తారాగణం: కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంతా, విజయ్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, మాళవిక నాయర్, షాలిని పాండే తదితరులు
నిర్మాణ సంస్థలు: స్వప్న సినిమా & వైజయంతి మూవీస్
ఛాయాగ్రహణం: డ్యానీ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: మిక్కీ జే మేయర్
కథనం: సిద్ధార్థ్ శివసామి
మాటలు: సాయి మాధవ్ బుర్ర
నిర్మాతలు: స్వప్న దత్, ప్రియాంక దత్ & అశ్విని దత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
రేటింగ్: 3.75/5
నిజ జీవిత కథల్ని తెరపైకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. ఆ వ్యక్తి జీవితం సినిమా కథగా మారే అర్హత ఉందా, లేదా? అనేది చూసుకోవాలి. ఆ కథలో డ్రామా ఉండాలి. తెలుసుకోవాల్సిన అంశాలుండాలి. తెలిసిన సంగతులే కొత్తగా చూపించే అవకాశం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే.. అది సినిమా అవుతుంది. అలాంటి జీవితం... సావిత్రిది. అందుకే నాగ్ అశ్విన్ సావిత్రి కథపై ప్రేమ పెంచుకున్నాడు. ఇప్పుడు `మహానటి`గా తెరపైకి తీసుకొచ్చాడు.
మరి సావిత్రి కథ.. మహానటి సినిమాగా ఎలా మారింది? సావిత్రి జీవితం నుంచి తెలుసుకోవాల్సిన నీతేంటి?
* కథ
ఎక్కడో పల్లెటూర్లో చిన్నప్పుడే నాన్న రూపం ఎలా ఉంటుందో తెలియని వయసులో ఆయన్ని పోగొట్టుకున్న సావిత్రి (కీర్తి సురేష్) కథ ఇది. ఆ వయసులోనే పెదనాన్న (రాజేంద్రప్రసాద్) పంచన చేరుతుంది. నాట్యం నేర్చుకుంటుంది. నాటకాలు వేస్తుంది. పెదనాన్న సహాయంతోనే సినిమాల్లోకి అడుగుపెడుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతుంది.
ఈ ప్రయాణంలో జెమినీ గణేశన్ (సల్మాన్ దుల్కర్)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అప్పటికే జెమినికి పెళ్లవుతుంది. కానీ... సావిత్రి ప్రేమ ముందు ఆ విషయం కూడా చిన్నదిగానే తోస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మూడేళ్ల వరకూ రహస్యంగా కాపురం చేస్తారు. చివరికి పెళ్లైన సంగతి ప్రపంచానికి తెలుస్తుంది. పెళ్లయ్యాక సావిత్రి హవా కొనసాగుతుంది. గొప్ప గొప్ప సినిమాలు, పాత్రలు చేసి మహానటిగా ఎదుగుతుంది. జెమినీ వల్లే.. మత్తుమందుకు బానిస అవుతుంది. అప్పటి నుంచీ సావిత్రి జీవితంలో చీకట్లు అలుముకుంటాయి. చివరికి ఆమె కథ ఎలా ముగిసిందన్నది తెరపై చూడాలి.
* నటీనటుల ప్రతిభ..
సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ని ఎంచుకున్నప్పుడు చాలా మంది సందేహించారు. అలాంటి మహానటి పాత్రకు ఈ కొత్త నటి ఏం సరిపోతుంది అని అంతా నొసలు చిట్లించారు. వాళ్లందరికీ కీర్తి తన నటనతోనే సమాధానం చెప్పింది. తెరపై సావిత్రి నటనతో.. కీర్తిని పోలిస్తే సాహసమే అవుతుంది. కానీ... సావిత్రిలా మారడానికి ఆమెలా కనిపించడానికి కీర్తి చాలా కష్టపడింది. దానికి తగిన ప్రతిఫలం తెరపై కనిపిస్తుంది. అల్లరి, ఆనందం, అందం, విషాదం ఇవన్నీ కలగలిపిన నటనతో తన పాత్రని రక్తికట్టించింది.
ఆ తరవాతి స్థానం కచ్చితంగా సమంతదే. తనలోని మంచి నటిని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఒంటిచేత్తో నటిపించేసింది.
విజయ్ దేవరకొండ, సల్మాన్ దుల్కర్ లు తమ సహజమైన నటనతో కట్టిపడేస్తారు. రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాన్ని రంగరించాడు. మోహన్‌బాబు, అవసరాల శ్రీనివాస్, క్రిష్.. వీళ్లందరివీ చిన్న చిన్న పాత్రలే. ఏఎన్నార్‌గా నాగచైతన్య కనిపించడం.. అక్కినేని అభిమానుల్ని అలరిస్తుంది.
* విశ్లేషణ..
సావిత్రి కథ గురించి తెలిసినవాళ్లకు కొత్తగా ఈ కథ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే... మహానటి జీవితంలోని ఎత్తు పల్లాలు, చీకటి కోణాలు మరింత విపులంగా ఈసినిమా వివరిస్తుంది. ఆమె బాల్యం, ఎదిగిన తీరు, ప్రేమ, విజయాలు, పరాజయాలు, చివరికి ఆమె చావు కూడా ఆసక్తిదాయకమే. వాటిని నాగ అశ్విన్ ఒడుపుగా తెరపైకి తీసుకొచ్చాడు.
ఈ కథని చెప్పడానికి మరో జంట అవసరమైంది. సమంత - విజయ్ దేవరకొండల ప్రేమకథ ని నడుపుతూ... మరోవైపు సావిత్రి కథని చెబుతూ తెలివిగా స్క్రీన్ ప్లే రాసుకోగలిగాడు. కెవి రెడ్డి - సావిత్రి మధ్య రెండు కన్నీటి బొట్ల ఛాలెంజ్ మొదలుకుని, ఏనుగుపై సావిత్రి ఊరేగుతుంటే అసూయతో జెమినీ గణేషణ్ రగిలిపోయే వరకూ.. చాలా సన్నివేశాల్ని నిజానికి దగ్గరగా నిజాయతీగా తెరకెక్కించాడు దర్శకుడు.
తొలి సగం అంతా... సావిత్రి విజయ గాథలే. ఆమె ఎదిగిన క్రమమే చూపించారు. రెండో భాగంలో ఆమె ఉచ్ఛదశ కనిపిస్తుంది. ఆ తరవాత సావిత్రి పతనం చూపించారు. ద్వితీయార్థంలో కథ పట్టు సడలకుండా నడిపించాడు దర్శకుడు. కథలోని భావోద్వేగాలు కట్టి పడేస్తాయి. పతాక సన్నివేశాల్లో కీర్తి సురేష్ విజృంభిస్తుందనుకుంటే సమంత విజృంభించింది. సావిత్రి కథని అందరికీ తెలిసిన విధంగానే ముగింపు పలికి హృదయాల్ని బరువెక్కించాడు దర్శకుడు.
* సాంకేతిక వర్గం..
ఇది కచ్చితంగా దర్శకుడి సినిమా. ఓ బయోపిక్‌ని ఎలా తీయాలో అలా తీశాడు నాగ అశ్విన్. ఎక్కడా అవసరానికి మించిన డ్రామా కోసం ప్రాకులాడలేదు. ఎంత చెప్పాలో అంతే చెప్పాడు.
కెమెరా, సంగీతం, మాటలు.. ఇవన్నీ ఈ కథకు బలాన్ని తీసుకొచ్చాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగులు మరోసారి మెరిశాయి. సాంకేతికంగా అందరూ తలో చేయి వేశారు. మరీ ముఖ్యంగా ఆనాటి కాలాన్ని తలపించేలా వేసిన సెట్ వర్క్స్, కాస్ట్యూమ్స్ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. మరీ ఇంత అథెంటిక్‌గా ఈ సినిమాని మలచడం అభినందించదగిన విషయం
* ప్లస్‌పాయింట్స్
+ కీర్తి - సమంత
+ కథలోని ఎమోషన్స్
+ క్లైమాక్స్
+ సంభాషణలు
* మైనస్ పాయింట్స్
- నిడివి
* ఫైనల్ వర్డిక్ట్: 'మహానటి'... ఇది కథ కాదు... చరిత్ర
రివ్యూ రాసింది శ్రీ