ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: న‌వీన్ పొలిశెట్టి, శ్రుతిశ‌ర్మ తదితరులు
దర్శకత్వం: స్వ‌రూప్ RSJ
నిర్మాతలు:  రాహుల్ యాదవ్ నక్క
సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌
సినిమాటోగ్రఫర్: సన్నీ కొర్రపాటి
విడుదల తేదీ: జూన్ 21, 2019

 

రేటింగ్‌: 3/5

 

మ‌న ద‌గ్గ‌ర డిటెక్టివ్ సినిమాలు చాలా త‌క్కువ‌.  ఆ సినిమాల గురించి ఆలోచిస్తే అప్పుడెప్పుడో వ‌చ్చిన  చిరంజీవి `చంట‌బ్బాయ్‌`నే గుర్తుకొస్తుంది త‌ప్ప... అంత‌లా ప్ర‌భావం చూపించిన మ‌రో సినిమా క‌నిపించ‌దు.  కొత్త‌ద‌నం పంచ‌డానికి ఆ నేప‌థ్యానికి మించింది మ‌రొక‌టి  ఏముంటుంది? ద‌ర్శ‌కుడు తెలివిగా ఓ క్రైమ్ క‌థ‌కి ఆ నేప‌థ్యాన్ని ఎంచుకుని `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` తెర‌కెక్కించాడు. వెబ్ ప్ర‌పంచంలో ఫేమ‌స్ అయిన  న‌వీన్ పొలిశెట్టి  ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకునేలా ఉండ‌టంతో సినిమాకి మంచి ప్ర‌చారం ల‌భించింది. మ‌రి అస‌లు సినిమా ఎలా ఉంది? ఏజెంట్ ఎలాంటి వినోదాన్ని పంచాడు తెలుసుకుందాం ప‌దండి...

 

* క‌థ‌

 

డిటెక్టివ్ అంటే ఎలా ఉంటాడు?
అమ్మో... య‌మా యాక్టివ్‌. ఎలాంటి కేసునైనా ఇట్టే తేల్చేయ‌గ‌ల‌డు. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ (న‌వీన్ పొలిశెట్టి) కూడా అంతే. పైగా త‌న‌పైన త‌న‌కు చాలా కాన్ఫిడెన్స్‌. సినిమాలు చూస్తూ అందులో ఏ క్యారెక్ట‌ర్ ఏంటో ప‌సిగ‌ట్టేసే  మ‌హాఘ‌టికుడు. అలాంటోడికి తిరుగేముంటుంది?  నెల్లూరులో  త‌న ఫ‌స్ట్ ల‌వ్ పేరుతో ఫాతిమా బ్యూరో ఇన్వెస్టిగేష‌న్ (ఎఫ్‌బిఐ) పేరుతో ఓ సంస్థ‌ని స్థాపించి కేసులు ప‌ని ప‌డుతుంటాడు. కానీ అన్నీ చిల్ల‌ర కేసులే వ‌స్తుంటాయి. ఎలాగైనా ఓ పెద్ద కేసుని ఛేదించి త‌న టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల‌నుకొంటాడు.  కానీ సీన్ రివ‌ర్స్ అయిపోతుంది. ఆ కేసుల్లో అత‌నే చిక్కుకుంటుంటాడు.  ఇంత‌కీ ఆ  పెద్ద కేసు ఏమిటి?  వాటి నుంచి నుంచి ఎలా బ‌య‌ట‌పెట్టాడు?  తాను ఛేదించాల‌నుకున్న కేసుని నిగ్గు తేల్చ‌గ‌లిగాడా లేదా?  త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

* న‌టీన‌టులు

 

న‌వీన్ పొలిశెట్టి న‌ట‌న సినిమాకి ప్రాణం పోసింది. ఆయ‌న కామెడీ టైమింగ్ చాలా బాగుంది.  సెంటిమెంట్ కూడా బాగా పండించాడు.  శ్రుతిశ‌ర్మ   స్నేహ అనే పాత్ర‌లో న‌టించింది. హీరోతో పాటే క‌నిపిస్తూ అక్క‌డ‌క్క‌డా హాస్యం పండించారామె. మ‌రో ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా సుహాస్ పండించే హాస్యం కూడా మెప్పిస్తుంది. ఇందులో దాదాపుగా కొత్త‌వాళ్లే న‌టించారు. వాళ్లంతా కూడా పాత్ర‌ల్లో స‌హ‌జంగా ఇమిడిపోయారు.

