'ఆచారి అమెరికా యాత్ర‌' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: మంచు విష్ణు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణం: సిద్దార్థ రామస్వామి
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు
స్క్రీన్ ప్లే -దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి

రేటింగ్: 2/5

వినోదాత్మ‌క చిత్రాల‌కు ఎప్పుడైనా గిరాకీనే.  కాస్త న‌వ్విస్తే చాలు... లాజిక్కులు సైతం మ‌ర్చిపోయి హాయిగా ఆశీర్వ‌దించేస్తారు ప్రేక్ష‌కులు. కానీ న‌వ్వించ‌డం అంత తేలికైన విద్య కాదు. అమెరికా వాడి చేద‌ అవ‌కాయ పెట్టించ‌డం అంత క‌ష్టం.  న‌వ్విస్తే మాత్రం... మినమం గ్యారెంటీ. దాన్ని న‌మ్ముకునే జి.నాగేశ్వ‌ర‌రెడ్డి వినోదాత్మ‌క చిత్రాల బాట ప‌ట్టాడు. చాలాసార్లు అత‌నికి విజ‌యం ల‌భించింది కూడా. విష్ణుతో తీసిన సినిమాల‌న్నీ బాగా ఆడాయి. ఆ సెంటిమెంట్‌నే న‌మ్ముకుని ఈసారి  విష్ణుతో 'ఆచారి అమెరికా యాత్ర‌'  చేయించాడు. మ‌రి ఆ యాత్ర ఎలా సాగింది?  న‌వ్వులు పండాయా, లేదా?

* క‌థ‌

కృష్ణ‌మాచారి (విష్ణు) అప్ప‌లాచారి (బ్ర‌హ్మానందం) గురు శిష్యులు. ఇద్ద‌రూ య‌జ్ఞాలు యాగాలూ చేయిస్తుంటారు. ఓసారి రాజు (ప్ర‌దీప్‌రావ‌త్‌) అనే ఓ దుర్మార్గుడి ఇంట్లో యాగం జ‌రిపిస్తే... ఆఖ‌రి రోజున ఆ ఇంటి పెద్ద (కోట శ్రీ‌నివాస‌రావు) హ‌ఠాత్తుగా చ‌నిపోతాడు. దానికి కార‌ణం.. కృష్ణ‌మాచారి, అప్ప‌లాచారే అని భావించి.. వాళ్ల వెంట ప‌డ‌తారు రౌడీలు. వాళ్ల బారీ నుంచి త‌ప్పించుకోవ‌డానికి కృష్ణ‌మాచారి, అప్ప‌లాచారి బృందం అమెరికా వెళ్లిపోతారు. అక్క‌డ వాళ్ల‌కు ఎదురైన తిప్ప‌లేంటి?   అమెరికాలో క‌నిపించిన  ప్ర‌గ్యా జైస్వాల్‌ (రుక్మిణి)కీ కృష్ఱ‌మాచారికీ ఉన్న సంబంధం ఏమిటి?  అనేది తెర‌పైనేచూడాలి.

* న‌టీన‌టులు

క‌థ‌, క‌థ‌నాలు బ‌ల‌హీనంగా ఉంటే న‌టీన‌టులు మాత్రం ఏం చేస్తారు..?  విష్ణులో కామెడీ టింజ్ ఉంది. చ‌లాకీగా న‌టించ‌గ‌ల‌డు. కానీ తానూ చేతులెత్తేశాడు. బ్ర‌హ్మానందం లాంటి ఉద్దండుడు న‌వ్వించ‌డానికి ఆప‌సోపాలు ప‌డ్డాడంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు. ప్ర‌గ్యా జైస్వాల్ కాస్త గ్లామ‌ర్‌గా క‌నిపించింది. అందాలు ఆరేయ‌డంలో ఎక్క‌డా మొహ‌మాట ప‌డ‌లేదు. 30 ఇయ‌ర్స్ ఇండ్ర‌స్ట్రీ ఫృథ్వీ తాత క‌థ చెప్పి బాగా విసిగించేశాడు. ప్ర‌దీప్ రావ‌త్‌కి డ‌బ్బింగ్ సైతం సూట్ట‌వ్వ‌లేదు. కోట వీల్ ఛైర్‌కే ప‌రిమితం అయ్యాడు.

* విశ్లేష‌ణ‌

జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఎంచుకున్న క‌థ‌ల‌న్నీ పైపైనే ఉంటాయి. వినోదాత్మ‌క చిత్రాల‌కు బ‌ల‌మైన క‌థ అవ‌స‌రం లేదు కాబ‌ట్టి... స‌ర్దుకుపోవొచ్చు. ఈసారి ఆయ‌న మ‌ల్లాది కృష్ణ‌మూర్తి న‌వ‌ల‌ని ప్రేర‌ణ‌గా తీసుకుని ఈ సినిమా తీశారు. మ‌ల్లాది న‌వ‌ల కాబ‌ట్టి మంచి మంచి ట్విస్టులూ, ట‌ర్న్‌లూ ఉంటాయ‌నుకుంటారు. కానీ ఈ సినిమాలో అవేం క‌నిపించ‌వు. చాలా సాధార‌ణ‌మైన క‌థ ఇది. నాగేశ్వ‌రెడ్డి బ‌లం వినోదం. వెరైటీ పాత్ర‌లు, ఆ పాత్ర‌ల నుంచి పుట్టే సున్నిత‌మైన హాస్యం నాగేశ్వ‌రెడ్డి బ‌లాలు. అయితే ఆచారిలో అవి కూడా మిస్స‌య్యాయి.

తొలి స‌న్నివేశం నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒక్క‌రీలంటే.. ఒక్క‌రీలు కూడా న‌వ్వించ‌దు. ప్ర‌తీ స‌న్నివేశం,ప్ర‌తీ పాత్రా స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టేవే. వినోదాత్మ‌క చిత్రాల‌కు క‌థాబ‌లం అవ‌స‌రం లేక‌పోవొచ్చు. కానీ క‌థంటూ ఉండాలిగా. అది ఈ సినిమాలో మిస్స‌య్యంది. ఓ పెద్దింటి అమ్మాయి, ఆస్తి కోసం గొడ‌వ‌లు.. అందులోంచి ఆ అమ్మాయిని కాపాడే హీరో. ఎన్ని సినిమాల్లో చూడ‌లేదు ఈ క‌థ‌. దాన్నే అటు తిప్పి, ఇటుతిప్పి మ‌రోసారి చూపించే ప్ర‌య‌త్నం చేశారు. క‌మెడియ‌న్ల గ్యాంగ్ ఉన్నా, కామెడీ పండించే స్కోప్ ఉన్నా ద‌ర్శ‌కుడు వాడుకోలేదు. ఏదో ముక్త‌స‌రిగా స‌న్నివేశాల్ని లాగించేశాడు.

సినిమా ముగింపు ద‌శ‌లో ప‌డేస‌రికి ఆ న‌స పెరిగిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. పాట‌లూ అంతంత‌మాత్ర‌మే. ఫైటింగుల్లో ఫైర్ లేదు. హీరో విల‌న్లు అర‌చుకుంటారు, స‌వాళ్లు విసురుకుంటారు త‌ప్ప‌... వాటి వ‌ల్ల క‌థ‌కు ఒరిగిందేం ఉండ‌దు. ఈమ‌ధ్య కాలంలో ఇంత నీర‌సంగా నిస్తేజంగా సాగిన కామెడీ సినిమా మ‌రోటి రాలేదంటే న‌మ్మండి. అలా ఉంది రాత‌, తీత‌.

* సాంకేతిక వ‌ర్గం

ఇంత పేల‌వ‌మైన క‌థ‌ని ఎంచుకున్న ద‌ర్శ‌కుడిదే త‌ప్పు. స‌న్నివేశాల్ని కూడా స‌రిగా రాసుకోలేక‌పోయాడు. పాట‌లేమాత్రం బాగాలేవు. స‌గం స‌న్నివేశాలు హోమం చుట్టూ న‌డిచేవే. కాబ‌ట్టి సేమ్ లొకేష‌న్ చూసీ చూసీ బోర్ కొట్టేస్తుంది. ఏది అమెరికాలో తీశారో, ఏ స‌న్నివేశాలు ఇండోర్‌లో లాగించేశారో, ఏది బ్లూమాట్ పెట్టి తీశారో సుల‌భంగా చెప్పేయొచ్చు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ ప్ర‌గ్యా అందం

* మైన‌స్ పాయింట్స్‌

- మిగిలిన‌వ‌న్నీ

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: వీసా దొర‌క‌డం కష్టం

రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS