తారాగణం: తాప్సీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, రాజీవ్ కనకాల, తాగుబోతు రమేష్
నిర్మాణ సంస్థ: 70ఏం ఏం ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: కృష్ణ కుమార్
ఛాయాగ్రహణం: అనిష్ తరుణ్ కుమార్
ఎడిటర్: శ్రవణ్
నిర్మాతలు: విజయ్ చిల్ల & శశి దేవిరెడ్డి
దర్శకత్వం: మహి వీ రాఘవ
యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5
టాలీవుడ్‌లో హారర్ కామెడీ ట్రెండ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ జోనర్‌లో వచ్చిన సినిమా ప్రతీదీ ఫ్లాప్ అవుతున్నా.. ఎందుకో మక్కువ చావడం లేదు. అయితే.. 'కొత్తగా భయపెడితే చూడ్డానికి సిద్ధమే' అంటూ ప్రేక్షకులు ఎప్పుడూ మంచి హారర్ కామెడీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 'ఆనందో బ్రహ్మ' ఆ తరహా సినిమానే అంటూ చిత్రబృందం గట్టిగా ప్రచారం చేసింది. 'దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడితే ఎలా ఉంటుంది' అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఆలోచన బాగుంది. దానికి తోడు తాప్సి లాంటి గ్లామర్ హీరోయిన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది. శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, షకలక శంకర్ లు ఉన్నారు కాబట్టి నవ్వులకు ఢోకా లేనట్టే. మరి ఈ అంచనాల్ని 'ఆనందో బ్రహ్మ' ఎంత వరకూ అందుకొంది. తెలుగులో మరోసారి నిలదొక్కుకోవాలన్న తాప్సి ప్రయత్నాలు ఫలించాయా?
* కథ..
శ్రీలక్ష్మీ నిలయంని అమ్మి ఆ డబ్బుతో మలేసియాలో స్థిరపడాలని కలలు కంటుంటాడు రాము (రాజీవ్ కనకాల). అయితే ఆ ఇంట్లో దెయ్యాలున్నాయన్న భయంతో కొనడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఈ సమయంలో రాముకి సిద్దు (శ్రీనివాసరెడ్డి) పరిచయం అవుతాడు. `ఈ ఇల్లు నేను మంచి రేటుకి అమ్మి పెడతా. నాకు కమీషన్ ఇవ్వండి` అంటూ బేరం పెట్టుకొంటాడు. ఆ ఇంట్లో దెయ్యాలు లేవని నిరూపించగలిగితే ఇల్లు కొనడానికి ఎవరైనా ముందుకొస్తారన్నది సిద్దు నమ్మకం. అందుకే మరో ముగ్గురు (వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్)లతో కలసి లక్ష్మీ నిలయంలో కొన్ని రోజులు గడపడానికి వెళ్తారు. అక్కడ నిజంగానే దెయ్యాలున్నాయా? దెయ్యాలుంటే అవి మనుషులకు ఎందుకు భయపడ్డాయి? ఆ ఇంటి వెనుక కథేంటి? అనేవి తెరపై చూసి తెలుసుకోవాలి.
* నటీనటుల ప్రతిభ...
ఇది తాప్సి సినిమా అనుకొని థియేటర్‌లోకి అడుగుపెడితే కష్టమే. తాప్సి ఓ పాత్ర చేసిందంతే. ఆ పాత్ర కంటే చుట్టుపక్కలున్న పాత్రలు బాగా ఎలివేట్ అయ్యాయి. శ్రీనివాసరెడ్డి తన ప్రయత్న లోపం లేకుండా నటించాడు. అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు.
షకలక శంకర్ స్నూఫ్‌లతో ఆకట్టుకొంటాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మరోసారి ఎక్కువ మార్కులు దక్కించుకొంటుంది. తాగుబోతు రమేష్ మరోసారి తన కామెడీతో మత్తెక్కించాడు.
* విశ్లేషణ...
కథపరంగా కొత్తదనం ఏమీ కనిపించదు. ఓ ఇంట్లో దెయ్యాలు ఉండడం, ఆ ఇంటి యజమాని దాన్ని అమ్మాలనిచూడడం ఇదంతా పాత కాన్సెప్టే. దానికి తోడు ప్రారంభ సన్నివేశాలు కూడా పాత హారర్ కామెడీ సినిమాల్ని గుర్తు తెచ్చేలా ఉన్నాయి. దెయ్యాలు తాము దెయ్యామన్న సంగతి మర్చిపోయి.. మనుషుల్ని చూసి భయపడడం, ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఒకొక్కరికీ ఒక్కో బలహీనత ఉండడం.. అదే దెయ్యాలు భయపడడానికి అసలు కారణం కావడం.. కాస్త తమాషాగా అనిపిస్తాయి. వాటిలోంచే దర్శకుడు కావల్సినంత వినోదం పుట్టించాడు. తొలి సగం.. పాత్రల పరిచయం, దెయ్యాలతో భయపెట్టడానికి వాడుకొన్నాడు. రెండో సగంలో అసలు కథ మొదలవుతుంది. ఈ కథకు బలం.. ద్వితీయార్థమే. అక్కడ కామెడీ బాగా వర్కవుట్ చేయగలిగాడు దర్శకుడు. మరీ పగలబడి నవ్వే సీన్లు ఏం లేవు గానీ... చూస్తున్నంత సేపూ వినోదానికి ఢోకా లేకుండా చూసుకొన్నాడు దర్శకుడు. అసలు దెయ్యాల కథేంటి? అనే విషయానికి వచ్చేసరికి కథలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. మలుపులు ఉన్నా.. దాన్ని రివీల్ చేసే ప్రతిభ దర్శకులకు ఉండాలి. ