ఆట‌గ‌ద‌రా శివ‌ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: దొడ్డన్న, ఉదయ్, హైపర్ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ: రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్
బ్యాగ్రౌండ్ స్కోర్: నోబిన్ పాల్
ఎడిటర్: నవీన్ నూళి
ఛాయాగ్రహణం: లవిత్
నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్
రచన-దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్

రేటింగ్: 2/5

రోడ్ జర్నీకి సంబంధించిన క‌థ‌లు, సినిమాలూ బాగుంటాయి. వాటిని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌గ‌లిగితే, హ్యూమ‌న్ ట‌చ్ ఇవ్వ‌గ‌లిగితే గుర్తుండిపోతాయి. అలా క‌న్న‌డ‌లో గుర్తిండిపోయిన సినిమా 'రామ రామ‌'.  ఉరిశిక్ష వేయ‌బ‌డిన ఖైదీకీ, త‌లారీకీ మ‌ధ్య న‌డిచే క‌థ ఇది. విన‌డానికే గ‌మ్మ‌త్తుగా ఉంది. దాన్ని... చంద్ర సిద్దార్థ్ లాంటి సెన్సిబుల్ ద‌ర్శ‌కుడు తీస్తే ఇంకెంత బాగుంటుంది?  అందుకే ఆ ఆలోచ‌న‌తోనే 'ఆట‌గ‌ద‌రా శివ‌' రూపంలోకి మారింది 'రామ రామ‌'. మ‌రి  కన్న‌డ‌లో ఉన్న ఫీల్ తెలుగులోకి త‌ర్జుమా అయ్యిందా?  'ఆటగ‌ద‌రా శివ‌' ల‌క్ష్యం ఏమిటి?  ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకుని, ఏం చెప్పాడు?  

* క‌థ‌

సీరియ‌ల్ మ‌ర్డ‌ర్ కేసులో నిందితుడు బాబ్జీ (ఉద‌య్ శంక‌ర్‌)కి ఉరిశిక్ష ప‌డుతుంది. మ‌రో నాలుగు రోజుల్లో ఉరి తీస్తార‌న‌గా... జైలు నుంచి త‌ప్పించుకుని పారిపోతాడు బాబ్జీ. మార్గ మ‌ధ్య‌లో జంగ‌య్య (జంగ‌య్య‌) ఎదుర‌వుతాడు. అత‌నో త‌లారీ.  బాబ్జీని ఉరి తీసే బాధ్య‌త ప్ర‌భుత్వం త‌న‌కే అప్ప‌గించింది. చూడ్డానికి మొర‌టుగా క‌నిపించినా.. జంగ‌య్య మ‌న‌సు మాత్రం మంచిది. మ‌రి బాబ్జీ విష‌యంలో జంగ‌య్య ఎలా ఆలోచించాడు?  మ‌న‌సున్న మ‌నిషిగా త‌న క‌థ విని స‌హాయం చేశాడా?  లేదంటే వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో... బాబ్జీని ఉరికంబం ఎక్కించాడా?  వాళ్లిద్ద‌రి ప్ర‌యాణంలో ఎన్ని మ‌లుపులు ఎదుర‌య్యాయి?  అనేదే క‌థ‌.

* న‌టీన‌టులు

జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్‌ని మిన‌హాయిస్తే మిగిలిన‌వాళ్లంతా కొత్త‌వాళ్లే. ఇలాంటి సినిమాల‌కు ఎలాంటి ఇమేజ్ లేని న‌టీన‌టులైతే బాగుంటుంది. అయితే మ‌రీ త‌మిళ మొహాల్లా అనిపించేస‌రికి... ఆస‌క్తి కాస్త స‌న్న‌గిల్లుతుంది. త‌లారీగా క‌నిపించిన జంగ‌య్య న‌ట‌న అత్యంత స‌హ‌జంగా ఉంది. బాబ్జీ పాత్ర‌లో ఉద‌య్ శంక‌ర్ న‌టించాడు. త‌న‌కు ఇదే తొలి సినిమా. న‌ట‌న ప‌రంగా ఓకే. ఈ రెండు పాత్ర‌ల్లో కాస్త తెలిసిన మొహాలు ఉన్నా... సినిమాని ఓన్ చేసుకుందురేమో..

