తారాగణం: నాగ శౌర్య, షామిలి, సుమిత్ర, సుధ, హేమ, శివాజీరాజ తదితరులు
నిర్మాణ సంస్థ: స్వజిత్ మూవీస్
సంగీతం: కల్యాణ రమణ
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: రాజేష్
రచన-దర్శకత్వం: సుందర్ సూర్య
రేటింగ్: 2.5/5
కుటుంబ బంధాలు - అనే కాన్సెప్ట్ ఎప్పటికీ అరిగిపోనిది, తరిగిపోనిది. ఈ అంశం చుట్టూ ఎన్ని సినిమాలొచ్చినా జనం చూస్తూనే ఉన్నారంటే అది కచ్చితంగా ఈ కథలతో ఉన్న అటాచ్‌మెంటే. అమ్మానాన్న, అత్తా, మావయ్య, పిన్ని బాబాయ్.. తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ... వీళ్లంతా కలగపిలిన కుటుంబం, వాళ్ల మధ్య అనుబంధాలు ఎన్నిసార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది. ఆ భావోద్వేగాల్ని మరోసారి పంచిన చిత్రం `అమ్మమ్మగారిల్లు`.
* కథ
సంతోష్ (నాగశౌర్య)కి చిన్నప్పటి నుంచీ తన అమ్మమ్మ (సీతామహాలక్షి) అంటే చాలా ఇష్టం. సీతామ్మది చాలా పెద్ద కుటుంబం. కానీ... ఆస్తి తగాదాలతో విడిపోతుంది. ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అమ్మమ్మ మాత్రం ఆ ఇంట్లో బిక్కుబిక్కుమని ఉంటుంది. అమ్మమ్మ కోసం.. ఆ ఇంట్లోవాళ్లందరినీ కలపాలని, మళ్లీ మహాలక్ష్మమ్మ ఇంట్లో కళాకాంతులు తీసుకురావాలని భావిస్తాడు సంతోష్. అందుకోసం ఏం చేశాడు? అమ్మమ్మ కళ్లలో సంతోషం ఎలా తీసుకొచ్చాడు? సీత (షాలిని)తో తన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ
ఛలోలో చాలా చలాకీగా కనిపించాడు నాగశౌర్య. ఇంతటి ఎమోషన్ నిండిన పాత్రలో కనిపించడం అరుదే. కానీ... ఆ బాధ్యతనీ సక్రమంగా నెరవేర్చాడు. శౌర్య నుంచి అల్లరి సన్నివేశాలు ఆశిస్తే మాత్రం నిరాశే ఎదురవుతుంది.
షామిలి చాలా కాలం తరవాత కనిపించింది. తను కూడా నటిగా మంచి మార్కులు వేయించుకుంటుంది. అందరి కంటే ఎక్కువ క్రెడిట్ రావు రమేష్‌కి దక్కుతుంది. ఆ పెద్దరికం, హుందాతనంతో... పాత్రకు కొత్త మెరుపులు జోడించాడు.
అమ్మమ్మగా కనిపించిన సుమిత్ర బాగానే నటించినా, ఆ పాత్రకు అందరికీ తెలిసున్న నటిని ఎంచుకుంటే బాగుండేది.
* విశ్లేషణ
దర్శకుడిగా సుందర్ సూర్యకు ఇదే తొలి ప్రయత్నం. కథా పరంగా కొత్త ప్రయత్నాలేం చేయలేదు. కథని నేలపై ఉంచి నడిపించాడు. మన ఇంట్లోనో, పక్కింటిలోనో చూస్తున్న కథే. అనుబంధాల మధ్య ఆస్తులు చిచ్చులు పెడుతున్న రోజుల్లో... సరిగ్గా అదే పాయింట్ పట్టాడు. ఓ కుటుంబాన్ని కలపడానికి ఓ కుర్రాడు చేసిన ప్రయత్నాలు ఓ కథగా మలిచాడు.
కథలో కొత్తదనం కనిపించకపోవొచ్చు. కానీ భావోద్వేగాలు మాత్రం ఎక్కడో ఓ చోట ప్రేక్షకుడ్ని పట్టేస్తాయి. ప్రతీ ఒక్కరికీ ఓ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంతో అనుబంధమో, దూరమో ఉంటుంది. ప్రేమో.. పగో ఏర్పడుతుంది. అవన్నీ మరోసారి మనకే పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. చివరిగా `ఇలాంటి కుటుంబం ఉంటే బాగుంటుంది కదా` అనే భావన వచ్చేలా చేశాడు.
కథని ప్రారంభించిన విధానం బాగుంది. సూటిగా చెప్పాల్సింది చెబుతూ.. ఎక్కడా ఎలాంటి తికమకలూ, తడబాటూ లేకుండా కథలోకి తీసుకెళ్లిపోయాడు. ఒకొక్క పాత్రనీ పరిచయం చేస్తూ.. అక్కడక్కడ ఎమోషన్స్‌టచ్ చేస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. అయితే.. సీతతో ప్రేమ కథ, వాటి చుట్టూ నడిచే సన్నివేశాల్లో బలం లేకుండా పోయింది. లవ్ స్టోరీ లో కొత్త యాంగిల్ లేదు. అక్కడ దర్శకుడు ఈతరానికి నచ్చేలా కొన్ని సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది.
సినిమాలో చాలా పాత్రలే ఉన్నా - ఒకట్రెండు పాత్రల పైనే దర్శకుడు ఫోకస్‌పెట్టాడు. దానికి తోడు కథనం కూడానెమ్మదిస్తుంది. కథాగమనం ఓసారి అర్థమైపోయాక.. ట్విస్టులూ గట్రా లేకపోవడం, ఒకటే ఫ్లాట్‌పై సినిమా సాగడం కూడా .. ప్రతికూల అంశాలే. ఈ కథ బలం, భావోద్వేగాలు. అవి ఎక్కడెక్కడ పండించాలనుకున్నాడో.. అక్కడక్కడ దర్శకుడు విజయం సాధించాడు. మిగిలిన చోట్ల మాత్రం తేలిపోయాడు.
* సాంకేతిక వర్గం
కళ్యాణ రమణ సంగీతం హాయిగా ఉంది. తను ముందు నుంచీ మంచి మెలోడీలనే అందిస్తున్నాడు. ఈసారీ శ్రావ్యమైన సంగీతం వినే అవకాశం దక్కింది. మాటలు అక్కడక్కడ మెరిశాయి.
దర్శకుడు సుందర్ పాత కథనే ఎంచుకున్నాడు. ఉన్నంతలో దాన్ని అందంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ సన్నివేశాల్ని కాస్త ట్రిమ్ చేయాల్సింది.
* ప్లస్ పాయింట్స్
+ ఎమోషన్స్
+ ఫ్యామిలీ డ్రామా
* మైనస్ పాయింట్స్
- పాత కథ
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: అమ్మమ్మగారిల్లు.. ఓసారి వెళ్లి రావొచ్చు.
రివ్యూ రాసింది శ్రీ