సైరా.. సైరా.. సైరా అన్ని చోట్లా ఇదే మాట. సైరా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది? ఎన్ని సంచలనాలు సృష్టిస్తుంది? అని ఆశగా ఎదురుచూస్తున్నారంతా. తొలి రోజు నుంచే సైరా రికార్డుబ్రేకింగులు మొదలైపోయాయి. ఈ సంచలనం ఎప్పటికి ఆగుతుందో చూడాలి. చిత్రసీమ నుంచి అంతా ముక్త కంఠంతో ఈ సినిమాని కీర్తిస్తున్నారు. చిరు కెరీర్‌లో నభూతో.. న భవిష్యతే అన్నట్టు మాట్లాడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ట్వీట్లు చేస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈ సినిమాకి చాలా ప్రాధాన్యం ఇచ్చింది.
తెలుగు మీడియా అయితే... రేటింగుల వర్షం కురిపించింది. అలాగని.. సైరా ఎలాంటి కంప్లైంట్స్ లేని సినిమా అని చెప్పలేం. లూప్ హోల్స్ చాలా కనిపిస్తాయి. ఇంకా బాగా తీయాల్సింది అనే ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతుంది. ల్యాగ్ అయిన సందర్భాలు, అనవసరమైన సన్నివేశాలు, లింకులు కుదరని వైనాలు.. వరుస కడతాయి. కాకపోతే.. అవన్నీ చిన్నవి అయిపోయాయి. వాటికి చాలా కారణాలున్నాయి.
* చిరంజీవి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పన్నెండేళ్ల కల ఈ సినిమా. రెండేళ్లకు పైగా కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు.
* ఓ పోరాట యోధుడి కథ ఇది. పైగా తెలుగు గడ్డపై పుట్టిన ఓ దేశభక్తుడి కథ. ఆ కోణంలో చూస్తే.. తెలుగువాళ్లంతా ఈ సినిమా చూసి గర్వపడాలి.
* దేశ భక్తి కోణం అనేది ఎప్పటికీ గొప్ప కమర్షియల్ అంశమే. దాన్ని సరిగా ప్రజెంట్ చేయగలిగితే, ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించగలిగితే సక్సెస్ అయిపోతుంది. సైరా సీక్రెట్ అదే.
* చిరంజీవి వయసు 64 ఏళ్లు. ఈ వయసులో ఇలాంటి పాత్ర ఎంచుకోవడం, అందుకోసం ఎంతో హార్డ్ వర్క్ చేయడం.. ఇవన్నీ గొప్ప విషయాలు. చిరంజీవి వయసుకి, స్టార్ హోదాకీ గౌరవం ఇవ్వాల్సిన సమయం ఇది. ఆ గౌరవాన్ని విజయం రూపంలో అందిస్తున్నారు.
* అమితాబ్ బచ్చన్ ని తొలిసారి తెలుగు స్క్రీన్‌పై చూపించిన ఘనత సైరాకే దక్కుతుంది. అందుకే... ఈ సినిమా అంత స్పెషల్‌గా నిలిచింది.
* పాన్ ఇండియా ఇమేజ్ తో విడుదలైన సినిమా ఇది. హిందీ నాట తెలుగు సినిమాలకు గౌరవం పెరుగుతున్న తరుణంలో.. సైరా లాంటి సినిమాలు హిట్టయితే... టాలీవుడ్ ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుంది. అందుకే సైరాని ఓ ప్రత్యేక కోణంలో చూస్తున్నారు.
* ఇవన్నీ పక్కన పెట్టినా.. ఓ కమర్షియల్ సినిమాలో ఎన్ని హంగులు ఉండాలో అవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. సైరా అనే దేశ భక్తుడి కథని, మన ఫక్తు కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం అందరికీ నచ్చింది. అందుకే.. ఈ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు.