గుణశేఖర్ యుఫోరియా ట్రైలర్ టాక్..

మరిన్ని వార్తలు

‘రుద్రమదేవి’ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ 2023లో ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఆ సినిమా కమర్షియల్‌గా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అయితే గుణశేఖర్ స్థాయికి తగ్గ సినిమా కాదనే అభిప్రాయం కూడా వినిపించింది. ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, నిజ జీవిత సంఘటనల ఆధారంగా, తన మార్క్ కమర్షియల్ స్టైల్‌కు పూర్తిగా భిన్నంగా గుణశేఖర్ రూపొందించిన చిత్రం ‘యుఫోరియా’.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా చిన్న పిల్లలు, అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి మత్తులో కొందరు డబ్బున్న వారి పిల్లలు చేస్తున్న దురాగతాలు సమాజంలో ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయనే అంశాన్ని ఈ సినిమా నేపథ్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

‘యుఫోరియా’ సినిమాలో సారా అర్జున్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తే భూమిక ఒక నేరస్థుడి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. తన కొడుకు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిందని తెలుసుకున్న ఆ తల్లి, అతడిపై తానే కేసు పెట్టుకుని న్యాయ పోరాటం చేసే కథగా సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమాజంలో చర్చకు వస్తున్న అంశమే కావడంతో ఈ సినిమా అందరిలోనూ ఈజీగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

సినిమాలోని కొన్ని విజువల్స్ హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. చిన్నపిల్లగా పలు సినిమాల్లో కనిపించిన సారా అర్జున్‌ను, ఈ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా, అఘాయిత్యానికి గురైన పాత్రలో చూడబోతున్నాం.

లుక్స్ పరంగా సారా అర్జున్ ఆకట్టుకుంటోంది. భూమిక నటన సినిమాకు మరింత బలాన్ని ఇచ్చేలా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ప్రముఖ దర్శకుడు-నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర ప్రాధాన్యతను ట్రైలర్‌లో పూర్తిగా రివీల్ చేయలేదు. అయితే గుణశేఖర్ గౌతమ్ మీనన్‌కు ఒక పవర్‌ఫుల్ రోల్ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

గుణశేఖర్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడనే విషయం ఎప్పటికీ సందేహం లేదు. కానీ కథల ఎంపిక విషయంలోనే ఆయనపై విమర్శలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా గుణశేఖర్ హిట్ కొడతాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 6, 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత విడుదల కానున్న ఈ సినిమాకు మంచి స్పందన వస్తే, గుణశేఖర్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS