రామమౌళి సినిమాల్లో సింహాద్రి తనకు చాలా ఇష్టమని, అవకాశం వస్తే ఆ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నానని అంటున్నాడు వినాయక్. మరి అదెప్పుడు నెరవేరుతుందో చూడాలి.