తారాగణం: కార్తికేయ, పాయల్ రాజ్ పుత్. రావు రమేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: కార్తికేయ క్రియేటివ్ వర్క్స్
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: రామ్
ఎడిటర్: ప్రవీణ్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
రచన-దర్శకత్వం: అజయ్ భూపతి
రేటింగ్: 2.5/5
ఇటీవల ప్రచార చిత్రాలతోనే హీటు పుట్టించిన సినిమా...'ఆర్.ఎక్స్ 100'. ట్రైలర్ చూస్తే.... ఇందులో ఏదో ఉంది అనిపించింది. దానికి తోడు టైటిల్ కూడా యూత్‌ని ఆకట్టుకునేలా కనిపించింది. మరి... ట్రైలర్లోనూ, టైటిల్‌లోనూ ఉన్న దమ్ము సినిమాలో ఉందా? ఆర్.ఎక్స్ 100 లో ఉండే బీటింగ్.... ఈ సినిమాలో కనిపించిందా? ఆ స్పీడు కథ, కథనాల్లో జోడించాడా? ఇవన్నీ తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
విశ్వనాథం (రావు రమేష్) నమ్మిన బంటు డాడీ (రాంకీ). విశ్వనాథం ప్రెసిడెంటుగా గెలవడానికి డాడీనే సహాయ సహకారాలు అందిస్తాడు. తల్లితండ్రులు లేని శివ (కార్తికేయ)కి డాడీనే అన్నీ. విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుట్) తొలి చూపులోనే శివని ఇష్టపడుతుంది. శివ - ఇందు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు.ఆ ప్రేమలో హద్దులు దాటేస్తారు. ఇది తెలిసిన విశ్వనాథం ఇందుకి పెళ్లి చేసి, అమెరికా పంపించేస్తాడు. ఇందుకోసం విశ్వనాథం ఇంటి చుట్టూ మూడేళ్లుగా పిచ్చివాడిలా తిరుగుతూనే ఉంటాడు శివ. చివరికి ఓ రోజు ఇందు వస్తుంది. తను వచ్చాక ఏమైంది? శివని కలిసిందా? శివకు దగ్గరైందా? వీరిద్దరి కథలో విలన్ ఎవరు? అనేది తెరపైనే చూడాలి.
* నటీనటులు
కార్తికేయ సహజంగా నటించాడు. యారగెంట్ పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. కమర్షియల్ హీరోగా నిలదొక్కుకుంటాడా, లేదా? అనేది పక్కన పెడితే... తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ని బయటకు తీసుకురావడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది.
ఈ సినిమాకి అసలు సిసలు సర్‌ప్రైజ్ కథానాయిక పాత్రే. పాయల్ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంది. తను కూడా అలానే నటించింది. ముద్దు సన్నివేశాలకు ఎలాంటి మొహమాటం పడలేదు. తన పాత్ర కచ్చితంగా షాక్ ఇస్తుంది.
రాంకీ నటన, ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం నచ్చుతాయి. రావు రమేష్ క్లైమాక్స్‌కి ముందొచ్చే సన్నివేశంలో డైలాగులతో ఆకట్టుకున్నాడు.
* విశ్లేషణ
వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. క్యారెక్టరైజేషన్స్ లో, టేకింగ్‌లో వర్మ పోకడలు అక్కడక్కడ కనిపిస్తాయి. కాకపోతే. తనదైన ముద్ర వేయడానికే ఎక్కువ ప్రయత్నించాడు. తొలి సగం చాలా నిదానంగా సాగుతుంది. డాడీ - శివల అనుబంధం, విశ్వనాథంతో ఉన్న గొడవలు వీటి చుట్టూ తిరుగుతుంది. ఇందు రాకతో కథ లవ్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ.. అధర చుంబనాలు, వేడి వేడి దృశ్యాలతో హీటు పుట్టించాడు దర్శకుడు. అవన్నీ యువతరాన్ని ఆకట్టుకునేవే.
ద్వితీయార్థంలో శివ విరహం.. ఎడబాటు చూపించాడు. ఓ ప్రేమ జంటని పెద్దలు విడగొట్టడం, డబ్బు, కులం అడ్డు పడడం చూస్తూనే ఉన్నాం. ఈ కథ కూడా అదే జాబితాలో చేరిపోతుందిలే అనుకుంటున్న దశలో... ఈ కథ మలుపు తిరుగుతుంది. అప్పటి వరకూ పాజిటీవ్ కోణంలో కనిపించిన ఓ పాత్ర (అదేంటో చెప్పకూడదు) సడన్‌గా విలన్‌గా మారుతుంది. ఈ మలుపు ఎవ్వరూ ఊహించనిదే. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ కథ వేరే టెంపోలో సాగుతుంది.
రియలిస్టిక్ సన్నివేశాలతో అజయ్ భూపతి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. బహుశా క్లైమాక్స్ నచ్చే.. ఈ సినిమాని పట్టాలెక్కించి ఉంటారు. నిజ జీవిత అనుభవాలతో తీసిన సినిమా ఇదని చివర్లో చెప్పాడు దర్శకుడు. ఆ కార్డు పడగానే.. `శివ`పై కాస్త జాలి కలుగుతుంది. ప్రతీ సన్నివేశాన్నీ నిదానంగా నడపడం, డిటైలింగ్ ఎక్కువ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలకు స్థానం కల్పించడం.. ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తాయి. యాక్షన్, శృంగారం మోతాదు ఎక్కువగా ఉంది. వాటిని యువతరం ఎంజాయ్ చేసినా, ఫ్యామిలీ ఆడియన్స్ తట్టుకోవడం కష్టం.
* సాంకేతిక వర్గం
అజయ్ భూపతి రాసుకున్న స్క్రిప్టు సాధారణంగానే ఉంది. చివరి 20 నిమిషాలు మినహా. అక్కడే ఈసినిమాలో రియలిస్టిక్ కోణం కనిపిస్తుంది. అయితే అప్పటి వరకూ కథ, కథనాలు నీరసంగా సాగడం ప్రధానమైన లోపం. నేపథ్య సంగీతం, పాటలు అలరిస్తాయి. అమ్మాయిల గురించి రావు రమేష్ చెప్పిన డైలాగ్ బాగుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది.
* ప్లస్ పాయింట్స్
+ హీరోయిన్ పాత్ర
+ వేడి సన్నివేశాలు
+ క్లైమాక్స్
+ రాంకీ
* మైనస్ పాయింట్స్
- రొటీన్ కథ
- నిదానంగా సాగిన సన్నివేశాలు
- హద్దు దాటిన ముద్దు సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: ఆర్.ఎక్స్ 100... పెద్దలకు మాత్రమే.
రివ్యూ రాసింది శ్రీ