తారాగణం: రాజశేఖర్, పూజ కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్, సంజయ్ రెడ్డి, సన్నీ లియోన్
నిర్మాణ సంస్థ: జ్యో స్టార్ ఎంటర్ప్రైజ్స్
సంగీతం: భీమ్స్ & శ్రీ చరణ్ పాహాల
ఛాయాగ్రహణం: అంజి, సురేష్, శ్యాం ప్రసాద్, గీకా, బకూర్
ఎడిటర్: ధర్మేంద్ర
నిర్మాతలు: కోటేశ్వర రాజు & మురళి శ్రీనివాస్
రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
యూజర్ రేటింగ్: 3/5
రాజశేఖర్‌కి హిట్టొచ్చి చాలాకాలం అయ్యింది. ఆయన గురించి పట్టించుకోవడమే మానేసిన తరుణంలో... ప్రవీణ్ సత్తారు అనే యువ దర్శకుడు రాజశేఖర్‌ని వెదుక్కొంటూ వెళ్లి కథ చెప్పడం.. దానికి రూ.30 కోట్ల బడ్జెట్ కేటాయించడం ఆశ్చర్యకరమైన విషయాలే. సన్నీలియోన్ ఎంట్రీ, ఈ కథకు `గరుడ వేగ` అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టడం మరింత ఆసక్తిని రేకెత్తించాయి. చాలా కాలం తరవాత రాజశేఖర్ సినిమా పూర్తి పాజిటివ్ బజ్‌తో విడుదల అవుతుండటం.. ఇదే తొలిసారి. మరి ఈ సినిమా ఎలా ఉంది?? అందరి అంచనాల్నీ అందుకొందా, లేదా? రాజశేఖర్‌కి కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా, మరో మగాడిగా దీన్ని చెప్పుకోవచ్చా??
* కథ..
ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథ ఇది. సన్నివేశాలే తప్ప.... చెప్పుకోవడానికి కథంటూ ఏం ఉండదు. శేఖర్ (రాజశేఖర్) ఎన్ ఐ ఏ ఆఫీసర్. కర్తవ్య నిర్వహణలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాల్సివస్తుంది. భార్య (పూజా కుమార్) అస్తమానూ సతాయిస్తూ ఉంటుంది. తన కోసమైనా ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకొంటాడు శేఖర్. ఈలోగా... శేఖర్‌కి ఓ ప్రమాదం జరుగుతుంది. అది అనుకోకుండా జరిగింది కాదు, కావాలని చేసిందే. దానికి కారణమైన వాళ్లని ఆరా తీసుకొంటూ వెళ్తుంటే.. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఓ రహస్య కోడ్‌ని డీకోడ్ చేస్తే... చార్మినార్ చుట్టూ బాంబు దాడి జరగబోతోందన్న విషయం తెలుస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే.. మరో సంగతి బయటపడుతుంది. అసలు దీనంతటికీ కారణం ఎవరు?? ఈ చిక్కుముడులన్నీ శేఖర్ ఎలా విప్పాడు? అనేదే మిగిలిన కథ.
* నటీనటుల ప్రతిభ..
రాజశేఖర్‌కి ఇది నిజంగా కమ్ బ్యాక్ సినిమానే. తనని కొత్తగా చూసే అవకాశం దక్కింది. రాజశేఖర్‌ని సరిగా వాడుకోవడం లేదేమో అనే ఫీలింగ్ ఈ సినిమాతో తీసుకొచ్చాడు ప్రవీణ్. నిజానికి ఇంకాస్త పెద్ద హీరోతో చేస్తే... ఈ సినిమా స్థాయి మరోలా ఉండేది. మరో తుపాకీ, బేబీ అయ్యేది. పూజా కుమార్, నాజర్ ఓకే అనిపిస్తారు.కిషోర్ ది ఓ స్పెషల్ ప్యాకేజ్. శ్రద్దాదాస్‌నీ బాగానే వాడుకొన్నాడు దర్శకుడు. సన్నీ ఐటెమ్ పాట.. మాస్‌ని ఊరిస్తుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.
* విశ్లేషణ..
తుపాకీ, బేబీ లాంటి సినిమాలు ఇది వరకు చాలా చూశాం. ఓ ఆఫీసర్... అతను చేసే ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథలే అవి. దాదాపుగా `గరుడవేగ` కూడా అంతే. కథగా చెప్పుకోవడానికి ఏం లేదు. సాధారణంగా ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ప్రధానం. దాన్ని చక్కగా రాసుకొన్నాడు ప్రవీణ్ సత్తారు. శేఖర్ తనకు దొరికిన కోడ్‌ని డీ కోడ్ చేసిన విధానం, చార్మినార్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రవీణ్ సత్తాని బయటపెట్టే సన్నివేశాలు, సందర్భాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. తొలిభాగం చాలా ఎంగేజింగ్‌గా సాగింది. తెరపై మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అనిపిస్తుంది. కథలో మలుపులు, దాన్ని రివీల్ చేసే పద్ధతికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమా ప్రారంభమే ఓ లెవిల్‌లో ఉంటుంది. డార్జిలింగ్‌లో తెరకెక్కించిన బైక్ ఛేజింగ్ ఎపిసోడ్ చూస్తే - ఇదేదో కొత్త సినిమా చూస్తున్నామన్న నమ్మకం కలుగుతుంది. అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ అలా అలా పెరుగుతుంటుంది. తొలిభాగంలో ఉన్న మెరుపులు ద్వితీయార్థంలో చూడలేం. కానీ... అక్కడ కూడా సినిమాని సమర్థవంతంగానే నడిపాడు. క్లైమాక్స్ ముందు కాస్త పట్టుజారినట్టు కనిపించినా... పతాక సన్నివేశాల్ని కొత్తగా డిజైన్ చేసి ఆకట్టుకొన్నాడు. ప్రతీ పాత్రకూ ఓ ప్రారంభం ముగింపు ఉండేలా చూసుకొన్నాడు ప్రవీణ్. దాంతో కథ ఎక్కడా గాడి తప్పలేదు. డైలాగ్ రైటర్‌గా, స్క్రీన్ ప్లే రైటర్‌గానూ... ప్రవీణ్ విజృంభించి ఓ కొత్త సినిమా చూశామన్న అనుభూతి మిగిల్చాడు.
* సాంకేతిక వర్గం...
టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. పాతిక కోట్లకుపైనే ఖర్చయ్యింది అనేది మాట వరసకు చెప్పే అంకె కాదని తెరపై విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. ఈ క్రెడిట్ నిర్మాతకు, కెమెరామెన్‌కు దక్కుతుంది. నేపథ్య సంగీతం అలరిస్తుంది. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. ద్వితీయార్థంలో ఒకట్రెండు మెరుపులు అద్దితే... ఈ సినిమా కచ్చితంగా వేరే స్థాయిలో ఉండేది. అయినా ఫర్వాలేదు. రాజశేఖర్ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమానీ చేర్చొచ్చు.
* ప్లస్ పాయింట్స్
+ కథనం
+ బైక్ ఛేజింగ్
+ ఇంట్రవెల్ ఎపిసోడ్
+ క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
- కాస్త నెమ్మదించిన సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: గరుడ వేగ... చూడాల్సిన సినిమానే
రివ్యూ బై శ్రీ