నటీనటులు: ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్, అభిషేక్ బెనర్జీ, సత్య తదితరులు
దర్శకత్వం : కేవీ గుహన్
నిర్మాతలు: వెంకట్ తలారి
సంగీత దర్శకుడు: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
ఎడిటర్: తమ్మిరాజు
రేటింగ్ : 2/5
కె.వి.గుహన్ మంచి కెమెరామెన్. చాలా కమర్షియల్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆ తరవాత దర్శకుడిగా మారారు. కల్యాణ్ రామ్ తో తెరకెక్కించిన '118' ఓకే అనిపించుకొంది. ఆ తరవాత 'డబ్ల్యూ డబ్ల్యూ.. డబ్ల్యూ' అనే ఓ చిన్న సినిమా తీశారు. అది... ఓటీటీకే పరిమితమైంది. ఇప్పుడు మరో ఓటీటీ సినిమాకి దర్శకత్వం వహించారు. అదే 'హైవే'. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ `హైవే` ప్రయాణం ఎలా సాగింది? ఈసారి గుహన్ ఎంచుకొన్న సబ్జెక్ట్ ఎలా ఉంది?
* కథ
విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఓ స్టిల్ ఫొటో గ్రాఫర్. స్నేహితుడు సముద్రం (సత్య)తో కలిసి.. ఈవెంట్లు చేస్తుంటాడు. ఓ ఈవెంట్ కోసం బెంగళూరు బయల్దేరతారు. మధ్యలో తులసి (మానస రాధాకృష్ణన్) పరిచయం అవుతుంది. తను ఒట్టి అమాయకురాలు. బయటి ప్రపంచమే తెలీదు. అనుకోని పరిస్థితుల్లో తన నాన్నని చూడ్డానికి బయల్దేరుతుంది. విష్ణు తనకు లిఫ్ట్ ఇస్తాడు. అయితే... విష్ణు బెంగళూరు వెళ్లాలి కాబట్టి... మార్గ మధ్యలో తులసిని ఓ బస్ ఎక్కిస్తాడు.
మరోవైపు... డీ (అభిషేక్ బెనర్జీ) అనే సైకో..హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తుంటాడు. ఒంటరిగా కనిపించిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి, వాళ్లని చిత్రవధ చేసి చంపేస్తుంటాడు. తులసి కూడా ఆ సైకో బారీన పడుతుంది. తులసిని కాపాడుకోవడానికి విష్ణు ఏం చేశాడు? సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి లేడీ పోలీస్ ఆఫీసర్ (సయామీఖేర్) చేసిన ప్రయత్నాలేంటి? అసలు ఆ సైకో వెనుక కథేమిటి? అనేది ఓటీటీ తెరపైనే చూడాలి.
* విశ్లేషణ
ఓ సైకో.. వరుసగా, ఒకే పేట్రన్‌లో హత్యలు చేస్తుండడం, పోలీసులు లేదా, హీరో ఆ సైకోని ఛేధించడం.. ఇదే ఏ సైకో థ్రిల్లర్ లో అయినా చూసే కంటెంట్. `హైవే` అందుకు మినహాయింపు కాదు. సేమ్ ఇదే ఫార్మెట్ లో.. సాగే సినిమా ఇది. కథ విషయంలో ఏమాత్రం కొత్తదనం లేదు. థ్రిల్లర్‌లకు అవసరం కూడా లేదు. కాకపోతే.. ట్రీట్‌మెంట్ కొత్తగా ఉండాలి. క్షణం క్షణం మలుపులతో ఉత్కంఠత కలిగించాలి. అవేమీ ఈ `హైవే`లో కనిపించవు. సైకో ఎవరు? ఎక్కడ ఉంటాడు? అనేది తెలుసుకోవడంలో కిక్ ఉంటుంది. ఈ సినిమాలో అది కూడా లేదు. ఎందుకంటే సైకో ఎవరన్నది ఆడియన్స్‌కి ముందే రివీల్ చేసేశాడు దర్శకుడు.
పోలీసులు కనుక్కోవడమే ఫజిల్. సైకో ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోవడంతో.. ఆ థ్రిల్ మిస్సయ్యింది. అక్కడ్నుంచి దర్శకుడు అన్నీ తనకు కన్వెనియన్స్ గా రాసుకొన్న సన్నివేశాలే. సైకో.. అంబులెన్స్ లో తిరుగుతుంటాడు. అంబులెన్స్ ని ఎవరూ చెక్ చేయరు కదా.. అదో అడ్వాంటేజీ. ఓ వైపు సైకో కథ.. ఇంకో వైపు విష్ణు కథ. ఇవి రెండూ సమాంతరంగా సాగుతాయి. విష్ణు కథలో ఎలాంటి ఉత్కంఠత ఉండదు. అది చాలా రొటీన్ గా సాగుతుంటుంది. సయామీఖేర్ తన అసిస్టెంట్ తో... సైకో గురించి చేసిన రీసెర్చ్ అంతా పేజీలు పేజీలు అప్పగించడం తప్ప, వాళ్లు చేసే ఇంటిలిజెన్స్ యాక్టివిటీ ఏమీ ఉండదు. తులసి సైకోకి దొరికేయడం ఇంట్రవెల్ బ్యాంగ్ అనే సంగతి ముందు నుంచీ అర్థమవుతూనే ఉంటుంది. సరిగ్గా అక్కడే .. బ్యాంగ్ పడింది కూడా.
విశ్రాంతి తరవాత కూడా కథ ముందుకు సాగలేదు. కొత్త ట్విస్టులేం రాలేదు. అసలు సైకో అలా ఎందుకు మారాడు? అనేది రెండు మూడు డైలాగులతో చెప్పించేశాడు. అది కూడా ఇంపాక్ట్ గా అనిపించదు. ఓ రకంగా.. `స్పైడర్`లో.. విలన్ సూర్య పాత్రలాంటిదే అది. సైకోకి తులసి దొరికేశాక... పెద్దగా ప్రతిఘటించకపోవడం, సైకో చెప్పింది చెప్పినట్టు చేయడం... ఇదంతా సిల్లీగా అనిపించే విషయాలు. సైకోని పట్టుకోవడానికి అటు పోలీసులు గానీ, ఇటు హీరోగానీ మైండ్ గేమ్‌కి పని చెప్పరు. పైగా చివర్లో దేవుడు దిగివచ్చి.. శత్రు సంహారం చేసినట్టు చూపించారు. అది కూడా అతికే విషయం కాదు. సైకో కథలో.. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ ఇరికించాలని చూశారు. అది కుదర్లేదు. సత్య కామెడీ కూడా పెద్దగా పండలేదు. సైకో థ్రిల్లర్‌లో ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలూ, ఉత్కంఠ పూర్తిగా కరువైన సినిమా ఇది.
* నటీనటులు
ఆనంద్ దేవరకొండ హీరోగా ఇందులో చేసిందేం లేదు. ఆ పాత్ర పరిధి చాలా తక్కువ. తొలి సగంలో.. రోడ్లపై కారేసుకుని తిరగడం తప్ప చేసిందేం లేదు. తన హెయిర్ స్టైల్, గడ్డం చూస్తుంటే.. లుక్ పై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదేమో అనిపిస్తోంది. కథల ఎంపికలోనూ ఆనంద్ ఇప్పుడు జాగ్రత్త పడాలి.
మానస చూడ్డానికి ఓకే. మొహంలో అమాయకత్వం కనిపిస్తోంది. లవ్ స్టోరీలకు మంచి ఛాయిస్ అనుకోవాలి. ఇక సైకోగా నటించిన అభిషేక్ బెనర్జీ మంచి నటుడు. తనని సరిగా వాడుకోలేదు.
సత్య కామెడీ పండలేదు. సయామీ ఖేర్ కి ఇది కొత్త తరహా పాత్రే. దానిక్కూడా బిల్డప్పులు ఎక్కువయ్యాయి. మేటర్ లేదు.
* సాంకేతిక వర్గం
గుహన్ మంచి కెమెరామెన్. అయితే తన మార్క్ చూపించడానికి ఈ సినిమాలో అవకాశం రాలేదు. స్క్రిప్టు చాలా వీక్ గా ఉంది. బడ్జెట్ పరిమితులు చాలా కనిపించాయి.
మేకింగ్ విషయంలో క్వాలిటీ లేదు. హీరో, హీరోయిన్ల పై తెరకెక్కించిన పాట.. కూల్‌గా అనిపించింది. ఆ పాటలోనే గుహన్ కాస్త కెమెరా వర్క్ చూపించగలిగాడు. మిగిలిన చోట్ల.. కెమెరా వర్క్ కూడా చాలా డల్ గా ఉంది.
* ప్లస్ పాయింట్స్
టైటిల్
హీరోయిన్
* మైనస్ పాయింట్స్
కథ, కథనం
థ్రిల్ లేకపోవడం
బడ్జెట్ పరిమితులు
* ఫైనల్ వర్డిక్ట్: 'హైవే'లో దారి తప్పారు.