నటీనటులు: రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త తదితరులు
దర్శకత్వం: రవిబాబు
నిర్మాతలు: దిల్ రాజు
సంగీతం: వైద్ద్య్
సినిమాటోగ్రఫర్: సుధాకర్ రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 1, 2019
రేటింగ్: 2/5
హారర్ కథల ఉనికి బాగా తగ్గిపోతోంది. ప్రేక్షకుల్ని మెప్పించాలంటే భయపెట్టేవిధానమైనా మారాలి, లేదంటే కథైనా మారాలి. అదే నాలుగ్గోడలు. అదే ఫార్ములా. అదే కథ అంటే కుదరదు. ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలంటే - హంగులూ, ఆర్భాటాలూ కాదు. కంటెంట్ ప్రధానం. ఈ విషయం తెలియకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వృథానే అని ఈమధ్య వచ్చిన సినిమాలు నిరూపించాయి. కొత్తదనం లేని సినిమాల్ని స్టార్లే కాపాడలేకపోతున్నారు. ఇక స్టార్లు లేకుండా వచ్చే సినిమా విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అరకొర ప్రయత్నాలు, ఉడికీ ఉడకని కథల వల్ల ప్రయోజనం లేదని చెప్పిన మరో సినిమా ఈ `ఆవిరి`.
* కథ
రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) లకు ఇద్దరు పిల్లలు. వాళ్లే... శ్రేయ, మున్ని. అనుకోని ప్రమాదంలో శ్రేయ చనిపోతుంది. ఇక ఆ ఇంట్లో ఉండలేక మరో ఇంటికి షిఫ్ట్ అవుతుంది కుటుంబం. అక్కడికి వెళ్లాక మున్ని ప్రవర్తన విచిత్రంగా మారిపోతుంది.గాల్లో ఎవరితోనో మాట్లాడుతుంటుంది. ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. మున్నీని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు తల్లిదండ్రులు. అత్యాధునికమైన టెక్నాలజీవాడి కాపలా పెంచుతారు. అయినా సరే మున్ని తప్పించుకుంటుంది. మున్ని మాయమయ్యాక సీసీ కెమెరాలు పరిశీలిస్తే... రాజ్, లీనాలకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటి? మున్ని ఎక్కడికి వెళ్లిపోయింది.? మున్నితో మాట్లాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం `ఆవిరి` చూస్తే తెలుస్తుంది..
* నటీనటులు
తన సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించడం రవిబాబుకి అలవాటు. అయితే ఈసారి ప్రధాన పాత్ర తానే తీసుకున్నాడు. ఆ పాత్రలో రవిబాబు కాకుండా మరొకరు నటించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మెల్లమెల్లగా రవిబాబు కూడా అలవాటైపోతాడు. బాల నటి చక్కగా చేసింది. నేహా చౌహాన్ జస్ట్ ఓకే. మిగిలినవాళ్లెవ్వరివీ చెప్పుకోదగిన పాత్రలు కావు. వాళ్లకు అంత ప్రాధాన్యమూ లేదు.
* సాంకేతిక వర్గం
దాదాపు ఒకే సెట్లో జరిగే కథ ఇది. ఆ ఇంటిసెట్ ని రూపొందించడంలో కళా దర్శకుడి ప్రతిభ, ఆ సెట్‌ని వాడుకోవడంలో ఛాయాగ్రాహకుడి పనితనం కనిపిస్తాయి. అవి మినహా సాంకేతికంగా పెద్దగా మెరుపుల్లేవు. రవిబాబు ఈ సినిమాతో పెద్దగా షాకింగేం ఇవ్వలేదు. ట్విస్టు కూడా మామూలుగా ఉంది.
* విశ్లేషణ
థ్రిల్లర్ చిత్రాలలో పెద్దగా కథ ఉండదు. కథనానికే ప్రాధాన్యం. ఇక్కడ కూడా అంతే. చాలా చిన్న కథని ఎంచుకున్నాడు రవిబాబు. అయితే ఆ కథని పకడ్బందీగా నడిపించే శక్తి కథనానికి లేకుండా పోయింది. సత్యానంద్ లాంటి స్ర్కీన్ ప్లే రైటర్‌ని ఎంచుకున్నా - బోరింగ్ స్ర్కీన్ ప్లేతో విసిగించాడు రవిబాబు. శ్రేయ చనిపోవడంతో కథ మొదలవుతుంది. అలా నేరుగా కథలోకి వెళ్లిపోయి మంచి పని చేశాడు రవిబాబు.
కొత్త ఇంట్లోలకి ప్రవేశించాక కథ చాలాసేపు అక్కడే ఉండిపోయింది. ఆ ఇంటి పరిసరాల్ని చూపించడానికే చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. మున్నీ ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పడానికి ఇంకొన్ని సీన్లు తీనేశాడు. విశ్రాంతి పడినా - అసలు ఈ ఇంట్లో దెయ్యం ఉందా, లేదా? ఉంటే ఆ దెయ్యం ఎవరు? అనేది చెప్పలేదు. అది చెప్పేస్తే... ద్వితీయార్థంలో చెప్పడానికి ఇంకేం లేదని దర్శకుడు భావించి ఉంటాడు. మున్ని ఇంట్లోంకి వెళ్లాక పోలీసులు ఇన్వేస్టిగేషన్ మొదలవ్వాలి. అదీ జరగలేదు. ఓ ప్రొఫెసర్‌ని తీసుకొచ్చి.. ఇంట్లో కూర్చోబెట్టారు. అలా ఇంకొంత కాలయాపన జరిగింది. సినిమా ఇంకాసేపట్లో ముగుస్తుందగా ఆ దెయ్యం ఎవరు? అనే విషయాన్ని బయటపెట్టారు. అది కూడా ఆసక్తికరంగా లేదు. ఇంతా చూపించి ఓ రివెంజ్ డ్రామా రాసుకున్నాడా? అనిపించింది.
రవిబాబుకి టెక్నికల్ అంశాలపై మోజెక్కువ. అవి చూపించడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంటాడు. ఈసారీ అదే జరిగింది. హారర్, థ్రిల్లర్ అని కలరింగు ఇచ్చిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. థ్రిల్ కూడా అంతంత మాత్రమే. దెయ్యాన్ని చూపిస్తేనే జనం జడుసుకోవడం లేదిప్పుడు. ఇక గాల్లో దెయ్యం ఉందనుకోమంటే ఎలా? చివర్లో దెయ్యాన్నీ చూపించారు. కానీ మామూలు మనుషులు కంటే ఇంకా మామూలుగా కనిపించింది. ఇక భయం ఎక్కడ ఉంటుంది..?
* ప్లస్ పాయింట్స్
టెక్నికల్ టీమ్
* మైనస్ పాయింట్స్
కథ, కథనం
* ఫైనల్ వర్డిక్ట్: ఆశలు.. ఆవిరి
- రివ్యూ రాసింది శ్రీ