* విశ్లేష‌ణ‌

నిజానికి చాలా మంచి క‌థ ఇది. భావోద్వేగాలు కావ‌ల్సిన‌న్ని పండించొచ్చు. ఓ త‌లారీకీ, ఉరిశిక్ష ప‌డిన ఖైదీకీ మ‌ధ్య ఓ ప్ర‌యాణం సాగ‌డం.. నిజంగా గొప్ప థాట్‌. క‌న్న‌డ‌లో దాన్ని హృద్యంగా మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అదే తీవ్ర‌త‌, ఆర్థ్ర‌త తెలుగు రీమేక్‌లో క‌నిపించ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. 

చంద్ర‌సిద్దార్థ్ దాదాపుగా మాతృక‌ని ఫాలో అయిపోయాడు. అక్క‌డ‌క్క‌డ చిన్నిపాటి మార్పులు చేశాడు. క్లైమాక్స్ మాత్రం కొత్త‌దే. మాతృక‌తో పోలిస్తే ఈ  క్లైమాక్సే బాగుంటుంది. కాక‌పోతే... బాగా డ్ర‌మ‌టైజ్ చేశాడు. స‌రిగ్గా తీయ‌గ‌లిగితే గ‌మ్యం లా.. గుండెల్ని పిండేసే సినిమా అవుదును. అంత ఫ్లాట్ ఉంది కూడా. కానీ దాన్ని పాడు చేసుకున్నాడు. 

స‌న్నివేశాల‌న్నీ నిదానంగా సాగుతాయి. పండాల్సిన చోట ఎమోష‌న్ పండ‌లేదు. త‌లారీకీ, ఖైదీకీ మ‌ధ్య ఎమోష‌న్ బాండింగ్ మిస్ అయ్యింది. దాంతో ఈ రెండు పాత్ర‌ల్లో దేన్నీ ఓన్ చేసుకోలేం. ఇద్ద‌రూ గుబురు గ‌డ్డాల‌తో భ‌యపెడుతుంటారు. స‌హ‌జ‌త్వం కోసం అలా చేసినా.. మ‌న‌కు మాత్రం ఓ త‌మిళ సినిమా చూసిన‌ట్టు అనిపిస్తుంది. రిలీఫ్ కోసం మ‌ధ్య‌లో హైప‌ర్ ఆదిని, జ‌బ‌ర్ ద‌స్త్ బ్యాచ్‌నీ రంగంలోకి దింపాడు. హైప‌ర్ పంచులు పేల‌క‌పోయేస‌రికి ఆ ఎపిసోడ్ పేల‌వంగా మారింది. పైగా క‌థ‌కు, క‌థాగ‌మ‌నానికి అడ్డం త‌గిలిన ఫీలింగ్ క‌లుతుతుంది.  

సినిమా మొత్తం ప్ర‌యాణమే. ఆ ప్ర‌యాణంలో మ‌లుపులు జీవితాల్ని మారుస్తాయేమో అనుకుంటే అది కూడా జ‌ర‌గ‌దు. చివ‌ర్లో బాబ్జీ పాత్ర‌లో అనూహ్య‌మైన మార్పు, మంచిత‌నం వ‌స్తాయి. అవెందుకో అర్థం కాదు. బాబ్జీ ప‌ట్ల సానుభూతి కోణం ఏమైనా ప్రేక్ష‌కుల్లో క‌లిగితే ఈ సినిమా వ‌ర్క‌వుట్ అయ్యేది. కానీ అలా జ‌ర‌క్క‌పోయేస‌రికి నిరాశ మిగులుతుంది.

* సాంకేతిక వ‌ర్గం

క‌న్న‌డ ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు... ఓ హృద్య‌మైన పాయింట్ రాసుకున్నారు. దాన్ని వీలైనంత వ‌ర‌కూ  పాటిస్తూనే సినిమా తీశాడు చంద్ర సిద్దార్థ్‌. ఆయ‌న చేసిన మార్పులు ఓకే అనిపిస్తాయి. కానీ ఎమోష‌న్‌ని రాబ‌ట్ట‌డంలో మాత్రం విప‌ల‌మ‌య్యాడు. డైలాగులు అక్క‌డ‌క్క‌డ బాగున్నాయి. కొన్ని చోట్ల అర్థం కాలేదు. త‌క్కువ బ‌డ్జెట్‌లో చుట్టేసిన సినిమా అని అర్థ‌మైపోతోంది. పాట‌లు మాత్రం ఆక‌ట్టుకున్నాయి.

* ప్ల‌స్ పాయింట్స్

+ పాట‌లు
+ క‌థా నేప‌థ్యం

* మైన‌స్‌ పాయింట్స్‌

- క‌థ‌నం
- ఎమోష‌న్ మిస్ అవ్వ‌డం

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  శివ‌.. శివ‌...  

రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS