నటీనటులు : జ్యోతిక,రెహమాన్, అభిరామి తదితరులు
దర్శకత్వం : రోషన్ ఆండ్రూస్
నిర్మాతలు : సూర్య
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫర్ : ఆర్ దివాకరన్
ఎడిటర్: మహేష్ నారాయణ్
రేటింగ్: 2.75/5
సూర్యతో పెళ్లయ్యాక... సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది జ్యోతిక. ఆ తరవాత.. అప్పుడప్పుడూ తన మనసుకి నచ్చిన కథలతో సినిమాలు చేస్తోంది. ఆయా సినిమాలకు సూర్యనే నిర్మాత. ఆ కోవలో విడుదలైన మరో తమిళ చిత్రం `36 వయదిలిలే`. 2015లో విడుదలైన సినిమా ఇది. ఇప్పుడు `36 వయసులో` అనే పేరుతో డబ్ చేశారు. థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో `ఆహా`లో విడుదల చేశారు. మరి ఈసినిమా ఎలా వుంది? జ్యోతిక ఎంతో ఇష్టపడి ఈ కథ చేయడానికి గల కారణం ఏమిటి?
* కథ
వసంతి (జ్యోతిక) ఓ సాధారణ ఇల్లాలు. తన భర్త రాం ప్రసాద్ (రెహమాన్) తో కలిసి... ఐర్లాండ్ వెళ్లిపోదామనుకుంటుంది. అయితే.. వీసా సమస్యలు వస్తాయి. మరోవైపు వసంతికి అనుకోకుండా రాష్ట్రపతి నుంచి పిలుపు వస్తుంది. దాంతో.. వసంతి ఒక్కసారిగా పాపులర్ అయిపోతుంది.
సోషల్ మీడియా నిండా, ఛానళ్ల నిండా ఆమె గురించే వార్తలు. అయితే.. రాష్ట్రపతి ని కలుసుకునే క్షణంలో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక కళ్లు తిరిగిపడిపోతుంది. అప్పటి వరకూ వచ్చిన పాపులారిటీ అంతా ఒక్కసారిగా పోతుంది. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో చులకన అయిపోతుంది. రాంప్రసాద్ కూడా.. తన కూతుర్ని తీసుకుని ఐర్లాండ్ వెళ్లిపోతాడు. ఈ ఒంటితనంలో తనని తాను వెదుక్కునే ప్రయత్నం చేస్తుంది వసంతి. బాధ్యతల మధ్య బందీ అయిపోయిన తన బలాలకు పదును పెడుతుంది. తన బలహీనతల్ని అధిగమిస్తుంది. మళ్లీ రాష్ట్రపతి నుంచే పిలుపు అందుకుంటుంది. ఇదెలా సాధ్యమైంది? ఓ సాధారణ గృహిణి రాష్ట్రపతి భవన్ వరకూ ఎలా వెళ్లగలిగింది? అనేదే కథ
* విశ్లేషణ
అమ్మాయిల కలలకు గడువు తేదీ ఉంటుందా? అనే ప్రశ్న రాష్ట్రపతిని కదిలిస్తుంది. ఇప్పటి వరకూ మన దేశ ప్రధానుల్లో, రాష్ట్ర పతుల్లో అమ్మాయిలకు దక్కిన స్థానమేంటి? అనే ఆలోచన.. రాష్ట్రపతిని సైతం ఆలోచనలో పడేస్తుంది. అదే.. వసంతి అనే ఓ సాధారణ గృహిణి.. రాష్ట్రపతి భవన్‌కి వెళ్లేలా చేస్తుంది. ఈ ప్రశ్నలు, దాని చుట్టూ సాగే సన్నివేశాలు కాస్త డ్రమటిక్ గా ఉన్నా - మిగిలిన కథంతా... అత్యంత సహజంగా ఉంటుంది. పెళ్లయ్యాక అమ్మాయిల్లో వచ్చే మార్పు, సంసారం, పిల్లలూ అంటూ.. వాటికే పరిమితం అయి, తమ కలల్ని, బలాల్ని సైతం పక్కన పెట్టే విధానం ఇవన్నీ - సగటు మహిళల ఆలోచనలను, వాళ్ల జీవితాలకూ దర్పణంగా కనిపిస్తాయి.
