తారాగణం: మహేష్ బాబు, కియారా అద్వాని, ప్రకాష్ రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ: DVV ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్ & తిరు
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: DVV దానయ్య
రచన-దర్శకత్వం: కొరటాల శివ
రేటింగ్: 3/5
మహేష్‌బాబు ఓ సూపర్ హిట్టు కొడితే ఆ స్థాయి ఎలా ఉంటుందో... ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు సినిమాలు నిరూపించాయి. శ్రీమంతుడు తరవాత మహేష్‌కి హిట్టు పడలేదు. బ్రహ్మోత్సవం, స్పైడర్ దారుణంగా దెబ్బతీశాయి. దాంతో మరోసారి `శ్రీమంతుడు` మ్యాజిక్‌ని నమ్ముకుని.. కొరటాలకు ఛాన్సిచ్చాడు మహేష్. వీరిద్దరి కాంబో అనగానే బాక్సాఫీసు దగ్గర అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ తొలిసారి ఓ పొలిటికల్ డ్రామా చేయడం, ఈ సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ అవ్వడంతో `భరత్ అనే నేను`పై ఫోకస్ మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. `ఈసారి హిట్ కొట్టి చూపిస్తాను` అని మహేష్ ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడా, లేదా?
* కథ
భరత్ రామ్ (మహేష్ బాబు) లండన్‌లో చదువుకుంటుంటాడు. తన తండ్రి రాఘవ (శరత్‌కుమార్) ఆంధ్ర ప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. ఆయన మరణించడంతో... ఆ స్థానంలోకి భరత్ వస్తాడు. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఆక్షణం నుంచి... ప్రజల కోసం తపిస్తాడు. వాళ్ల కోసం కొత్త పథకాల్ని ప్రవేశ పెడతాడు. సొంత పార్టీ వాళ్లని సైతం ఎదిరిస్తాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన సవాళ్లేంటి? అందులోంచి ఎలా బయటపడ్డాడు? అనేదే కథ.
* నటీనటులు
మహేష్ మరోసారి వన్ మ్యాన్ షో చేశాడు. అతని నవ్వు దగ్గర నుంచి నటన వరకూ అన్నీ సూపరే. కాస్ట్యూమ్స్ బాగున్నాయి, స్టైలింగ్ ఇంకా బాగుంది. ప్రెస్ మీట్లో, అసెంబ్లీలో మహేష్ చెప్పిన డైలాగులు క్లాప్స్ కొట్టిస్తాయి. ఓ చోట.. మీసాలు పెట్టుకుని కొత్తగా కనిపించాడు.
కైరా అడ్వానీకి ఇది తెలుగులో మంచి ప్రారంభం. కానీ... ఆ పాత్ర ద్వితీయార్థంలో పెద్దగా కనిపించదు.
ప్రకాష్ రాజ్ మరోసారి ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ, అజయ్... వీళ్లంతా ఓకే అనిపిస్తారు. విలన్ గ్యాంగ్ పటిష్టంగా లేకపోవడం ఈ కథలో ప్రధానమైన లోపం. తెరపై ఎంతమంది కనిపించినా.. కళ్లన్నీ మహేష్‌పైనే ఉంటాయి కాబట్టి.. మిగిలిన పాత్రల్ని పెద్దగా ఎలివేట్ చేయలేదేమో.
* విశ్లేషణ
ఇదో పొలిటికల్ డ్రామా. పూర్తిగా రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. ఓ కథానాయకుడు ముఖ్యమంత్రి అయితే.. అన్నీ మంచి పనులే చేస్తాడు, చేయాలి. భరత్ కూడా అంతే. ఒకే ఒక్కడులో అర్జున్, లీడర్‌లో రానా ఏం చేశారో... భరత్ కూడా అదే చేస్తాడు. అయితే ఇంకాస్త కమర్షియల్ టచ్‌తో. భరత్ ముఖ్యమంత్రి అయ్యాకే కథలో స్పీడొస్తుంది. ట్రాఫిక్ రూల్స్‌ప్రవేశ పెట్టడంతో కథ మరింత ఊందుకుంటుంది. రాష్ట్రం ఇలా అయిపోతే బాగుణ్ణు, అలా అయిపోతే బాగుణ్ణు అని సగటు ప్రేక్షకుడు అనుకునే అంశాలనే తన సినిమాలో సన్నివేశాలుగా పెట్టాడు కొరటాల.
దాంతో ఆయా సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. మధుమతితో ప్రేమకథ కూడా బాగుంది. కథని సైడ్ ట్రాక్ పట్టనివ్వకుండా ఇలాంటి సైడ్ ట్రాక్ లు అతికించడం చాలా కష్టం. అయితే కొరటాల చాలా బాగా డీల్ చేయగలిగాడు. విశ్రాంతి ఘట్టం వరకూ కథలో ఎలాంటి కుదుపులూ ఉండవు. అయితే సెకండాఫ్‌లో చాలా లాజిక్కులు తప్పుతాయి.
భరత్ సీఎమ్‌గా రాజీనామా చేయడం వెనుక బలమైన కారణం ఉండదు. తండ్రి మరణానికి సంబంధించిన కుట్ర ఛేదించడానికి టైమ్ వేస్ట్ చేశాడు. చాలా సన్నివేశాల్ని ట్రిమ్ చేయొచ్చు. ఫస్టాఫ్‌లో వదిలేసిన హీరోయిన్‌ని మళ్లీ వెదికి పట్టుకుని సెకండాఫ్‌లో కలపడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. సీరియెస్ డ్రామా నేపథ్యంలో ఫన్ మిస్సయ్యింది. `వచ్చాడయ్యో సామీ` పాట దగ్గర సినిమాకి మళ్లీ కాస్త జోష్ వస్తుంది. ప్రెస్ మీట్ సీన్లో ఇంకాస్త పుంజుకుంటుంది. కానీ.. క్లైమాక్స్ ముందు ఎప్పటిలా కొరటాల చేతులెత్తేశాడు.
ఫస్టాఫ్ లా సెకండాఫ్ ఉంటే.. శ్రీమంతుడు సినిమాని మించిన విజయం అందుకునేది. అక్కడక్కడ బిట్లు బిట్లుగా చూస్తే సినిమా బాగుందనిపిస్తుంది. అయితే.. ఎక్కడో ఏదో అసంతృప్తి. ప్రకాష్ రాజ్‌కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా, ఎందుకు అవ్వలేదు? ఓ సీఎమ్ ఫైట్లు చేయడం ఏమిటి? మాజీ సీఎమ్ రైల్వే స్టేషన్‌లో కనిపిస్తే. జనం పట్టించుకోరా? ఇలాంటి లాజిక్కులకు అందని విషయాలు చాలా ఉంటాయి.
* సాంకేతిక వర్గం
దేవిశ్రీ సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. జీవం లేని సీన్‌లోనూ.. తన ఆర్.ఆర్‌తో బలం అందించాడు. పాటలన్నీ బాగున్నాయి. వచ్చాడయ్యా సామీ.. వచ్చిన టైమింగ్, ఆ పాటని వాడుకున్న విధానం ఆకట్టుకుంటుంది. భరత్ అనే నేను పాట హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడింది. కెమెరా వర్క్ సూపర్బ్. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపించాయి. విజువల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది.
కొరటాల శివ దర్శకుడిగా, కథకుడిగా రాణించాడు. అయితే గుర్తుండిపోయే సంభాషణలేవీ పెద్దగా వినిపించవు. నిడివి ఎక్కువ అవ్వడం కూడా ప్రధాన సమస్యే. అవసరం లేని సన్నివేశాల్ని ఇంకా కుదించుకోవచ్చు.
* ప్లస్ పాయింట్స్
+ మహేష్ నటన
+ విజువల్స్
+ పాటలు
+ ప్రెస్ మీట్ సీన్
* మైనస్ పాయింట్స్
- బలమైన డ్రైవింగ్ పాయింట్ లేదు
- లాజిక్ మిస్సింగ్
- నిడివి
* ఫైనల్ వర్డిక్ట్: హామీ నిలబెట్టుకున్నాడు
రివ్యూ రాసింది శ్రీ