'ఏబీసీడీ' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, నాగబాబు, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
సంగీతం: జుదా శాండీ
సినిమాటోగ్రఫర్: రాం
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ: మే 17, 2019

రేటింగ్‌: 2.75/ 5

మెగా హీరో నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒక‌డు.  గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ త‌న వెనుక ఉంది. మెగా కుటుంబం అండ‌దండ‌లున్నాయి. అయినా స‌రే, నిదానంగా ప్ర‌యాణం చేస్తున్నాడు. శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తు మిన‌హాయిస్తే త‌న కెరీర్‌లో చెప్పుకోద‌గిన విజ‌యాలేం లేవు. మిగిలిన యువ హీరోలు, ఎలాంటి బ్యాక్ గ్రౌండూ లేని కుర్రాళ్లు దూసుకుపోతున్న ఈ త‌రుణంలో - త‌న‌ని తాను నిరూపించుకోవ‌డానికి ఓ మంచి సినిమా చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకే.. రిస్క్ త‌క్కువ‌గా ఉండే ఓ రీమేక్ క‌థ‌ని ఎంచుకున్నాడు. అదే 'ఏబీసీడీ'. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌యినా, రిపేర్లు చేసుకుంటూ - మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ కాల‌క్షేపం చేశారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా విడుద‌లైంది. మ‌రి `ఏబీసీడీ` ఎలా ఉంది..? అల్లు శిరీష్ క‌ష్టం ఫ‌లించిందా?

* క‌థ‌

అర‌వింద్ (అల్లు శిరీష్‌) వేల‌కోట్ల‌కు వార‌సుడు. తండ్రి (నాగ‌బాబు) అమెరికాలో పెద్ద వ్యాపార వేత్త‌. పాతికేళ్లు శ్ర‌మించి... ఆ స్థాయికి వెళ్లాడు. కొడుకేమో.. డాల‌ర్ల‌ని చిల్ల‌ర పెంకుల్లా ఖ‌ర్చు పెట్టేస్తుంటాడు. డ‌బ్బు విలువ‌, మ‌నుషుల విలువ‌, టైమ్ విలువ అస్స‌లు తెలీవు. `నువ్వు ఇండియా వెళ్లి డ‌బ్బు విలువ తెలుసుకురా` అని బ‌ల‌వంతంగా ఇండియాకు పంపించేస్తాడు.పాకెట్ మ‌నీ క‌ట్ చేస్తాడు. క్రెడిట్ కార్డులు బ్లాక్ చేస్తాడు. అమెరికాలో ద‌ర్జాగా బ‌తికిన అర‌వింద్‌.... ఇండియాలో ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించాడు? డ‌బ్బు విలువ ఎలా తెలిసొచ్చింది? అనేది మిగిలిన క‌థ‌.

* న‌టీన‌టులు

శిరీష్ న‌టుడిగా కాస్త మెరుగ‌య్యాడ‌నే చెప్పాలి. ఏబీసీడీ సినిమా చేసిన మేలేమైనా ఉందంటే.. అది శిరీష్‌లోని న‌టుడికి కాస్త స్పేస్ దొర‌క‌డ‌మే. ప‌తాక స‌న్నివేశాల్లో డైలాగులు బాగానే చెప్పాడు. త‌న న‌ట‌న‌లో ఇది వ‌ర‌క‌టి కంటే కాస్త ఈజ్ క‌నిపిస్తోంది. చాలా కాలం త‌ర‌వాత భ‌ర‌త్‌ని తెర‌పై చూసే అవ‌కాశం ద‌క్కింది. యువ హీరోల ఫ్రెండ్‌గా తాను మంచి ఆప్ష‌న్ అయిపోతాడు. వెన్నెల కిషోర్ త‌న వంతు న్యాయం చేశాడు. రుక్సార్ పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. అయితే త‌న  గ్లామ‌ర్ లుక్స్‌తో క‌ట్టిప‌డేసింది. శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజా పాత్ర‌ల్ని స‌రిగా వాడుకోలేదు. ఆ స్థానంలో ఇంకాస్త పాపుల‌ర్ న‌టుల్ని తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

