తారాగణం: కార్తి, సాయేషా సైగల్, సత్యరాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్
సంగీతం: ఇమాన్
ఛాయాగ్రహణం: వీరసమర్
ఎడిటర్: రుబెన్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
రచన-దర్శకత్వం: పాండిరాజ్
రేటింగ్: 2.75/5
తమిళ నాట పాండిరాజ్‌కి మంచి పేరొంది. హృద్యమైన కథలు బాగా తీస్తాడు. కార్తీ యేమో మాస్ ఇమేజ్ ఉన్న నటుడు. మరి వీరిద్దరూ కలిసి చేసిన `చినబాబు` సినిమా ఏ జోనర్‌లో ఉంటుంది? అని ఆసక్తిగా ఎదురు చూశారు ప్రేక్షకులు. పాండిరాజ్ మాత్రం.. కార్తి శైలికే ఎడ్జిస్ట్ అవుతూ, అక్కడక్కడ తనదైన ముద్ర చూపిస్తూ `చినబాబు` తీశాడేమో అనిపించింది. ఇంతకీ ఈ `చినబాబు` ఎలా ఉన్నాడు? కార్తీ ముద్ర ఎంత? పాండిరాజ్ స్టైల్ ఎంత? మొత్తంగా చూస్తే... ఎవరి కోసం ఈసినిమా తీశారు?
* కథ
రుద్రరాజు (సత్యారాజ్)కి అయిదుగురు ఆడపిల్లలు. వాళ్లందరి ఆలనా పాలనా చూడ్డానికి ఒక మగ పిల్లాడు పుట్టాలని ఆశపడతాడు. తనకోసమే రెండో పెళ్లి కూడా చేసుకుంటాడు. చివరికి కృష్ఱంరాజు అనబడే చినబాబు (కార్తి) పుడతాడు. తండ్రిలానే చినబాబుకి కూడా కుటుంబం అంటే ప్రేమ. తనకిద్దరు మేనకోడళ్లు. వాళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని కుటుంబం మొత్తం ఆశ పడుతుంది. కానీ చినబాబు మాత్రం లీలా (సాయేషా)ని ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైపోతుంది. అక్కలు, బావలు కోపంతో అలిగి వెళ్లిపోతారు. వీళ్లందరినీ మళ్లీ చినబాబు ఎలా కలిపాడు? అనేదే `చినబాబు` స్టోరీ.
* నటీనటులు
నటనలో ఎలాంటి తప్పుల్ని పసిగట్టే అవకాశం ఇవ్వడు కార్తి. మరోసారి... నూటికి నూరుపాళ్లు న్యాయం చేసేశాడు. అయిదుగురు అక్కల ముద్దుల తమ్ముడిగా కార్తి నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
సాయేషా సైగల్ కొత్తగా కనిపించింది. సహజంగా నటించింది. ఇంటి పెద్దగా హుందాదనం నిండిన పాత్రలో ఆకట్టుకున్నాడు సత్యరాజ్. సూరి పంచిన వినోదం మరో హైలెట్. తనే ఈ సినిమాకి అతి పెద్ద ఎస్సెట్.
* విశ్లేషణ
ఓ ఉమ్మడి కుటుంబం, అందులోని అనుబంధాలు, అలకలు, కోపతాపాలు, గొడవలు.. చివరికి మళ్లీ కలుసుకోవడం ఇదే చినబాబు కథ. కథలో కొత్తదనం ఆశించకూడదు. కాకపోతే... ఆ సన్నివేశాలు, అందులోంచి పుట్టిన వినోదం ఇవన్నీ ఈ కథకు బలాలు. ఎమోషన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందులో కొత్తదనం ఎందుకు కోరుకుంటారు? ఓ కుటుంబం అంతా కలసి సందడి సందడి చేయడం ఎప్పుడూ చూడానికి బాగుంటుంది.
`చినబాబు` లో సన్నివేశాలు ఇలానే ఉంటాయి. అయిదుగురు అక్కలు, బావలు, వాళ్ల పిల్లలు.... ఇలా ఊహించుకుంటుంటేనే.. ఫ్రేమ్ నిండిపోతోంది కదా. వాళ్ల మధ్య ఉండే సహజ సిద్ధమైన అనుబంధాన్ని కళ్లకు కట్టాడు దర్శకుడు. ఓ ఇంట్లో వేడుక జరుగుతుంటే.. చాలామంది సంతోషిస్తారు. కొంతమంది మాత్రం వంకలు పెడతారు. `మాకేం పెట్టారు? ` అంటూ నొసలు చిట్లిస్తారు. అలాంటి సన్నివేశాల్ని ఇందులో తెలివిగా జోడించి సహజత్వం తీసుకొచ్చాడు పాండిరాజ్.
తన బలం ఏమిటంటే.... వినోదం. సన్నివేశంలోంచి సందర్భానుసారంగా వినోదం పండించి... ఆహ్లాదకరంగా మార్చేశాడు. సినిమా సీరియెస్‌గా సాగుతున్నా.. ఎక్కడో ఓ చోట ఛమక్ విసురుతుంటాడు. అది ప్రేక్షకుల్ని పట్టేస్తుంది. ద్వితీయార్థంలో కాస్త సెంటిమెంట్ డోసు ఎక్కువైంది. తమిళ వాతావరణం, అక్కడి అరవగోల ఇవి మింగుడు పడడం కష్టమే. మధ్యమధ్యలో యాక్షన్ ఎపిసోడ్లు.. డబ్బింగ్ యాస పోని పాటలు... ఇవన్నీ చినబాబు స్పీడుకు బ్రేకులు వేస్తాయి. క్లైమాక్స్ లో మళ్లీ.. కాస్త జోరందుకున్నాడు పాండిరాజ్. సెంటిమెంట్ టచ్‌తో హృదయాల్ని బరువెక్కించాడు. మొత్తానికి అరవ యాసలో ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూసే వీలు దక్కింది.
* సాంకేతిక వర్గం
పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషులు, సంప్రదాయం ఇవన్నీ కెమెరా బాగా క్యాప్చర్ చేసింది. పాండిరాజ్ రాసుకున్నది ఓ మామూలు కథ. కానీ దాన్ని ఫ్యామిలీ సెంటిమెంట్‌తో, సున్నితమైన వినోదంతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. పాటల్లో అరవ వాసన ఎక్కువగా కొట్టింది. సెంటిమెంట్, ఫన్.. ఇవి రెండూ సంభాషణల్లో చక్కగా పలికాయి.
* ప్లస్ పాయింట్స్
+ ఎమోషన్స్
+ వినోదం
+ కార్తి
* మైనస్ పాయింట్స్
- రొటీన్ కథ
- అరవ వాతావరణం
* ఫైనల్ వర్డిక్ట్: చినబాబుని ఒకసారి చూడొచ్చు.
రివ్యూ రాసింది శ్రీ