తారాగణం: నాగ శౌర్య, సాయి పల్లవి తదితరులు
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్
సంగీతం: సామ్ సిఎస్
ఛాయాగ్రహణం: నిరవ్ షా
ఎడిటర్: ఆంథోనీ
నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్
రచన-దర్శకత్వం: విజయ్ ఎ ఎల్
రేటింగ్: 3/5
- బ్రూణ హత్య..
చాలాసార్లు వినేమాట ఇది. ఆడపిల్ల అంటే చాలు.. అబార్షన్ చేయించుకుందాం అనుకునేవాళ్లే ఎక్కువ. పెళ్లికి ముందు తొందరపడి... చేసిన తప్పుకి కడుపులోని పిండాన్ని బలి పెట్టడం మరో ఘాతుకం. `ఈరోజుల్లో అబార్షన్లు మామూలే కదా` అని తేలిగ్గా తీసుకుంటున్నాం గానీ - కనీసం లోకాన్ని చూడకుండానే అమ్మకడుపులోనే సమాధి అవుతున్న జీవాలు సంవత్సరానికి లక్షల్లో ఉంటున్నాయి. వాటికీ ఓ ప్రాణం ఉందని, అవి కూడా ఈ లోకాన్ని చూడాలని తహతహలాడతాయన్న స్పృహని కలిగించే చిత్రం ఈ `కణం`.
* కథ
కృష్ణ (నాగశౌర్య) తులసి (సాయి పల్లవి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లికి ముందే తొందరపడతారు. తులసి గర్భవతి అవుతుంది. అప్పటికి ఇంకా చదువులు పూర్తి కావు. పెళ్లి చేయాలంటే కనీసం మరో ఐదేళ్లయినా ఆగాలి. ఈ పరిస్థితిల్లో కృష్ణ తల్లిదండ్రులు, తులసి అమ్మ, మావయ్య బలవంతంపై అబార్షన్ చేయించుకుంటుంది తులసి. ఐదేళ్ల తరవాత కృష్ణ, తులసి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లయ్యాక.. వాళ్ల జీవితంలో అనూహ్యమైన మార్పులొస్తాయి. ఇద్దరి ఇంట్లోనూ అనుకోని మరణాలు సంభవిస్తుంటాయి.
ఈ మరణాల వెనుక తన కడుపులోనే చనిపోయిన పిండం ఉందన్న సంగతి తులసికి అర్థమవుతుంది. ఆ పిండం ఆత్మగా మారి, తనని తల్లి కడుపులోనే అంతమొందించిన ఒకొక్కరినీ ఒక్కోరకంగా చంపుతూ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తులసి ఏం చేసింది? ఆ ఆత్మ నుంచి తన భర్తని ఎలా కాపాడుకుంది? అనేదే కథ.
* నటీనటులు
సాయి పల్లవికి మరోసారి వందకు వంద మార్కులు పడతాయి. ఈ వయసులో తల్లి పాత్రలో కనిపించాలనుకోవడం సాహసం. ఆ పాత్రలోని అర్థ్రతని బాగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నటించింది. విశ్రాంతి ముందు సాయి పల్లవి నటనను మెచ్చుకోకుండా ఉండలేం. భర్తని కాపాడుకోవాలన్న ఇల్లాలిగానూ తన నటన మెప్పిస్తుంది. నాగశౌర్య కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
హుషారైన కుర్రాడి పాత్రల్లో కనిపించే శౌర్యకి ఇది తప్పకుండా కొత్త తరహా పాత్ర అవుతుంది. దియాగా కనిపించిన అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కదిలించింది. తన నటన కూడా చాలా సహజంగా ఉంది. ప్రియదర్శి కామెడీ చేసినప్పుడునచ్చడు గానీ, సీరియెస్‌గా ఉన్నప్పుడు బాగున్నాడు.