* సాంకేతిక వ‌ర్గం

విడుద‌ల‌కు ముందే సిద్ శ్రీ‌రామ్ పాడిన పాట పాపుల‌ర్ అయ్యింది. అది మిన‌హాయిస్తే.. సంగీతంలో మెరుపులు లేవు. కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది. న‌టీన‌టుల ఎంపిక విష‌యంలో చిత్ర‌బృందం ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బాగుండేది. ఓ రీమేక్ క‌థ‌ని తీసుకునేట‌ప్పుడు మార్పులు చేర్పులు అవ‌స‌ర‌మే. అయితే ఎక్క‌డ మార్చాలి? ఎక్క‌డ కొత్త స‌న్నివేశాలు రాసుకోవాలి?  అనే విష‌యం ఆ ద‌ర్శ‌కుడికి తెలిసుండాలి. ఆ విష‌యంలో త‌డ‌బ‌డ్డాడు.

* విశ్లేష‌ణ‌

క‌థ‌గా కొత్త పాయింటేం కాదు. నాని సినిమా `పిల్ల జ‌మిందార్‌` కూడా ఇంతే. అక్క‌డ డ‌బ్బున్న నాని.. హాస్టల్‌కి వ‌చ్చి, బీద‌రికం అనుభ‌విస్తే - ఇక్కడ కోట్లున్న అల్లు శిరీష్ ఇండియాలో బీద‌వాడిగా బ‌త‌కాల్సివ‌స్తుంది. అయితే ఫ‌న్ కి కావ‌ల్సినంత స్పేస్ ఉంది. దాన్ని ద‌ర్శ‌కుడు బాగానే వాడుకున్నాడు. ఇండియా వ‌చ్చిన త‌ర‌వాత అల్లు శిరీష్ - భ‌ర‌త్ ప‌డే క‌ష్టాల నుంచి కావ‌ల్సినంత వినోదాన్ని సృష్టించాడు. వాళ్ల ఇబ్బందుల‌తో ప్రేక్ష‌కుల‌కు టైమ్ పాస్ అయిపోతుంది. ల‌వ్ ట్రాక్‌, విల‌న్ ట్రాక్ ఈ క‌థ‌కు కీల‌కం. వాటిని ఎంత స‌మ‌ర్థంగా చెప్ప‌గ‌లిగితే ఈ సినిమా అంత‌గా నిల‌బ‌డుతుంది. కానీ.. ఈ రెండు విష‌యాల్లోనూ ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. ల‌వ్ ట్రాక్ చాలా సాదా సీదాగా న‌డిచిపోయింది. సీరియ‌స్‌గా సాగాల్సిన విల‌న్ డ్రామా కూడా... అంతంత మాత్రంగానే న‌డుస్తుంది.

ప‌డుతూ లేస్తూ సాగిన ఈ సినిమాని కామెడీ థ్రెడ్ మాత్రం అక్క‌డ‌క్క‌డ నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ `కాఫీ విత్ కిషోర్‌` ఎపిసోడ్ మాత్రం ద్వితీయార్థానికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. ఈమ‌ధ్య యూ ట్యూబ్‌లో పాపుల‌ర్ అయిన ఫ‌స్ట్రేట్రెడ్ న్యూస్ రీడ‌ర్ ఎపిసోడ్‌ని ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్ క్లైమాక్స్‌లోనే బ‌లంగా వినిపిస్తుంది. ఓ మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్ ఇది. పాయింట్‌ని, కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని య‌ధాత‌ధంగా తీసుకున్నారు. భ‌ర‌త్, వెన్నెల కిషోర్ కోసం కొన్ని సీన్లు జోడించారు. కామెడీకి ఎక్కువ స్కోప్ ఉన్న క‌థ ఇది. వినోద స‌న్నివేశాలు బాగున్నాయి. కానీ వాటికి ఇంకొంచెం బాగా తీయాల్సింది. ద్వితీయార్థంలో చాలా ఆటుపోట్లున్నాయి. ఆ లోపాల్ని స‌రిదిద్దుకుంటే... ఏబీసీడీ మంచి సినిమాగా మిగిలేది. ఇప్పుడు మాత్రం యావ‌రేజ్ మార్కులే ప‌డ‌తాయి.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ శిరీష్ - భ‌ర‌త్ మ‌ధ్య సీన్లు
+ వెన్నెల కిషోర్ కామెడీ

* మైన‌స్ పాయింట్స్

- సెకండాఫ్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: ఏబీసీడీ... మ‌రో పిల్ల జ‌మిందార్‌

- రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS