ఆగస్టు 1 నుంచి షూటింగులు ఆగిపోయాయి. టాలీవుడ్ లోని సమస్యల్ని పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటి వరకూ నిర్మాతలంతా కలిసి.. కీలకమైన సమావేశాలు నిర్వహించారు. దాదాపు అన్ని సమస్యలపై చర్చించారు. పరిష్కార మార్గాల్ని అన్వేషించారు. బంద్ ఎందుకు ప్రారంభించారో.. ఆ టార్గెట్ పూర్తయ్యింది. అందుకే ఇప్పుడు మళ్లీ షూటింగులు ప్రారంభించాలని భావిస్తున్నట్టు టాక్. ఈనెల 22 నుంచి బంద్ కి పేకప్ చెప్పేసి, షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన ఈరోజు గానీ, రేపు గానీ వచ్చే అవకాశాలున్నాయని టాక్.
మరోవైపు బంద్ నడుస్తున్నా, కొన్ని చిత్రాలు షూటింగులు జరుపుకొంటున్నాయి. దాంతో బంద్ పాక్షికంగా మారిన భావన కలిగింది. ఎలాగూ... కొన్ని రోజులు షూటింగ్ ని ఆపేసి, నిర్మాతలు తన నిరసన వ్యక్తం చేసేశారు కాబట్టి, ఇప్పుడు బంద్ ని పూర్తిగా ఎత్తేయడమే బెటర్ అనుకొంటున్నారు. ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి.. ఇలా పెద్ద హీరోలకు సంబంధించిన చిత్రాలు షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ బంద్ కొనసాగించినా, ఆయా చిత్రాల షూటింగ్ ఆగేది లేదని అర్థమైంది. అలాంటప్పుడు బంద్ విధించడంలో అర్థమేముంది? అందుకే బంద్ ఎత్తేస్తే గౌరవంగా ఉంటుందని నిర్మాతలు భావించారని తెలుస్తోంది.