టాలీవుడ్ లో ఓ హీరో దగ్గర్నుంచి మరో హీరోకి సినిమాలు మారడం చాలా సహజం. ఓ హీరోని దృష్టిలో ఉంచుకుని కథ రాసుకుంటారు. అయితే ఆ హీరో అందుబాటులో ఉండడు. అప్పుడు దొరికిన మరో హీరోతో ఎడ్జస్ట్ అవుతారు. ఇది సాధారణంగా జరిగేదే. `ది వారియర్` కూడా అలా చేతులు మారింది. ఒకరిద్దరు కాదు... కనీసం అరడజను మంది దగ్గరకు ఈ కథ వెళ్లింది. వాళ్లు రకరకాల కారణాల వల్ల రిజెక్ట్ చేస్తే.. ఇప్పుడు రామ్ తో తెరకెక్కించారు.
లింగుస్వామి దర్శకత్వంలో `ది వారియర్` రూపొందిన సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే విడుదల చేస్తారు. ఈ కథ ముందు అల్లు అర్జున్ కి వినిపించారు. తరవాత బాలకృష్ణ దగ్గరకు కూడా వెళ్లింది. హవీష్ అనే ఓ కొత్త కుర్రాడికీ ఈ కథ చెప్పారు. లింగుస్వామి తమిళ దర్శకుడు.. తమిళంలో విశాల్, కార్తి లాంటి హీరోలకు కూడా లింగుస్వామి ఈ కథ వినిపించాడట. వాళ్లంతా ఈ కథకు `నో` చెప్పారు. చివరికి అటు తిరిగి, ఇటు తిరిగి రామ్ దగ్గరకు వచ్చి ఆగింది. ఈ సినిమాపై రూ.75 కోట్ల పెట్టుబడి పెట్టారట. రామ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తుండడంతో ఈ సినిమాకి మార్కెట్ పరంగా కలిసొచ్చే అవకాశం ఉంది.