 

* సాంకేతిక వ‌ర్గం

 

సాంకేతిక విభాగంలో ఎడిటింగ్ విభాగం మిన‌హా మిగిలిన అంద‌రూ మంచి ప్ర‌తిభ క‌నబరిచారు. ప్ర‌థ‌మార్థంలో స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపించ‌డం సినిమాకి మైన‌స్.  మార్క్ కె.రాబిన్ సంగీతం, స‌న్నీ కూర‌పాటి కెమెరా ప‌నిత‌నం సినిమాకి ప్రాణం పోశాయి.  ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఎంతో ప‌రిణ‌తితో సినిమాని తెర‌కెక్కించాడు. ఆయ‌న మాట‌లు కూడా బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు ప‌ర్వాలేదు.

 

ప్రేక్ష‌కుల‌కు ఫ్రెష్‌గా అనిపించే  సినిమాలు అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తుంటాయి. వాటి జాబితాలోకి చేరే చిత్రం ఇది. క‌థ‌, క‌థనాలు, పాత్ర‌లతో పాటు.. ఈ నేప‌థ్యం కూడా కొంత‌కాలం పాటు గుర్తుండిపోతుంది. కొత్త‌త‌రం ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లు ఎంత వైవిధ్యంగా ఉంటాయో మ‌రోమారు నిరూపించిన చిత్రాల జాబితాలోకి  ఈ సినిమా చేరుతుంది. అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా,  మ‌ధ్య‌లో కొంచెం గంద‌ర‌గోళంగా అనిపించినా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్నే పంచుతుందీ చిత్రం.

 

* విశ్లేష‌ణ‌

 

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ పాత్ర `చంట‌బ్బాయ్` సినిమాలో చిరంజీవి పాత్ర‌ని గుర్తు చేసినా... ఇందులో క‌థ, క‌థ‌నాలు పూర్తి భిన్నం. ఈ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజిన‌ల్ అంటూ సాగుతుంటాయి ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు.  నిజంగానే... ఈ సినిమా కూడా ఒరిజిన‌ల్‌. ఇందులో చ‌ర్చించిన విష‌యాలు, ఈ నేప‌థ్యం ఇప్ప‌టిదాకా తెలుగు తెర‌పై చూడ‌నివి. ఒక హ‌త్య చుట్టూ సాగే క‌థ‌ల‌తో చాలా సినిమాలే తెర‌కెక్కాయి. ఇది కూడా అలాంటిదే. కానీ  ఆ త్రెడ్ వెన‌క  చూపించిన విష‌యాలు మాత్రం చాలా కొత్త‌గా ఉంటాయి.  క‌థ‌నాన్ని న‌డిపించిన విధానం కూడా చాలా బాగుంటుంది. కేసులో చిక్కుముడులు విప్పుతున్న‌కొద్దీ, వెన‌కాల కొత్త చిక్కులు వ‌చ్చిప‌డిపోతుంటాయి. అలా  ఆ వ‌లో  హీరోనే ప‌డిపోవ‌ల్సి వ‌స్తుంది. వాటి నుంచి ఎలా బ‌య‌టికొస్తాడు?  తాను అస‌లు కేసుని ఎలా ఛేదిస్తాడ‌నే విష‌యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. 

 

ప్ర‌థ‌మార్థం పాత్ర‌ల్ని ఎస్టాబ్లిష్ చేయ‌డానికి...  క‌థ‌కి త‌గ్గ బేస్‌ని సిద్దం చేయ‌డానికీ తీసుకున్నాడు. ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ ఉంటుంది.  అయితే ప్రేక్ష‌కుడిని థ్రిల్ చేయ‌డంలో భాగంగా ద్వితీయార్థంలో మోతాదుకి మించి  క‌థ‌లో మ‌లుపులు వ‌స్తుంటాయి. అవి అక్క‌డ‌క్క‌డా ప్రేక్ష‌కుల‌కు బోరింగ్‌గా అనిపిస్తుంటాయి. అయితే హాస్యం పండించ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నాడు. మ‌ధ్యలో క‌థ‌లో భాగంగానే  క్ర‌మం త‌ప్ప‌కుండా హాస్యం పండుతుండ‌టంతో ప్రేక్ష‌కుడికి మంచి కాల‌క్షేపం అవుతుంది.  ప‌తాక స‌న్నివేశాలు, రిలీజియ‌స్ క్రైమ్ నేప‌థ్యాన్ని తెర‌పై చూపించిన విధానం  ఆక‌ట్టుకుంటుంది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌

+మ‌లుపులు

+హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌

+నేప‌థ్య సంగీతం

 

* మైన‌స్ పాయింట్స్

-చివర్లో కాస్త గ‌జిబిజి

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: మ‌న షెర్లాక్‌హోమ్స్‌

 

- రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS