W/o రామ్‌ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: లక్ష్మి మంచు, సామ్రాట్, ఆదర్శ్, ప్రియదర్శి తదితరులు
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & మంచు ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: రఘు దీక్షిత్
ఛాయాగ్రహణం: భాస్కర్
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: విశ్వ ప్రసాద్ & వివేక్ కూచిబొట్ల
రచన-దర్శకత్వం: విజయ్

రేటింగ్: 2.5/5

స‌స్పెన్స్ డ్రామాలు, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలు.. వీటికి ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే... ఇలాంటి సినిమాల్ని చూడ్డానికి ఓ వ‌ర్గం ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తుంటుంది. క‌నీసం మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్‌కి క్యాట‌ర్ చేసుకోగ‌లిగితే చాలు.. వ‌ర్క‌వుట్ అయిపోయిన‌ట్టే. అందుకే... ఈ త‌ర‌హా క‌థ‌లు పుడుతుంటాయి. కానీ స‌క్సెస్ అవ్వ‌డం మాత్రం కొంచెం క‌ష్టం. క‌థ‌లో ఎక్క‌డ ప‌ట్టు స‌డ‌లిపోయినా - ఫ‌లితం తేడా కొట్టేస్తుంది. అందుకే.... చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తుండాలి. ఇప్పుడొచ్చిన  'వైఫ్ ఆఫ్ రామ్' కూడా ఓ ర‌కంగా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, ఇంకో ర‌కంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. మ‌రి క‌థ‌, క‌థ‌నాలు గ్రిప్పింగ్ గా సాగాయా?  వైఫ్ ఆఫ్ రామ్ ఇచ్చిన థ్రిల్ ఎంత‌??

* క‌థ‌

రామ్ (సామ్రాట్‌), దీక్ష (ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌) భార్యా భ‌ర్త‌లు. ఓ ప్ర‌మాదంలో రామ్ చ‌నిపోతాడు. దీక్ష ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. అది ప్‌నమాదం కాద‌ని, ఓ హ‌త్య అని దీక్ష న‌మ్మ‌కం. పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తుంది. కానీ... పోలీసులు ఈ కేసు గురించి అంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకోరు. దాంతో తానే రంగంలోకి దిగుతుంది. ఒక్కో ఆధారం సేక‌రిస్తుంది. విక్కీ (ఆద‌ర్శ్‌)కీ ఈ హ‌త్య‌కు సంబంధం ఉంద‌న్న నిజం తేలుతుంది. ఇంత‌కీ విక్కీ ఎవ‌రు?  రామ్‌ని ఎందుకు హ‌త్య చేయాల్సివ‌చ్చింది?  ఈ కేసుని దీక్ష తానొక్క‌ర్తే ఎలా సాధించింది?  అనేదే క‌థ‌.

* న‌టీన‌టులు

మంచు ల‌క్ష్మి చేసిన మంచి పాత్ర‌ల్లో ఇదొక‌టి. భ‌ర్త‌ని కోల్పోయిన ఓ ఇల్లాలిగా త‌న న‌ట‌న న‌చ్చుతుంది. ఒక్క చోట కూడా అవ‌స‌రానికి మించి ఎక్కువ న‌టించ‌లేదు.

సామ్రాట్‌, ఆద‌ర్శ్ ఇద్దరివీ చిన్న పాత్ర‌లే. చారి అనే సిన్సియ‌ర్ కానిస్టేబుల్ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచాడు. కాక‌పోతే త‌న‌ని ఇలాంటి సీరియెస్ పాత్ర‌ల్లో చూడ‌డం కొంచెం క‌ష్టం.

* విశ్లేష‌ణ‌

రోగాన్ని నయం చేసుకోవ‌డానికి ప్ర‌తీసారీ వైద్యుడి ద‌గ్గ‌ర‌కే వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. ఒక్కోసారి సొంత వైద్యం కూడా చేసుకోవాలి.. - ఈ కాన్సెప్ట్ తో సాగే క‌థ ఇది. పోలీసుల ద్వారా న్యాయం ద‌క్క‌నప్పుడు... త‌న‌కు తానే ఒంట‌రిగా ఓ కేసుపై ఓ మ‌హిళ ఎలా పోరాడింది? అనేదే క‌థ‌.  ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి కావ‌ల్సిన అన్ని ల‌క్ష‌ణాలూ ఇందులో ఉన్నాయి. 

ఈ క‌థ‌ని మొద‌లెట్టిన ప‌ద్ధ‌తి, సాగిన తీరు చూస్తే `క‌హాని` గుర్తొస్తుంది. క‌హానీలానే చివ‌ర్లో ఓ మంచి ట్విస్టు దాచుకున్నాడు ద‌ర్శ‌కుడు. నిజానికి ఆ ట్విస్టు కోస‌మే ఇంత క‌థ అల్లారేమో అనిపిస్తుంది. ప్రారంభ స‌న్నివేశాలు బాగున్నాయి. కానీ క‌థ‌లోకి వెళ్లే కొద్దీ న‌త్త‌న‌డ‌క న‌డుస్తుంది. దీక్ష చేస్తున్న ఇన్వెస్టిగేష‌న్‌లో ఎలాంటి ఆసక్తీ ఉండ‌దు. విక్కీతో క‌థ‌ని ముడిపెట్టిన ద‌గ్గ‌ర ఇంట్రవెల్ కార్డు ప‌డుతుంది. ఆ విక్కీ గురించి తెలుసుకోవ‌డానికి సెకండాఫ్ కేటాయించారు. 

ఈ క‌థ‌లో ముఖ్య‌మైన భాగం.. ప్రీ క్లైమాక్స్ ట్విస్టు. అక్క‌డి వ‌ర‌కూ క‌థ‌ని న‌డిపించ‌డానికి చాలా పాట్లు ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. అయితే ఏదోలా క్లైమాక్స్‌కి తీసుకొచ్చాడు. అక్క‌డ ఒక్కో ట్విస్టూ రివీల్ చేస్తుంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఆ మ‌లుపుల‌న్నీ బాగున్నాయి. అయితే అందులో ఒక‌ట్రెండు ముందే ఊహించొచ్చు. ఈ క‌థ‌ని ముగించిన తీరు కూడా అచ్చంగా సినిమా టిక్‌గా ఉంటుంది. పాట‌లు లేక‌పోవ‌డం, అన‌వ‌స‌ర‌మైన కామెడీ ట్రాకుల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం.. సినిమా అంతా ఒకే టెంపోలో సాగ‌డం క‌లిసొచ్చే అంశాలు. చివ‌ర్లో ట్విస్టు... ఈ క‌థ‌కి ప్రాణం.

* సాంకేతిక వ‌ర్గం

ద‌ర్శ‌కుడు రాసుకున్న స్క్రిప్టులో అక్క‌డ‌క్క‌డ క‌హానీ పోలిక‌లు క‌నిపిస్తాయి. క‌హానీ కథే దీనికి స్ఫూర్తి కావొచ్చు. స్క్రిప్టు ప‌క‌డ్బందీగానే రాసుకున్నాడు. సీరియెస్ పాయింట్‌తో సాగే క‌థ కాబ‌ట్టి.. కాస్త ఓపిగ్గా చూడాలి. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. కెమెరా, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుంటాయి.

* ప్ల‌స్ పాయింట్స్

+ క్లైమాక్స్ ట్విస్టు
+ టెక్నిక‌ల్‌ వ‌ర్క్‌

* మైన‌స్‌పాయింట్స్

- ప్ర‌ధ‌మార్థం

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  'వైఫ్ ఆఫ్ రామ్‌'... సెకండాఫ్ బాగుంది! 

రివ్యూ రాసింది శ్రీ

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS