నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమ్రితా ఐయ్యర్, పోసాని, హర్ష తదితరులు
దర్శకత్వం : మున్నా
నిర్మాతలు : యస్ వి బాబు
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : శివేంద్ర దాశరధి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
రేటింగ్: 2.5/5
ఓ సినిమా జనంలోకి వెళ్లడం ఎలా? అనుకుంటే... టైటిల్ చాలా కీలకం. దాంతో పాటు.. సినిమాకి ముందే పాటలు బయటకు వస్తాయి కాబట్టి, ఆ పాటలు బాగుండాలి. ఇవి రెండూ కుదిరితే... ఆ సినిమాకి కావల్సినంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసినట్టే. ఈ విషయంలో సక్సెస్ అయ్యింది `30 రోజుల్లో ప్రేమించం ఎలా?`
30 రోజుల్లో ఇంగ్లీష్
30 రోజుల్లో కరాటే.. పుస్తకాల్లా ఇదో వెరైటీ టైటిల్. ఆ రకంగా.. టైటిల్ తో మార్కులు కొట్టేసింది చిత్రబృందం.
ఇక సంగీతం విషయానికొస్తే.. `నీలి నీలి ఆకాశం` పాట ఓ బ్లాక్ బ్లస్టర్ హిట్. ఆ పాట రింగ్ టోన్లుగా, కాలర్ ట్యూన్లుగా మార్మోగిపోయింది. ఈ రెండూ.. ఈ సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. దానికి తోడు యాంకర్ గా సుపరిచితుడైన ప్రదీప్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై విపరీతమైన ఫోకస్ పడింది. మరి.. రిజల్ట్ ఎలా వుంది? ప్రదీప్ హీరోగా సక్సెస్ అయ్యాడా? పాటలో, టైటిల్ లో ఉన్న ఆ కొత్తదనం సినిమాలో కనిపించిందా?
* కథ
అర్జున్ (ప్రదీప్) కి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం.చదవు ఏమాత్రం పట్టదు. అన్ని పరీక్షల్లోనూ ఫెయిలే. నాన్నతో ఎప్పుడూ తిట్టు తింటుంటాడు. అమ్మని ఏమాత్రం పట్టించుకోడు. అర్జున్ చదువుతున్న కాలేజీలోకి అర్చన (అమృత) అడుగుపెడుతుంది. ఇద్దరూ టామ్ అండ్ జర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. నిజానికి అర్జున్, అమృత గత జన్మలో ప్రేమికులు. చిన్న అపార్థం వల్ల... ఇద్దరూ విడిపోవాల్సివస్తుంది. మరి ఈ జన్మలో అర్జున్, అమృత కలుసుకున్నారా? గత జన్మ గురించి వీళ్లకు ఎప్పుడు ఎలా తెలిసింది? అన్నదే కథ.
* విశ్లేషణ
ఇది పునర్జన్మల కథ అన్న సంగతి చిత్రబృందం ముందే చెప్పేసింది. దానికి తోడు `నీలీ నీలీ ఆకాశం` పాట చూసినప్పుడే ఆ సంగతి ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అయితే దర్శకుడు పునర్జన్మతో సరిపెట్టుకోలేదు. హీరో హీరోయిన్ గా మారిపోవడం, హీరోయిన్ హీరోగా అయిపోవడం లాంటి జంబ లకిడి పంబ.. కాన్సెప్టుని కూడా జోడించాడు. దాంతో పాటు బోలెడన్ని లేయర్స్ తెచ్చి పెట్టుకున్నాడు. కాలేజీ కథ, బాక్సింగ్ నేపథ్యం, అమ్మ సెంటిమెంట్ ఇలా తలా కొంత జోడించుకుంటూ వెళ్లాడు.
కథలో ఇన్ని అంశాలు ఇరికించేడయంతో.. దర్శకుడు దేనిపైనా పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోయాడు. పునర్జన్మ చుట్టూ తిరిగే కథ అని చెప్పినా.. తొలి 10 నిమిషాల్లోనే ఆ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. అది కూడా ఏమంత ఎఫెక్టీవ్ గా ఉండదు. గత జన్మలో హీరో, హీరోయిన్లు విడిపోతే.. అయ్యో.. అనిపించాలి. ఈ జన్మలో అయినా వీళ్లిద్దరూ కలుసుకుంటే బాగుంటుంది అని ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. కానీ.. ఆ ఫీల్ రాకుండా, లేకుండా చేశాడు దర్శకుడు. పైగా అర్జున్ - అర్చనలా, అర్చన అర్జున్ లా మారిపోవడంలో ఎలాంటి లాజిక్కూ ఉండదు. అది దైవలీల అనుకోవాలంతే. మారిపోయాక... వచ్చే సీన్లన్నీ శ్రీనివాసరెడ్డి నటించిన `జంబలకిడి పంబ` సినిమాని గుర్తు చేస్తాయి. ఆయా సన్నివేశాలు వినోదం పుట్టించకపోగా.. విసిగిస్తాయి.
హాస్టల్ ఎపిసోడ్ కాస్త బెటర్. చదువు పేరుతో పోకిరీ వేషాలేస్తున్న అమ్మాయిల్ని హీరో బుక్ చేసే విధానం, హాస్టల్ లో అమ్మలు అడుగుపెట్టి, మాస్ హీరోల లెవిల్లో... ఫైటింగులు చేయడం... కాస్త నవ్విస్తాయి. కాకపోతే.. అది కూడా `పటాస్` సినిమాలోని సీన్ కి స్ఫూర్తి అని మాత్రం మర్చిపోకూడదు. అక్కడక్కడ కొన్ని సీన్లు నవ్వించడం మినహాయిస్తే.. ఎమోషన్ పరంగా ఈ సినిమా బాగా వీక్ అయ్యింది. చివర్లో మదర్ సెంటిమెంట్ జోడించినా, అది కృతకంగానూ, సినిమాని సాగదీయాలన్న ఉద్దేశంతోనూ అనిపిస్తాయంతే.
* నటీనటులు
టీవీలో యాంకర్‌గా, తనకిచ్చిన స్లాట్ ని అద్భుతంగా నడిపించేయడంలో దిట్ట.. ప్రదీప్. ఇక్కడా అదే చేశాడు. తన వరకూ తన పాత్రకు న్యాయం చేశాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో అల్లుకుపోయాడు. హీరోగా మారాం కదా.. అని అనవసరమైన బిల్డప్పులు ఇవ్వలేదు. కాకపోతే... యాంకర్ గా అలవాటైపోయాడు కదా. థియేటర్లోనూ తనలో యాంకరే కనిపిస్తాడు. అమృత అందంగా వుంది. రష్మిక స్టైల్ ని కాపీ కొట్టడానికి ప్రయత్నించింది. హేమ, శుభలేఖ సుధాకర్, పోసాని.. లాంటి సీనియర్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. వైవా హర్ష కామెడీ కాస్త ప్లస్ అయ్యింది.
* సాంకేతిక వర్గం
ఈ సినిమాకి కావల్సినంత హైప్ తీసుకురావడంలో అనూప్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తే... అదంతా నీలీ నీలీ ఆకాశం పాట మహత్య్మమే. ఆ పాటతో పాటు... కాలేజీలో టీజింగ్ సాంగ్ కూడా బాగుంది. ఆర్.ఆర్...లోనూ అనూప్ తన మార్క్ చూపించాడు. ఫొటోగ్రఫీ నీట్ గా వుంది. టెక్నికల్ టీమ్ బలంగా ఉన్నా.. రైటింగ్ సైడ్ దర్శకుడు తేలిపోయాడు. ఒకే కథలో అనేక అంశాలు జొప్పించడానికి ప్రయత్నించి, దేనికీ న్యాయం చేయలేకపోయాడు.
* ప్లస్ పాయింట్స్
పాటలు
టెక్నికల్ టీమ్
కొన్ని కామెడీ సన్నివేశాలు
* మైనస్ పాయింట్స్
కథ
జంబలకిడికి పంబ ఎపిసోడ్
ఎమోషన్ లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: కలగాపులగం.