నటీనటులు: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, తులసి
దర్శకత్వం : మల్లిక్ రామ్
నిర్మాతలు: మందవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
సంగీత దర్శకుడు: రాధన్
ఎడిటింగ్: గ్యారీ బి
రేటింగ్: 2.75/5
''కొన్ని కథల్లో నిజాలుంటాయి..
కొన్ని కథల్లో అబద్దాలు వుంటాయి..
నిజానికి అబద్దానికి దూరంగా వుండే కథలు అద్భుతంగా వుంటాయి''
'అద్భుతం' సినిమా ఎండింగ్ కార్డ్ ఇది. 'నిజానికి అబద్దానికి దూరంగా వుండే కథ. ఈ లైన్ లోనే బోలెడు ప్రశ్నలు వున్నాయి. అనేక సందేహాలు వున్నాయి. బోలెడంత ఊహా దాగుంది. ఈ కథ నిజం కాదు. అబద్ధం అని కూడా చెప్పడం లేదు. నిజానికి, అబద్దానికి దూరంగా అన్నారు. ఏమిటా దూరం..? ఊహా.. ? సైన్సా ? సూపర్ నేచురల్ పవరా ? ఇంతకీ ఏమిటా అద్భుతమైన కథ.
కథ:
సూర్య (తేజ సజ్జా ) ఎందుకుందో తెలియని ఓ టీవీ ఛానల్ న్యూస్ రీడర్. గతంలో మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ కోసమే బ్రతుకుతాడు. ఒక అమ్మాయి కూడా ప్రేమిస్తాడు. కానీ మ్యూజిక్, అమ్మాయి రెండూ దక్కవు. పాపం.. తండ్రిని కూడా పోగొట్టుకుంటాడు. ఆ గతం తేజని వెంటాడుతుంటుంది. ఇక బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని బిల్డింగ్ పైకి ఎక్కి దూకేయడానికి ముందు తన సూసైడ్ పబ్లిక్ కి న్యూసెన్స్ కాకూడదని తన ఫోన్ నెంబర్ కే సూసైడ్ నోట్ సెండ్ చేస్తాడు. కట్ చేస్తే.. వెన్నెల (శివాని రాజశేఖర్ ) కి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు తండ్రి (దేవి ప్రసాద్) కానీ వెన్నలకి పెళ్లి ఇష్టం వుండదు. జీఈటీ పరీక్ష రాసి జర్మని వెళ్లి చదువుకోవాలనేది ఆమె డ్రీమ్. కానీ చాలా కష్టపడి ప్రతి సారి పరీక్ష తప్పుతుంటుంది.
తండ్రి ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ లో కూడా పరీక్ష తప్పి.. మరో దారి లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చెరువులో దూకేయడానికి సిద్దంగా వుండగా.. తేజ తన నెంబర్ కి సెండ్ చేసిన సూసైడ్ నోట్ చాలా వింతగా వెన్నలకి ఫోన్ కి వస్తుంది. మెసేజులు చుసుకున్నాక ఇద్దరూ ఆత్మహత్యని విరమించుకుంటారు. వారి పరిచయం మొదలౌతుంది. ఇక్కడే వారికీ ఇంకో వింత తెలుస్తుంది. వెన్నెల (2014) లో సూర్య ( 2019) లో వుంటారు. అసలు ఇంత అద్భుతం సాధ్యమా ? ఇద్దరు ఒకే సమయంలో వేరు వేరు కాలాలలో ఎలా ఉండగలరు. ఒకే నెంబర్ ఇద్దరు ఎలా వాడగలరు ? నెట్ వర్క్ గ్లిచ్ కారణంగా వాడారే అనుకుందాం.. దేశంలో ఇన్ని కోట్లమంది వుండగా... తేజ సెండ్ చేసిన మెసేజ్ వెన్నెలకే ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అద్భుతం సినిమాలో వున్నాయి.
