తారాగణం: అనుష్క శెట్టి, జయరాం,ఉన్ని ముకుందన్, ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, ధనరాజ్, మురళి శర్మ, విజయ్, విధ్యుల్లేఖ రామన్
నిర్మాణ సంస్థ: UV క్రియేషన్స్ & స్టూడియో గ్రీన్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మదీ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, జ్ఞానవేల్ రాజ్
రచన-దర్శకత్వం: అశోక్
రేటింగ్: 2.75/5
భారీ బడ్జెట్ పెట్టగలిగే లేడీ ఓరియెంటెడ్ కథల్ని మోయగల దమ్మున్న ఒకే ఒక్క కథానాయిక ... మన తెలుగులో అనుష్కనే. తాను సంపాదించుకున్న బ్రాండ్ అలాంటిది. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకుంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు తనకు నచ్చిన కథల్ని ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని తీసుకొస్తోంది. ఈ ప్రయాణంలో.. తన నుంచి వచ్చిన మరో చిత్రం `భాగమతి`. బాహుబలి తరవాత అనుష్క మరీ.. ఆచి తూచి అడుగులేస్తోంది. దాంతో `భాగమతి`లోనూ ఏదో సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందని తన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాల్ని `భాగమతి` ఏ మేరకు అందుకుంది..? `భాగమతి`గా అనుష్క ఏం చేసింది?
* కథ
రాష్ట్రంలోని పురాతన దేవాలయాల్లో విలువైన విగ్రహాలు మాయం అవుతుంటాయి. మీడియా మొత్తం దేవాదయ శాఖమంత్రి ఈశ్వర ప్రసాద్ (జయరామ్) ని టార్గెట్ చేస్తుంది. అయితే ఈశ్వర ప్రసాద్ నిజాయతీకి మారుపేరు. దోషులెవరో తేలకపోతే... తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటిస్తాడు. దాంతో ముఖ్యమంత్రి సీటుకు ముప్పొస్తుంది. ఈశ్వర ప్రసాద్ లాంటివాళ్లుంటే.. పార్టీకి మేలు జరగదని హై కమాండ్ భావిస్తుంది. అందుకే తనని ఎలాగైనా సరే.. ఏదో ఓ స్కామ్‌లో ఇరికించాలని.. సీబీఐని రంగంలోకి దించుతుంది. ఈశ్వర ప్రసాద్ పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన చంచల (అనుష్క)ని విచారిస్తే ఈశ్వర ప్రసాద్ అసలు జాతకం బయటపడుతుందని... ఆమెని ఇంట్రాగేషన్ చేయాలనుకుంటారు. అయితే అప్పటికే చంచల ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. అలాంటి చంచలను జైలు నుంచి రహస్యంగా భాగమతి బంగ్లాకి తీసుకొస్తారు. ఆ బంగ్లాలో చంచలకు రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. భాగమతి ఆత్మ.. చంచలలోకి ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏమైంది?? అసలు భాగమతి ఎవరు? చంచలను ఎందుకు టార్గెట్ చేసింది? అనేదే కథ
* నటీనటులు
అనుష్క సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించేసింది. చంచల, భాగమతి.. ఈ రెండు రూపాల్లోనూ విశ్వరూపం చూపించింది. భాగమతిగా అనుష్క కనిపించింది కాసేపే. అయితే ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. అయితే అనుష్క మరీ లావుగా కనిపించడం ఇబ్బందిగా ఉంటుంది. అనుష్క కాస్త తగ్గితే మంచిది.
తమిళం వాళ్లకి జయరామ్ బాగా తెలుసు. మన వాళ్లకు అంతగా పరిచయం లేదు. ఆ పాత్రలో తెలుగువాళ్లకు తెలిసిన నటుడ్ని తీసుకుంటే బాగుండేది. జయరామ్ నటన బాగానే ఉన్నా.. ప్రేక్షకుడి అనుమానాలన్నీ తనవైపే ఉంటాయి.
ధన్‌రాజ్, ప్రభాస్ శీను ఓకే అనిపిస్తారు. కమిడియన్లు ఉన్నారు కదా అని వాళ్లతో వెకిలి వేషాలు వేయించకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. మురళీ శర్మకి మరోసారి మంచి పాత్ర దక్కింది.
* విశ్లేషణ
ఇదో పొలిటికల్ డ్రామా. అందులో హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేశాడు దర్శకుడు. తొలి సగం అంతా హారర్ వాతావరణం కనిపిస్తుంది. భాగమతి బంగ్లాలో చంచలకు ఎదురైన అనుభవాలు భయపెట్టేవే. ఓ వైపు సీరియస్‌గా ఇంట్రాగేషన్ జరుగుతుంటుంది, మరోవైపు.. భాగమతి తాలుకూ ఆత్మకు సంబంధించిన సన్నివేశాలు వస్తుంటాయి.
అలా ఓ వైపు కథ చెబుతూ.. మరో వైపు హారర్‌ని మిక్స్ చేస్తూ... కథని దర్శకుడ చాలా తెలివిగా డీల్ చేశాడు. విశ్రాంతికి ముందు... భాగమతి అసలు అవతారం తెలుస్తుంది. ఆ సన్నివేశంలో అనుష్కని ఎలివేట్ చేసిన విధానం తప్పకుండా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. తొలి భాగం పూర్తయ్యే సరికి ఈ బంగ్లాలో ఏదో ఉందన్న భావన క్రియేట్ చేయడంలో దర్శకుడు నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ వరకూ... భాగమతి బంగ్లా చుట్టూనే కథ నడిపించాడు.
పతాక సన్నివేశాలకు ముందు ఈ కథలో మరో కోణం బయటకు వస్తుంది. అది తప్పకుండా షాక్ కి గురి చేసేదే. హారర్ సినిమా కాస్త మళ్లీ పొలిటికల్ డ్రామా రంగు పులుముకుంటుంది. అంతకు ముందు జరిగిన సన్నివేశాలకు లింకులు వేసుకుంటూ మరికొన్ని షాట్లు చూపించాడు దర్శకుడు. దాంతో అప్పటి వరకూ వేధించిన చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్టైంది.
వేసిన చిక్కుముడులకు సమాధానంగా మరికొన్ని సన్నివేశాలు రాసుకోవడం.. ప్రేక్షకులకు సంతృప్తి కలిగే ఫీల్ తీసుకురావడం కష్టమైన వ్యవహారమే. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించినా.. క్లైమాక్స్ కాస్త బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ విషయంలో కూడా ఏదైనా కొత్తగా, ప్రేక్షకులకు షాక్ ఇచ్చేలా ఆలోచిస్తే మరింత బాగుండేది. అయితే... అప్పటి వరకూ వచ్చిన ఫీల్ మాత్రమే గుర్తు పెట్టుకొని బయటకు వస్తే.. భాగమతి టికెట్ పైసలకు సరిపడా థ్రిల్ ఇచ్చేసినట్టే.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ టీమ్ చాలా బాగా పనిచేసింది. అందరికంటే ఎక్కువ మార్కులు తమన్‌కి పడతాయి. తన ఆర్.ఆర్‌తో సినిమాని చాలా ఎలివేట్ చేశాడు. ఈమధ్య కాలంలో తన నుంచి వచ్చిన బెటర్ అవుట్ పుట్ ఇది.
క్రియేటీవ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఎస్.రవీందర్ వేసిన భాగమతి సెట్.. ఈచిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. అది సెట్టా? నిజంగానే పురాతన భవనమా? అని తెలుసుకోలేనంత ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఆ సెట్‌ని దర్శకుడు వాడుకున్న విధానం కూడా బాగుంది. ఈమధ్య కాలంలో తెలుగులో చూసిన బెస్ట్ ఆర్ట్ వర్క్ ఇదే కావొచ్చు.
మది కెమెరాపనితనం ఈ కథకు మరింత వన్నె తీసుకొచ్చింది. ఆశోక్ రాసుకున్న కథ సాధారణమైనదే. అయితే దానికి ట్విస్టులు జోడించి షాక్ ఇచ్చాడు. పతాక సన్నివేశాలు నిరాశ పరుస్తాయి.
* ప్లస్ పాయింట్స్
+ అనుష్క
+ నేపథ్య సంగీతం
+ మలుపులు
+ భాగమతి బంగ్లా సెట్
* మైనస్ పాయింట్స్
- క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: అనుష్క కోసం చూసేయొచ్చు
రివ్యూ బై శ్రీ