తారాగణం: సునీల్, మనీషా రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ: మహాలక్ష్మి ఆర్ట్స్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: సుందర్
సంగీతం: గోపి సుందర్
నిర్మాత-దర్శకత్వం: N శంకర్
రేటింగ్: 2/5
హాస్యనటుడిగా స్టార్ హోదా దక్కించుకున్నాడు సునీల్. అక్కడితో ఆగలేదు... హీరోగా రాణించాలన్న మొండి పట్టుదలతో తన సేఫ్ జోన్‌ని వదిలేసి.. హీరోయిజం చూపించాలని తాపత్రయ పడ్డాడు. కాకపోతే.. సునీల్ ఏం ఈజీగా హీరో అయిపోలేదు. సిక్స్ ప్యాక్ చేశాడు, డాన్సులకు పదును పెట్టాడు. యాక్షన్ సీన్స్‌లో కష్టపడ్డాడు. మొత్తానికి ఓ కమర్షియల్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయని చూపించాడనికి.. అహర్నిశలూ శ్రమించాడు. దానికి తగ్గట్టే.. ఆరంభంలో కొన్ని విజయాలూ అందాయి. అయితే కొంతకాలంగా... పరాజయాలు అతన్ని వెంటాడుతున్నాయి.
అయితే సునీల్‌పై నమ్మకంతో పెట్టుబడి పెట్టేవాళ్లూ... ఇప్పటికీ థియేటర్‌కి వెళ్లి సునీల్‌లోని హీరోయిజం చూడాలనుకున్నవాళ్లకు కొదవలేదు. అందుకే ఫ్లాపులు వస్తున్నా.. అతని చేతిలో సినిమాలున్నాయి. ఈ క్రమంలో అతన్నుంచి వచ్చిన మరో సినిమా... 2 కంట్రీస్. మరి ఇదైనా సునీల్ శ్రమకు తగిన ఫలితాన్ని ఇచ్చిందా? దర్శక నిర్మాతగా శంకర్ ప్రయత్నం సఫలం అయ్యిందా?
* కథ
ఉల్లాస్ (సునీల్)కి డబ్బంటే పిచ్చి. పటేల్ (షాయాజీ షిండే) దగ్గర చేసిన అప్పులకు తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే... పటేల్ కంటే బాగా డబ్బున్న లయ (మనీషా రాజ్) కనిపించే సరికి.. తనకు లేనిపోని అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకుంటాడు. లయ మాత్రం ఉల్లాస్‌ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. కానీ... తనని ప్రేమించిందీ పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసమే అనే సంగతి తెలుస్తుంది. ఈ దశలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకొంది? ఆ తరవాత కథ ఏ మలుపు తిరిగింది? అనేదే.. 2 కంట్రీస్ స్టోరీ.
* నటీనటుల ప్రతిభ
సునీల్ తన వంతు కష్టపడ్డాడు. కామెడీ పండించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. తనొక్కడే కష్టపడితే చాలదు. టీమ్ అంతా సపోర్ట్ చేయాలి. ఈ సినిమాలో లెక్కలేనంత కమెడియన్లు ఉన్నా.. ఫలితం లేకపోయింది. తెరపై ప్రతీ ఒక్కరూ ఏదో చేద్దామని ప్రయత్నిస్తుంటారు. కానీ.. కావల్సిన వినోదం మాత్రం పండదు.
మనీషా రాజ్ తెలుగుమ్మాయిలా కనిపించింది. తన వంతు న్యాయం చేసింది. తనకంటూ కొన్ని అవకాశాలు రావొచ్చు. మిగిలిన వాళ్లంతా పేరు గొప్ప.. క్యారెక్టర్ దిబ్బ.. అన్నట్టు తయారైంది.
* విశ్లేషణ
మలయాళంలో విజయవంతమైన 2 కంట్రీస్‌కి ఇది రీమేక్. పేరుని కూడా అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నారంటే.. కథ కథనాల విషయంలో ఎంత మక్కీకి మక్కీ వెళ్లిపోయి ఉంటారో అర్థం చేసుకోవొచ్చు. మాతృకలోని సన్నివేశాల్ని కానీ, ఎమోషన్‌ని గానీ వాడుకోవడంలో దర్శకుడు ఎలాంటి మొహమాటానికీ లోను కాలేదు. ఓ విధంగా చెప్పాలంటే కట్, పేస్ట్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. సునీల్ అంటే కామెడీ. తన నుంచి వినోదాన్ని ఆశించే ధియేటర్లకు వస్తారు. అలాంటి వినోదాన్ని అందించేంత స్కోప్ ఈ కథకు ఉంది. కానీ.. సన్నివేశాల్లో బలం లేకపోవడం, కామెడీ పేరుతో లేని పోని పంచ్‌ల కోసం తాపత్రయ పడడంతో.. 2 కంట్రీస్ నిరుత్సాహ పరుస్తుంటుంది.
అసలు ఈ కథలో ఏమంత కొత్తదనం ఉందని రీమేక్ చేయాలనుకున్నారో అర్థం కాదు. కథ కొత్తది కాకపోయినా... అందులోంచి పుట్టే వినోదం, భావో ద్వేగాలైనా కొత్తగా ఉండాలి. ఈ విషయంలోనూ 2 కంట్రీస్ నిరుత్సాహపరుస్తుంది. తొలి సగం చాలా భారంగా సాగుతుంది. సునీల్ శైలి వినోదం, వెటకారం అక్కడక్కడ పండినా.. డల్ మూమెంట్స్ ఎక్కువగా ఉండడం, సన్నివేశాల్లో సాగదీత కనిపించడంతో... ఇంట్రవెల్ కార్డు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తుంటాడు ప్రేక్షకుడు.
ద్వితీయార్థంలో కాస్త మార్పు కనిపిస్తుంది. తొలి సగంతో పోలిస్తే.. సెకండాఫ్ చాలా బెటర్. ఎమోషన్స్ పండించే స్కోప్ దక్కింది. ఉల్లాస్ అనే మరో పాత్రని రంగంలోకి దించి కథలో కొత్త మలుపుకి ఆస్కారం ఇచ్చాడు దర్శకుడు. అయితే.. ట్రీట్ మెంట్ పరంగా లోపాలు ఉండడంతో.. కీలకమైన ఆ పాయింట్ కూడా కనెక్ట్ కాలేదు.
* సాంకేతిక వర్గం
శంకర్ సొంత సినిమా ఇది. నిర్మాత కూడా తానే అవ్వడంతో.. ఖర్చుకి ఎక్కడా వెనకడాలేదు. సన్నివేశాలన్నీ రిచ్‌గా ఉన్నాయి. రెండు పాటలు.. అందులోని సాహిత్యం.. బాగున్నాయి. తెరపై రంగుల హరివిల్లులా తీర్చిదిద్దారు. శ్రీధర్ సిపాన కలం... చాలా సందర్భాల్లో కదం తొక్కింది. కాకపోతే.. సన్నివేశాల్లో అంత బలం లేకపోవడంతో తేలిపోయింది.
శంకర్ శైలికి చాలా దూరంగా ఉన్న కథ ఇది. దాన్ని నెత్తిమీద పెట్టుకొని ఏదో ప్రయత్నించాడు. కాకపోతే కథలో కొత్తదనం లేకపోవడం, వినోదం పండకపోవడం ఈ సినిమాకి భారంగా మారాయి.
* బలాలు
+ టెక్నికల్ టీమ్
+ క్వాలిటీ
* బలహీనతలు
- అన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: 2 కంట్రీస్... మంది ఉన్నా.. ప్రయోజనం సున్నా..
రివ్యూ బై శ్రీ