విశ్లేషణ:
కొన్ని ఆలోచనలు అద్భుతంగా అనిపిస్తాయి. అరె.. భలే పాయింట్ కదా.. అనుకుంటాం. అయితే ఆ పాయింట్ సినిమాగా మార్చే క్రమం అంతా ఈజీ కాదు. అయితే అద్భుతం చిత్ర యూనిట్ మాత్రం అద్భుతమనిపించే పాయింట్ ని సినిమాగా తీయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. నిజ జీవితంలో అనుభవంలోకి రాని సంఘటనలని కథలుగా రాసి.. నిజమే అని భ్రమకలిగించే నేర్పు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భలే పట్టుకుంటారు. క్రిస్టోఫర్ నోలన్ టైం ట్రావెల్ సినిమాలని చూసినప్పుడు... ఇలా నిజ జీవితంలో జరగదని తెలుసు. కానీ ఆ రెండున్నర గంటలు ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి కాసేపటికి ఇలా జరగొచ్చు అని ప్రేక్షకుడు ఫీలయ్యే మ్యాజిక్ చేస్తాడు నోలన్. అద్భుతం సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ కొంత వరకూ జరిగింది. నిజానికి చాలా బలం వున్న పాయింట్ ఇది. పెద్ద స్కేల్ లో తీస్తే పెద్దతెరపై చూడదగ్గ సినిమా. కానీ పరిమత బడ్జెట్ తో మంచి పాయింట్ ని ఓటీటీకి పరిమితం చేసేయడం కొంత నిరాశ కలిగించింది.
నిజానికి చాలా కాంప్లికేట్ కథ ఇది. కథ రెండు కాలాల్లో జరుగుతుంది. సూర్య పాత్ర ఫార్వార్డ్ లో వుంటుంది. వెన్నెల పాత్ర ఐదేళ్ళు వెనక వుండి.. అక్కడి నుంచి ఫార్వార్డ్ అవుతుంటుంది. దీన్ని కొంచెం క్లియర్ గా చెప్పడానికి సినిమాలో ఓ సీన్ చూద్దాం. వెన్నెల 28 మే 2014లో వుంటుంది. 2019లో సూర్య ఉంటాడు. ఇద్దరూ ఫోన్ మాట్లాడతారు. సూర్యకి జై తెలంగాణ స్లొగన్స్ వినిపిస్తాయి. ఏమిటా స్లొగన్స్ అని అడిగితే.. తెలంగాణ ఉద్యమం అని చెబుతుంది. 2019లో వున్న సూర్య .. అదేంటి తెలంగాణ వచ్చేసింది కదా ఇంకేం ఉద్యమం ? అని ఆశ్చర్యపోతాడు. వెన్నెల నవ్వుతుంది. ఐదు రోజుల తర్వాత జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడుతుంది. అప్పుడు తేజ నవ్వుతాడు. వెన్నల ఆశ్చర్యపోతుంది. అంటే జరిగిపోయిన ఈవెంట్స్ సూర్యకి తెలుసు. సూపర్ మ్యాన్ కధల్లో ఇలా వుంటుంది. కానీ ఇక్కడ వున్నది తేజ. ప్రళయాలని ఆపేయడం, విశ్వాన్ని రక్షించడం.. ఇలాంటి సూపర్ హీరో ఎలిమెంట్స్ జోలికి పోలేదు. కేవలం సూర్య జీవితానికే ఈ పాయింట్ ని పరిమితం చేసి తన ప్రేమ కధ చూట్టే కధని నడిపారు. ఈ పాయింట్ కి ఇది చాలా వరకూ మేలు చేసింది.
టైం ట్రావెల్ కథలు మనకి కొత్త కాదు. ఆదిత్య 369లాంటి క్లాసిక్ వుంది. అయితే ఆ జోనర్ ని సెట్ చేసి ప్రేక్షకుల మెప్పుపొందడం అంత తేలిక కాదు. ఆ మధ్య సూర్య 24 తో వచ్చినా ప్రేక్షకులని మ్యాజిక్ చేయలేకపోయారు. ఇలాంటి కథలకు ప్రధాన సమస్య మూడ్ ని సెట్ చేయడం. ప్రేక్షకుడిని ఒక కాలంలో వుంచి.. అదే కాలం నుంచి ముందుకి వెనక్కి తీసుకెళ్ళడం అంటే చాలా లాజిక్కుల ని దాటి మ్యాజిక్కు చేయాలి. అద్భుతంలో కూడా చాలా లాజిక్కులు బొర్రని తొలుస్తుంటాయి.
అయితే ఈ లాజిక్కులని ఒక డైలాగ్ తో నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ''ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన సైన్స్ కొవ్వుత్తి చుట్టూ వున్న వెలుతురంత. వెలుతు వెనుక వున్న అనంతమైన చీకటి ఇంకా వెలుగు చూడాలి''. ఈ డైలాగ్ ని డీప్ గా అర్ధం చేసుకుంటే.. నీవు చుస్తున్నదే సైన్స్ కాదు.. నీవు అనుకుంటున్నదే లాజిక్ కాదు. నీకు తెలియంది ఆనంత విశ్వమంత. అంటే విశ్వంలో అద్భుతాలు వున్నాయని చెప్పడం రచయిత ఉద్దేశం అయ్యిండొచ్చు. అయితే దిన్ని మాటలా కాకుండా సినిమా కాన్సెప్ట్ కి న్యాయం చేస్తూ ఏదైనా పాత్ర ద్వారా విజువలైజ్ చేసి వుంటే .. కాన్సెప్ట్ ఇంకా నేరుచుల్ గా వుండేది.
క్లిష్టమైన కథని సులువుగా చెప్పడానికి రైటింగ్ టేబుల్ మీద చాలా కసరత్తు జరిగిందనే సంగతి సినిమా చూస్తే అర్ధమౌతుంటుంది. సీన్స్ అన్నీ ఫ్రెష్ గా వున్నాయి. త్వరగానే కధలోకి వెళ్ళిపోయారు. అయితే కధ ఒక్కసారిగా వెనక్కిముందుకి అవ్వగానే కొంచెం తికమక అనిపిస్తుంది. ఓ టీటీ సినిమా అని పరధ్యానంగా చూస్తే మాత్రం ఇంకా తికమక అయ్యే ప్రమాదం వుంది. కొంచెం మైండ్ బెండింగ్ సినిమానే ఇది. ఇంకాస్త మైండ్ బెండ్ చేసే అవకాశం వున్నా.. దర్శకుడు ఆ రిస్క్ తీసుకోలేదు.
మొన్న వచ్చిన 'టెనెట్' సినిమాలో ఇన్వెర్షన్ ఫార్ముల అప్లయ్ చేసుంటే.. ఇంకా కాంప్లికేట్ అయిపోయేది. కానీ దాని జోలికి వెళ్ళలేదు. అయితే కొంచెం సినిమా స్వేఛ్చ తీసుకొని ఒక సీన్ ని వాడారు. 2019 లో సూర్య ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. 2014లో అదే బెంచ్ పై కూర్చుని వుంటుంది వెన్నెల. బెంచ్ మీద ఒక పేరు రాస్తుంది. అదే బెంచ్ పై వున్న సూర్యకి ఆ పేరు అప్పుడే రాస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సీన్ ని లాజికల్ గా చెప్పాలంటే దీని కోసం బోలెడు ఫిజిక్స్ చెప్పాలి. ప్రేమ అనేది డ్రామా. సో డ్రామా మొదలైన చోట లాజిక్ ఎండ్ అయిపోతుందనే సినిమా సూత్రాన్ని అప్లేయ్ చేసి ఇలాంటి లాజిక్స్ మన్నించేయాలి.
'అద్భుతం' కథ ప్రశాంత్ వర్మది. ఆయన కధలన్నీ కొంచెం సెరైల్ గా వుంటాయి. అయితే ఈ కధకి స్క్రీన్ ప్లేయ్ చేసిన లక్ష్మి భూపాలని మెచ్చుకోవాలి. లక్ష్మీ భూపాల కథకు న్యాయం చేశారు. నమ్మబుల్ గా లేని పాయింట్ ని నేచురల్ అప్రోచ్ లో రాయడంలో విజయం సాధించారు. ముందే చెప్పినట్లు కొంచెం క్లిష్టమైన కథ. కొన్ని చిక్కుముళ్ళు వున్నాయి.
అయితే ఆ చిక్కుముళ్ళని తన పెన్ను బలంతో చాలా నేర్పుగా విడదీసి కధని చూపించే ప్రయత్నం చేశాడు. హాలీవుడ్ టచ్ వున్న ఈ పాయింట్ ని ఆ వాసన కొట్టకుండా పూర్తిగా తెలుగైజ్ చేయడంలో లక్ష్మీ భూపాల తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం. కథ చివర్లోకి వచ్చేసరికి సూర్య వెన్నల మద్య ఫోన్ కనెక్షన్ పోతుంది. అప్పుడు వరకూ రెండు కధలుగా సాగిన ఈ సినిమా .. ఫోన్ కనెక్షన్ పోవడంతో ఒకే కథ అవుతుంది. భలే అనిపిస్తుంది. ఇది పూర్తిగా స్క్రీన్ ప్లేయ్ క్రిడిట్.
గతం మార్చడం అంటే దేవుడ్ని చేతిల్లోకి తీసుకోవడమే. తన తండ్రి చావుని తప్పించాలని సూర్య చేసిన ప్రయత్నం, సూర్యని కలవడానికి వెన్నెల చేసే ప్రయత్నంలో పంచభూతాలు సహకరించకపోవడం.. ఇవన్నీ చక్కగా స్క్రీన్ ప్లేయ్ లో ఇమిడ్చారు. 2014లో జరిగిన ప్రేమ కథలో పెద్ద ఫీల్ వుండదు. కానీ రెండో కధని మొదటి కధకి కలిపి ఫీల్ ని రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే ముగింపు కొంచెం సినిమాటిక్ గా వుంది. ఎన్ని ప్రయోగాలు చేసిన చివరికి తెలుగువారి టెస్ట్ కి తగ్గట్టు అనే ఫార్ములకి కట్టుబడిపోయి ముగింపు ప్లాన్ చేసుకున్న భావన కలుగుతుంది.
నటీనటులు:
తేజ.. సూర్య పాత్రలో ఒదిగి పోయాడు. చాలా సహజంగా కనిపించాడు. కథ పరంగా సూర్య పాత్రకి ఒక సూపర్ పవర్ ఉంది. కానీ ఆ పవర్ ని పాత్రకి మాత్రమే పరిమితం చేయడం బావుంది. సూర్య పాత్రలో ఉన్న వేరియేషన్స్ చక్కగా చూపించాడు. శివాని సహజంగా కనిపించింది. ఆమె పాత్రని తీర్చి దిద్దిన విధానం బావుంది. సత్య పాత్ర, చమ్మక్ చంద్ర పాత్రలు నవ్వులు పంచుతాయి. బామ్మ పాత్ర చేసిన తులసిని డెస్టినీ ఎలిమెంట్ చెప్పడానికి వాడుకోవడం ఓకే అనిపిస్తుంది. శివాజీ రాజా, దేవి ప్రసాద్ .. మిగతా పాత్రలు పరిధిమేర చేశారు.
టెక్నికల్ గా సినిమా బావుంది. కథకు కావలసిన జాగ్రత్తలు తీసుకున్నారు. కథ రెండు కాలంలో జరుగుతుంది. బాగా గమనిస్తే ఆ రెండు కాలాల్లో ఉన్న తేడా చూపించడంలో మంచి సెట్ వర్క్ కనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
కొత్త పాయింట్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్
తేజ, శివాని నటన
మైనస్ పాయింట్స్:
లాజిక్ దూరంగా ఉన్న కొన్ని సీన్లు
మొదటి ప్రేమకథలో బలం లేకపోవడం
ఫైనల్ వర్డిక్ట్ : లాజిక్ ని పక్కన పెడితే అద్భుతమే..