నటీనటులు : సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు తదితరులు
దర్శకత్వం : సుధా కొంగర
నిర్మాతలు : సూర్య
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫర్ : నికేత్ బొమ్మి
ఎడిటర్: సతీష్ సూర్య
రేటింగ్: 3/5
గెలుపు... ఓ కిక్. పడుతూ, లేస్తూ... నిలబడగలిగితే ఆ ప్రయాణం ఇంకెంతో మందికి స్ఫూర్తి నిస్తుంది. అలాంటి ప్రయాణాలన్నీ భావితరానికి పాఠాలవుతాయి. అలాంటి ఓ పాఠం... ఎయిన్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్‌ది. ఆ కథని `ఆకాశం నీ హద్దురా`గా తెరకెక్కించారిప్పుడు. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకురాలు. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. మరి.. ఈ సినిమా ఎలా వుంది? గోపీనాథ్ కథని సుధా కొంగర ఎంత స్ఫూర్తిమంతంగా తీయగలిగింది?
* కథ
చంద్ర మహేష్ (సూర్య) ఓ మాస్టారు అబ్బాయి. చుండూరు అనే మారు మూల గ్రామం వాళ్లది. ఆ ఊర్లో రైలు కూడా ఆగదు. అలాంటి ఊరి ప్రజల్ని ఫ్లైట్ ఎక్కించాలని కలలు కంటాడు చంద్రమహేష్. అతి తక్కువ రేటుకి... విమానం టికెట్టు అమ్మితే, సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేయగలరని నమ్ముతాడు. ఆ నమ్మకంతోనే ఎయిర్ డక్కన్ స్థాపించాలని ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే ఈ వ్యాపారంలో దిగ్గజంగా ఉన్నపరేష్ (పరేష్ రావల్)... అడుగడుగునా చంద్రమహేష్ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. మరి చివరికి చంద్ర మహేష్ తన ఆశయాన్ని ఎలా సాధించగలిగాడు. ఆ ప్రయాణంలో తన భార్య బేబీ (అపర్ణ) ఇచ్చిన స్ఫూర్తి ఏమిటి? అన్నదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఎయిన్ డక్కన్ అథినేత గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా రూపొందించిన సినిమా అని చిత్రబృందం ముందే చెప్పేసింది. ఆయన కథ గురించి, ఆ ప్రయాణం గురించి తెలిసిన వాళ్లకు.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఓ అవగాహన ఉంటుంది. అయితే ఆ కథని వీలైనంత రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు సుధా కొంగర. ఓ సామాన్యుడి కథ, దాన్ని అందుకోవడానికి తాను చేసే ప్రయత్నం ఇవన్నీ ఈ కథకు బలం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, చివరికి కథానాయకుడే గెలుస్తాడని అందరికీ తెలుసు. కానీ ఆ గెలుపు ఎలా వశమైంది? అనేదే ప్రధానం.
ఇదేం ఫిక్షన్ కథ కాదు. గాల్లో మేడలు కట్టి.. చూపించడానికి. జరిగిన కథ. కాబట్టి.. సడన్ గా హీరో అద్బుతాలేం చేయడు. మెల్లమెల్లగా విజయం వైపు దూసుకెళ్తాడు. అందుకే ఆ ప్రయాణం కాస్త నిదానం అవుతుంది. చంద్రమహేష్ అసలు ఎందుకు అత్యంత చవక ధరకు విమాన ప్రయాణం చేయించాలనుకున్నాడు? అనే విషయాన్ని చాలా హద్యంగా చెప్పగలిగారు. తండ్రి చావు బతుకుల్లో ఉంటే... ఆయన్ని చూడ్డానికి విమాన ప్రయాణం చేయాలనుకన్న కొడుకు.. టికెట్ కి సరిపడా డబ్బుల్లేక ఆగిపోవడం, మిగిలిన డబ్బుల్ని పోగేయడానికి.. ఎయిర్‌పోర్టులోనే అందరి కళ్లా వేళ్లా పడడం.. హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
ఊర్లో వాళ్లంతా డబ్బులు పోగేసి, చంద్రమహేష్‌కి పెట్టుబడి పెట్టడం, చివర్లో ఊరు ఊరంతా విమాన ప్రయాణం చేయడం - లాంటి సన్నివేశాల్ని దర్శకురాలు బాగా రాసుకోగలిగింది. రాసిందంతా తీసి చూపించగలిగింది. అయితే.. విమానాల వ్యాపారంలోని టెక్నికాలిటీస్ తెలియని వాళ్లు కాస్త గందరగోళపడడం ఖాయం. నిజజీవిత కథే అయినా దర్శకురాలు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోగలిగారు.
* నటీనటులు
సూర్య సినిమాలు పరాజయం పాలవ్వొచ్చు. కానీ... సూర్య ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. నటుడిగా తనని తాను మెరుగు పెట్టుకుంటూనే ఉన్నాడు. మహా పాత్రలో కూడా సూర్య చక్కగా ఒదిగిపోయాడు. తండ్రి ని చూడ్డానికి ఎయిర్ పోర్టులో టికెట్ కోసం అల్లాడిపోయే సన్నివేశంలో సూర్య నటన గుర్తుండిపోతుంది. అపర్ణది హీరోయిన్ ఫేస్ కాదు. కానీ ఆ ఫీలింగ్ రాదు. తను ఆ పాత్రలో బాగా ఇమిడిపోయింది. పరేష్ రావల్ పాత్ర పరిధి చిన్నదే. మోహన్ బాబుది కేవలం అతిథి పాత్ర అనుకోవాలి.
* సాంకేతిక వర్గం
స్క్రీన్ ప్లేని.. చాలా ఆసక్తి కలిగేలా రాసుకోగిగారు సుధా కొంగర. దాంతో ప్రతీ సన్నివేశం ఉత్కంఠత రేగుతూ సాగుతుంది. అలాగని ఇదేం థ్రిల్లర్ కాదు. ఓ కలని సాధించడానికి కథానాయకుడు అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ఎలా ప్రయాణం సాగించాడు? అనే పాయింట్ ని చాలా ఆసక్తికరంగా చెప్పగలిగారు. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న రెండు పాటలూ ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా అన్ని విభాగాలూ బాగా పని చేశాయి.
* ప్లస్ పాయింట్స్
సూర్య
కథనం
ఎమోషన్
* మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
టెక్నికల్ టెర్మనాలజీ అర్థం కాకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: మంచి ప్రయత్నం