తారాగణం: కళ్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: కే.వి. గుహన్
నిర్మాతలు: మహేష్ ఎస్ కోనేరు
దర్శకత్వం: కే.వి. గుహన్
విడుదల: మార్చి 1, 2019
రేటింగ్: 2.75/ 5
కొత్త తరహా కథలకు స్కోప్ ఉన్న జోనర్.. సస్పెన్స్ థ్రిల్లర్. కథని తెలివిగా చెప్పగలిగితే చాలు. చిక్కుముడులు వేసుకుంటూ.. మళ్లీ విప్పుకుంటూ... కొత్త ప్రశ్నలు వేసుకుంటూ.. సమాధానాలు వెదుక్కుంటూ చేసే ఆ ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ యూనిరవ్సల్ అప్పీల్ ఉన్న సినిమాలకు కావల్సిన ముడి సరుకు ఇవ్వకపోవొచ్చు. కానీ ఓ వర్గం ప్రేక్షకులనైనా సంతృప్తి పరుస్తుంటాయి. అలాంటి మరో ప్రయత్నం `118`లో కనిపించింది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గుహన్ దర్శకత్వం వహించారు. గుహన్‌కి దర్శకుడిగా ఇదే తొలి ప్రయత్నం. కల్యాణ్ రామ్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం కూడా ఇదే తొలిసారి. మరి వాళ్ల తొలి అడుగులు ఎలా పడ్డాయి? `118` కథేంటి?
కథ
గౌతమ్ (కల్యాణ్ రామ్) ఓ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్. ఏదైనా సరే.. ఓ పని మొదలెట్టాడంటే, దాని అంతు చూడకుండా ఉండడు. అలాంటి గౌతమ్‌కి ఓ విచిత్రమైన కల వస్తుంటుంది. అది కూడా.. ఓ ప్రత్యేకమైన గదిలో. హైదరాబాద్ శివార్లలో ఉన్న రిసార్ట్‌లోని 118 గదిలో పడుకున్నప్పుడల్లా... ఓ అమ్మాయి కలలోకి వస్తుంది. ఆ అమ్మాయిని ఎవరో చంపబోతున్నట్టు, శవాన్ని కారుతో సహా ఓ లోయలోకి తోసేస్తున్నట్టు కలగంటాడు. ఒకే కల రెండు సార్లు.. అచ్చం అలానే రావడంతో గౌతమ్‌లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆ కలలో కనిపించిన వస్తువులు, ప్రదేశాలు నిజ జీవితంలోనూ కనిపిస్తాయి. దాంతో ఆ అమ్మాయి కచ్చితంగా ఉందని గట్టిగా నమ్ముతాడు గౌతమ్. నిజంగానే ఆ అమ్మాయి ఉందన్న సంగతి ఆతరవాత తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు.. ఆథ్య (నివేదా థామస్). మరి ఆథ్య ఎవరు? ఎందుకు గౌతమ్ కలలోకి వస్తోంది..? వీరిద్దరికీ ఉన్న లింకేమిటి? అనేది `118` చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు..
కల్యాణ్ రామ్ ఇలాంటి పాత్రలో ఇదివరకెప్పుడూ కనిపించలేదు. ఇలాంటి కథలు కల్యాణ్‌రామ్ కి కొత్తగానీ ప్రేక్షకులకు కాదు. హీరోయిజం కోసం అతిగా ప్రయత్నించకుండా (మొదటి ఫైట్ మినహాయిస్తే) చాలా బాలెన్డ్స్‌గా నటించాడు కల్యాణ్ రామ్. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, నివేదాకే ఎక్కువ మార్కులు పడతాయి. క్లైమాక్స్ గుర్తుండిపోతుందంటే దానికి కారణం నివేదా నటనే. షాలిని పాత్రకున్న ప్రాధాన్యం చాలా తక్కువ. నాజర్ లాంటి నటుడున్నా ఆ పాత్రని సరిగా వాడుకోలేదు. గుబురు మీసాలున్న విలన్ కూడా కనిపించేది ఒకట్రెండు సన్నివేశాల్లోనే.
విశ్లేషణ
థ్రిల్లర్ కథకు కావల్సిన సరంజామా `118`లో పుష్కలంగా ఉంది. బోలెడన్ని చిక్కుముడులు, ప్రశ్నలు. తరవాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠత కూడా కనిపిస్తుంటుంది. కథ, స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి లోటూ లేదు. అందుకే తొలి భాగం వేగంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆథ్య కోసం గౌతమ్ చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో తనకు ఎదురవుతున్న సమస్యలు ఇవన్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. కలలో తనకు కనిపించిన గుర్తుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయడంతో... కావల్సింతన సస్పెన్స్, థ్రిల్ పండాయి. ఆథ్య ఎవరు? ఆ అమ్మాయి ప్రస్తుతం ఎలాంటి సమస్యల్లో ఉంది? అనే ఉత్సుకత ప్రేక్షకుడికీ కలుగుతుంది. విశ్రాంతి దగ్గర... కూడా ఓ చక్కటి మలుపు వస్తుంది.
ఇలాంటి కథలు సాధారణంగా ద్వితీయార్థంలోనే పట్టుతప్పుతుంటాయి. అసలు గుట్టు విప్పాక.. తరవాత కథంతా సాదా సీదాగా మారిపోతుంది. అందుకు దర్శకుడు తెలివిగా.. క్లైమాక్స్ వరకూ ఆ సస్పెన్స్‌ని కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఆథ్య ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మొదలవుతుందో.. అప్పుడే ప్రేక్షకుడికి అసలు విషయం అర్థమైపోతుంది. క్లైమాక్స్‌ని ఊహించడం అంత కష్టమేమీ కాదు. గౌతమ్ కలలోకి వెళ్లడం, ఆథ్య ఫ్లాష్ బ్యాక్‌ని తెలుసుకోవడం ఇవన్నీ లాజిక్‌కి అందని విషయాలు. ఓసారి ఆత్మ కథలా, ఇంకోసారి సైన్స్ ఫిక్షన్‌లా, మరోసారి.. ఎమోషన్ డ్రామాలా అనిపిస్తూ సాగిందీ సినిమా.
సినిమా అంతా `కల` అనే కాన్సెప్టు చుట్టూనే తిరుగుతుంటుంది. రొమాన్స్‌కీ, వినోదానికీ, పాటలకూ స్కోప్ తక్కువ. వాటి జోలికి వెళ్లకుండా దర్శకుడు మంచి పనే చేశాడు. అయితే ఆధ్యకి ఏం జరిగిందో తెలుసుకోవాలని కథానాయకుడు పడేంత ఉత్సుకత ప్రేక్షకుడూ పడాలి. అప్పుడే ఇలాంటి కథలు సక్సెస్ అవుతాయి. అదొక్కటే `118`లో ప్రధాన లోపంగా కనిపిస్తుంది.
సాంకేతిక వర్గం
గుహన్ ఓ ఛాయాగ్రహకుడు. టెక్నికల్‌గా ఓ సినిమా ఎలా ఉండాలో తనకు తెలుసు. అందుకే ఆ విషయంలో ఎలాంటి లోటూ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకే ఒక్క పాట ఉంది. అయితే నేపథ్య సంగీతం హాంటింగ్‌గా ఉంది. గుహన్ కథ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అనుకున్న దాన్ని పకడ్బందీగా చూపించాడు. కానీ లాజిక్కులే అక్కడక్కడ మిస్ అయ్యాయి.
* ప్లస్ పాయింట్స్
+ ప్రధమార్థం
+ టెక్నికల్ ఎఫెక్ట్
* మైనస్ పాయింట్స్
- ద్వితీయార్థం
- లాజిక్కులు
* ఫైనల్ వర్డిక్ట్: అంతా ఓ కలలా ఉంది
- రివ్యూ రాసింది శ్రీ.