'వాల్తేరు వీరయ్య' నుంచి మరో పాట ఈ రోజు విడుదలైంది. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' అంటూ సాగే డ్యూయెట్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని మైకా సింగ్, గీతా మాధురి పాడారు. శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. దేవిశ్రీ అందించిన పెప్పీ ట్యూన్ ఇది. వినగానే.. నచ్చేసేలా ఉంది. చిరు కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. అన్నిటికంటే ముఖ్యంగా చిరు వేసిన గ్రేసీ స్టెప్స్.. ఈ పాటకు కొత్త కళ తీసుకొచ్చాయి. అవన్నీ థియేటర్లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించడం ఖాయం.
ఈ ఆల్బమ్ లో దేవిశ్రీ ఎక్కువగా మాస్ పాటలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ లో చిరు స్టెప్పులేసే అవకాశం రాలేదు. ఆ లోటుని.. ఈ సినిమాలో వడ్డీతో సహా తీర్చుకొన్నట్టు కనిపిస్తోంది. బాస్ పార్టీ, చిరంజీవి - శ్రీదేవి, పూనకాలు లోడింగ్ పాటల్లో స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు `నీకేమో అందమెక్కువ` పాటలోనూ... క్లాసీ స్టెప్పులు వేశాడు చిరు. ఆడియో పరంగా..ఈ సినిమా హిట్టయిపోయినట్టే. మరి.. విజువల్ గా వెండి తెరపై ఎలా ఉంటుందో చూడాలి. ఈనెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి బాబి దర్శకుడు. రవితేజ ఓ కీలక పాత్ర పోషించారు.