* విశ్లేషణ
ఇదో హారర్ సినిమా. కాకపోతే థ్రిల్లర్ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆత్మ రూపంలో ఉన్న పాపని చూడగానే భయం కలగదు. జాలి, ప్రేమ అనే భావాలు మొదలవుతాయి. ఓ ఆత్మని ప్రేమించడం ఈ సినిమాతోనే జరిగిందేమో. దియాని చూడగానే `పాపం..` అనిపిస్తుంటుంది. ఆ ఫీలింగ్ మనలో మొదలైందంటే కథకి కనెక్ట్ అయ్యామనే అర్థం. దర్శకుడు అనవసర విషయాల జోలికి వెళ్లలేదు. కథకి ఏం కావాలో, ఎంత వరకూ చూపించాలో అంతే చూపించాడు. నాగశౌర్య - సాయి పల్లవి మంచి జంట. వాళ్ల మధ్య లవ్, కెమిస్ట్రీ, సరసాలు, సరదాలూ చూపించే ఛాన్సుంది. కానీ దాని జోలికి ఏమాత్రం వెళ్లలేదు. చాలా గ్రిప్పింగ్‌గా కథ రాసుకున్నాడు.
తొలి షాట్ నుంచే కథ మొదలైపోతుంది. పెళ్లయిన వెంటనే `దియా` పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుంది. దియా మాట్లాడదు. భయపెట్టదు. అలా చూస్తూ ఉంటుంది. ఆ చూపులతోనే ఓ ఉత్కంఠత మొదలైపోతుంది. ఒకొక్క హత్యనీ ఒక్కోలా చూపించాడు. విశ్రాంతి ఘట్టంలో ఎమోషన్లు బాగా పండాయి. తన కడుపులోనే అంతరించిపోయిన పిండం.. ఆత్మగా మారి తనని వెదుక్కుంటూ వచ్చిందని, తన వెనకాలే తిరుగుతుందని తెలిసిన తల్లి ఎంత మనోవేదనకు గురవుతుందో, ఎంతలా తల్లడిల్లిపోతుందో చక్కగా చూపించారు. ఈకథలో గొప్పదనం ఏమిటంటే... తల్లీ - కూతుర్ల మధ్య ఓ ఎమోషన్ బాండింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎమోషనే ఈ కథకి కీలకమైంది.
ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది. దియా చేతుల్లోంచి భర్తని కాపాడుకోవడానికి తులసి చేసిన ప్రయత్నాలతోనే ద్వితీయార్థం గడిచిపోయింది. ఈ కథని ఎలా ముగిస్తాడో అనుకుంటున్నప్పుడు... క్లైమాక్స్‌లో మాయ చేశాడు దర్శకుడు. ఓ విధంగా దర్శకుడి బ్రిలియన్స్ క్లైమాక్స్‌లో కనిపిస్తుంది. ఈ కథకు అదే సరైన ముగింపు అనిపిస్తుంది. ఉన్నవి రెండే రెండు బిట్ సాంగ్స్. అవి కూడా కథ చెబుతాయి. ప్రియదర్శితో కామెడీ చేయించారు. అది అనవసర ప్రయత్నమే. ప్రియదర్శి సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దగ్గర్నుంచి అతని పాత్ర బాగుంటుంది. ఆ కాస్త బలవంతపు కామెడీని కూడా మినహాయిస్తే మరింత బాగుండేది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. ఆర్.ఆర్‌తో ప్రాణం పోశారు. దియా ఆత్మ ఉంది అని చెప్పడానికి ఓ థీమ్ మ్యూజిక్ ప్లే చేశారు. అది హాంటింగ్‌గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇది దర్శకుడి సినిమా. హారర్ జోనర్ మరీ రొటీన్ అయిపోతున్న తరుణంలో ఓ సున్నితమైన కథని, మనసుని హత్తుకునేలా, ఉత్కంఠత కలిగించేలా తెరకెక్కించాడు.
* ప్లస్ పాయింట్స్
+ సాయి పల్లవి - శౌర్య నటన
+ క్లైమాక్స్
+ సాంకేతికక విలువలు
+ నిడివి
* మైనస్ పాయింట్స్
- పరిమితమైన టార్గెట్ ఆడియన్స్
* ఫైనల్ వర్డిక్ట్: పిండం.. పగబట్టింది
రివ్యూ రాసింది శ్రీ