ఈ సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ సంక్రాంతి విజేత.. వాల్తేరు వీరయ్యే. చిరు కామెడీ టైమింగ్, వింటేజ్ లుక్, పాటలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. రవితేజ ఎపిసోడ్ సో.. సోగా సాగిన.. పెద్దగా ప్రమాదం ఏర్పడలేదు. కార్‌లో సీన్.. ఎమోషన్ బాగా పండించగలిగింది. అయితే రవితేజ పాత్రని పవన్ కల్యాణ్ చేసి ఉంటే.. ఈ సినిమా రేంజ్ ఎవరూ ఊహించనంతగా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే.. చిరు - పవన్‌ల బాండింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై వీళ్లని అన్నదమ్ములుగా చూసే ఛాన్స్ ఇప్పటి వరకూ రాలేదు. చిరు సినిమాల్లో పవన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు తప్ప.. పూర్తి స్థాయి పాత్ర చేయలేదు. వాల్తేరు వీరయ్యలో అందుకు ఛాన్స్ ఉంది. కానీ.. చిరు వాడుకోలేదు.
దీని వెనుక పెద్ద కారణమే ఉందన్నది మెగా కాంపౌండ్ వర్గాల మాట. చిరు- పవన్ ల కాంబో ఎప్పటికైనా అదిరిపోతుంది. ఈ కాంబోలో ఓ సినిమా తప్పకుండా ఉంటుంది. అన్నయ్య అడిగితే పవన్ కాదనడు. ఇప్పుడే... దాన్ని వాడకూడదన్నది చిరు ఆలోచన. వాల్తేరు వీరయ్య ఫక్తు కమర్షియల్ సినిమా. ఇలాంటి సినిమాలకు ఎప్పుడూ గ్యారెంటీ ఉండదు. ఆడితే హిట్టు. లేదంటే ఫట్టు. ఈ కాంబోని ఇలాంటి రిస్కీ కథల్లో తీసుకురావడం చిరంజీవికి ఇష్టం లేదు. కథపై బలంగా నమ్మకం ఉన్నప్పుడు.. పవన్ తప్ప.. మరెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరు అనుకొన్నప్పుడు మాత్రమే పవన్‌తో సినిమా చేయాలని చిరు భావిస్తున్నాడట. అందుకే వాల్తేరు వీరయ్యలో పవన్ లేడు. ఉండి ఉంటే... బాస్సులు బద్దలైపోయేవి.