చిత్రం: ఆదిపురుష్
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్ నాగ్, సన్నీ సింగ్
దర్శకత్వం: ఓం రౌత్
నిర్మాత: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్
సంగీతం: అజయ్ – అతుల్
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
కూర్పు: అపూర్వ మోతివాలే సహాయ్, ఆశిష్ మ్హత్రే
బ్యానర్స్: T-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్
విడుదల తేదీ: 16 జూన్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
రామాయణం మహా కావ్యం. రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి. అన్నిటికీ గొప్ప స్పందన వచ్చింది. కొన్ని చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. `శ్రీరామ రాజ్యం` తరవాత ఈ ఇతిహాస నేపథ్యంలో సినిమా చేయలేదెవరూ. అదో లోటుగా మిగిలిపోతున్న తరుణంలో `ఆదిపురుష్` పట్టాలెక్కింది. రాముడి కథ కావడం, ఆ పాత్రలో.. ప్రభాస్ నటించడం, పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడం.. చాలా విషయాల్లో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆదిపురుష్ టీజర్ రాగానే విమర్శల వాన కూడా మొదలైంది. గ్రాఫిక్స్ సరిగా లేవని, సినిమాని చుట్టేశారని నొసలు చిట్లించారు. అయితే.... ట్రైలర్ తో టాక్ మొత్తం మారిపోయింది. పది రోజుల క్రితం వరకూ లేని క్రేజ్.... విడుదలకు ముందు ఉప్పెనలా ఎగసి పడింది. మరి.. మారిన అంచనాల నేపథ్యంలో `ఆదిపురుష్` ఎలా తీర్చిదిద్దబడింది? రామాయణాన్ని యధాతధంగా తీశారా? లేదంటే ఇతిహాసాన్ని వక్రీకరించారా? ఇంతకీ ఆదిపురుష్‌గా.. ప్రభాస్ ఎలా ఉన్నాడు..?
కథ: రావణుడు సీతని ఎత్తుకెళ్లిపోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తరవాత వానర సైన్యం సహాయంతో.. రాముడు లంకపై తండెత్తడం, సీతని కలుసుకోవడంతో కథ ముగుస్తుంది. ఈమధ్యలో.. చాలా ఘట్టాలున్నాయి. బ్రహ్మా కోసం ఘోర తపస్సు చేసిన రావణుడు వరం పొందడం, రావణుడ్ని శూర్పణక ఉగిగొల్పడం, వాలిపై రాముడి యుద్ధం, లంకా దహనం, సంజీవనిని ఎత్తురావడం, చివర్లో రామ - రావణ యుద్ధం.. ఇలా చాలా ఆసక్తికరమైన అంకాలున్నాయి. ఇవన్నీ మేళవిస్తూ.. ఓం రౌత్ ఈ కథని చెప్పాడు.
విశ్లేషణ: రాముడి కథ, రామాయణం అంటే కొత్త విషయాలేం ఉండవు. అన్నీ తెలిసిన ఘట్టాలే. వాటిని దర్శకుడు ఎంత ప్రభావవంతంగా చూపించాడు? చరిత్రని వక్రీకరించాడా? లేదా? అనేదే కీలకం. వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ కథని రాసుకొన్నాని దర్శకుడు ముందే చెప్పాడు. సందర్భానుసారం.. కొన్ని మార్పులు చేర్పులు చేశానని, అవి కూడా రామాయణ విశిష్టతకు ఎక్కడా భంగం కలగకుండానే చూసుకొన్నాని వివరణ ఇచ్చాడు. అందుకే వాల్మీకి రామాయణానికి దూరంగా కొన్ని ఘట్టాలున్నా సర్దుకుపోవాల్సిందే.
దర్శకుడు ఓం రౌత్ రామాయాణం ద్వారా ప్రేక్షకులకు విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎమోషన్స్ కంటే విజువల్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఎవెంజెర్స్ లాంటి హాలీవుడ్ సినిమాల్ని దర్శకుడు రిఫరెన్స్ గా తీసుకొన్నట్టు కనిపిస్తోంది. ఆ స్థాయి విజువల్స్ ఇందులోనూ ఉన్నాయి. ముఖ్యంగా వానర సైన్యం చూపించినప్పుడు కానీ, వాలీతో రాముడి యుద్ధ సన్నివేశం కానీ, క్లైమాక్స్ కానీ.. హాలీవుడ్ సినిమాల ప్రభావంతో తీసినవే. ఈ జనరేషన్‌కి నచ్చేలా సీన్లు డిజైన్ చేసుకొన్న దర్శకుడు.. కొన్ని చోట్ల వావ్ అనిపిస్తే.. ఇంకొన్ని చోట్ల గీత దాటాడనిపిస్తుంది.
ముఖ్యంగా రావణుడి లంకని తెరపై చూపించేటప్పుడు మరీ మితిమీరిన స్వేచ్చ తీసుకొన్నాడు. లంలో రాక్షసులే ఉంటారు.. మనుషులకు చోటుండదు అనే రీతిలో లంకని ఆవిష్కరించాడు. అదేదో కేజీఎఫ్ సెటప్ లా కనిపిస్తుంది తప్ప... లంక లా ఉండదు. కొందరి వస్త్రధారణ కూడా మోడ్రన్ టచ్‌తో సాగుతుంది. పాత కాలపు రామాయణాలు చూసినవాళ్లకు, సంపూర్ణ రామాయణం లాంటి సినిమాల గురించి తెల్సిన వాళ్లకు ఈ రామాయణం ఆధునిక వెర్షన్‌లా తోస్తే.. అది వాళ్ల తప్పు కాదు.
విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అక్కడక్కడా మెరుపులు కనిపిస్తాయి. సీతని రావణుడు ఎత్తుకెళ్లే సీన్.. హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. క్లైమాక్స్ లో యుద్ధ సన్నివేశం కూడా అంతే. హనుమంతుడి లంకా దహనం, సంజీవనని ఎత్తుకురావడం ఇవన్నీ ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా తెరకెక్కించాల్సింది. కుంభకర్ణుడ్ని లక్ష్మణుడు హరించినట్టు వాల్మీకీ రామాయణంలో ఉంది. కానీ వాల్మీకీ రామాయణం ఆధారంగా తీసిన ఈ కథలో కుంభకర్ణుడ్ని సైతం.. రాముడే చంపేసినట్టు చూపించారు. కొన్ని చోట్ల సంభాషణలు కూడా ఆధునిక పోకడలకు దగ్గరగా ఉన్నాయి. బహుశా డబ్బింగ్ సంభాషణల వల్ల కావొచ్చు. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రభాస్ మినహా మిగిలినవాళ్లంతా బాలీవుడ్ వాళ్లే. అందుకే ఓ హిందీ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు: రాముడి పాత్ర పోషించడం తేలికేం కాదు. సవాల్ తో కూడుకున్న విషయం. ఎందుకంటే రాముడు అంటే అన్ని తరాలకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఆయన్ని మరిపించేలా చేయడం అసాధ్యం. ట్రోలింగ్ కి గురికాకుండా, హుందాగా కనిపించడం కూడా కష్టమే. ఆ కష్టాన్ని ప్రభాస్ దాటేశాడు. తన ఆహార్యం బాగుంది. ఒకేరకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో సినిమా మొత్తం కవర్ చేశాడు. సీతగా కృతి సనన్ కుదిరింది. ఆమె నుంచి కూడా ఎలాంటి లోటుపాట్లు లేవు.
హనుమంతుడు, లక్ష్మణుడు పాత్రలకు తెలిసిన నటీనటుల్ని ఎంచుకొంటే బాగుండేది. ఇక అందరికంటే ఎక్కువ మార్కులు సైఫ్ అలీఖాన్‌కి వెళ్తాయి. రావణుడిగా తన నటన.. చాలా బాగుంది. అన్ని ఎమోషన్స్‌ని చక్కగా పండించారు.
సాంకేతిక నైపుణ్యం: ఇలాంటి సినిమాలకు విజువల్స్ చాలా ముఖ్యం. టీజర్లో తేలిపోయిన విజువల్స్ వెండి తెరపై అదిరాయి. నిజానికి ఈ స్థాయిలో విజువల్స్ ఉంటాయని ఎవరూ అనుకోలేదు. రాముడి ఎంట్రీ సమయంలో పిచాచాలతో చేసిన యుద్ధంలో విజువల్స్ క్లమ్జీగా ఉన్నాయి. మిగిలిన సినిమా కూడా అలానే ఉంటుందేమో అని అంతా భయపడ్డారు. కానీ ఆ తరవాతి సన్నివేశాల్లో క్వాలిటీ చూపించారు. పాటలు, నేపథ్య సంగీతం హృద్యంగా ఉన్నాయి. కాకపోతే 3 గంటల సినిమా ఇది.
తొలి సగం గంటన్నరకు పైనే సాగుతుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టదు. రెండో సగం నిడివి తక్కువే అయినా.. కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఈతరానికి రామాయణాన్ని అర్థమయ్యేలా, వాళ్లకు ఓ విజువల్ వండర్ అనిపించేలా తీశాడు ఓం రౌత్. ఆ క్రమంలో అక్కడక్కడ గీత దాటాడు. కొన్ని చోట్ల మెప్పించాడు.
ప్లస్ పాయింట్స్:
ప్రభాస్
విజువల్స్
రావణుడి పాత్ర
మైనస్ పాయింట్స్:
నిడివి
మరీ మోడ్రన్‌గా మార్చేయడం
ఫైనల్ వర్డిక్ట్: మోడ్రన్ రామాయణం...