కాలేజీలో ఉద్యమాలు లేవదీసిన ఓ అమ్మాయి.. పెళ్లయ్యాక ఎంత సెలైంట్ అయిపోతుంది, ఎంత సర్దుకుపోయి బతుకీడుస్తుంది అనేది వసంతి పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మహిళా ప్రేక్షకుల్ని ఐడెంటిఫై చేసుకునే అంశాలే.
కథ చాలా సింపుల్ గా మొదలవుతుంది. 36 ఏళ్ల సగటు మహిళ.. ఆలోచనలు ఎలా ఉంటాయో చూపించాడు దర్శకుడు. ఆంటీ అని పిలిస్తే. ఎలా రియాక్ట్ అవుతారో.. కళ్లకు కట్టాడు. అందం కోసం, వయసు తగ్గించుకోవడం కోసం ఎలా సతమతవుతారో అత్యంత సహజంగా తెలియ పరిచాడు. ఆ సన్నివేశాలన్నీ హాయిగా ఉంటాయి. భర్తతో గొడవ, తన కూతురే తనని చిన్న చూపు చూడడం.. ఇవన్నీ ఎమోషనల్ కలిగిస్తాయి. తనని తాను నిరూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా స్ఫూర్తి నింపుతాయి.
సేంద్రియ వ్యవసాయం, మిద్దెతోట వ్యవసాయం అనే రెండు పాయింట్లు సెకండాఫ్ లో కనిపిస్తాయి. అయితే అవన్నీ `భీష్మ` లాంటి సినిమాల్లో చూశాం. కాబట్టి కొత్తగా అనిపించవు. పైగా ఇది 2015లో తీసిన సినిమా. ఇప్పటికి మనవాళ్లు చాలా అప్ డేట్ అయ్యారు. సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత ఇప్పుడు చాలామందికి అర్థమైంది. వాటినే ఉపన్యాసాలుగా మార్చి, సినిమాలు తీస్తే... బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి, ఓ గృహిణి తాలుకు ఆలోచనలు, ఆశయాలు, కలలు.. వీటన్నింటినీ అర్థం చేసుకుని, వాళ్లకూ కాస్త స్పేస్ ఇవ్వడం నేర్చుకోండని హితబోధ చేసే సినిమా గా మాత్రం `36 వయసులో` మిగిలిపోతుంది. కలలు సాధించడానికి వయసుతో పనిలేదని తేల్చి చెప్పిన సినిమా ఇది.
* నటీనటులు
జ్యోతిక వన్ ఉమెన్ షో ఇది. సినిమా అంతా తనే నడిపించింది. అన్ని రకాల ఎమోషన్లనీ పండించింది. నటన విషయంలో ఏలోటూ చేయలేదు. ఆ పాత్రకు, వయసుకుని చక్కగా నప్పింది. హుందాగా కనిపించింది. రెహమాన్ తెలిసిన నటుడే. తనూ చక్కగా రాణించాడు. మిగిలిన వాళ్లంతా తమిళ నటీనటులే. జేపీ తప్ప.
* సాంకేతిక వర్గం
పాటలు తక్కువ. ఉన్నా కథలో కలిసిపోయాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. అయితే ఆ లోటేం కనిపించదు. కథగా చెప్పడానికి ఏం లేకపోయినా, భావోద్వేగాల్ని పండించగలిగే సన్నివేశాలున్నాయి. స్ఫూర్తి కలిగించే అంశాలున్నాయి. డబ్బులు పోసి టికెట్టు కొనక్కర్లెద్దు. టికెట్ కౌంటర్ల ముందు ఎదురు చూడాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని చూసే సౌలభ్యం ఉంది కాబట్టి... సరదాగా ఓసారి చూసేయొచ్చు.
*ప్లస్ పాయింట్స్
జ్యోతిక
ఎమోషన్ సన్నివేశాలు
* మైనస్ పాయింట్
సేంద్రియ వ్యవసాయం అనే పాత అంశం
డ్రమెటిక్ సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్ : వయసు ఓ అంకె మాత్రమే