జనవరి 7న రావాల్సిన 'ఆర్.ఆర్.ఆర్' నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు వేసవిలోనే రావొచ్చు. అయితే... 'ఆర్.ఆర్.ఆర్' వల్ల... ఇప్పుడు 'ఆచార్య' కూడా అనుకున్న సమయానికి రావడం లేదన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఫిబ్రవరి 4న `ఆచార్య` రిలీజ్ అవ్వాల్సివుంది. అయితే 'ఆర్.ఆర్.ఆర్' వాయిదా పడడంతో.. ఇప్పుడు 'ఆచార్య'నీ వాయిదా వేయాల్సివస్తోందట. ఆచార్యకీ, ఆర్.ఆర్.ఆర్‌కీ లింకేంటి? ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడితే, ఆచార్య ఎందుకు వాయిదా పడాలి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ రెండు సినిమాల మధ్య ఓ లోపాయికారీ ఒప్పందం జరిగిందన్నది ఫిల్మ్‌నగర్ లో హాట్ టాపిక్. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే. ఆచార్యలోనూ చరణ్ ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో చరణ్ బిజీగా ఉన్నప్పుడు.. తన కాల్షీట్లు ఆచార్యకి అవసరమయ్యాయి. ఆ సమయంలోనే.. ''ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తరవాతే... ఆచార్య విడుదల చేయాలి'' అని రాజమౌళి షరతు విధించాడట. దానికి 'ఆచార్య' టీమ్ కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. 'ఆర్.ఆర్.ఆర్' లో చరణ్ ఉన్నాడు. తన సినిమాల ప్రభావం.. ఆర్.ఆర్.ఆర్‌పై పడకుండా చూడాలన్నది రాజమౌళి ఆలోచన కావొచ్చు. అందుకే ఈ షరతు విధించి ఉండొచ్చు. దానికి అప్పట్లో ఆచార్య టీమ్ కూడా సరే అంది. అందుకే జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ వస్తే... ఫిబ్రవరి 4న తమ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడింది. ఫిబ్రవరి 4 కంటే ముందు ఆర్.ఆర్.ఆర్ వచ్చే అవకాశం లేదు. అన్నీ కుదిరితే ఏప్రిల్ లో రావొచ్చు. అంటే ఆచార్య ఏప్రిల్ తరవాతే విడుదల అవ్వాలన్నమాట.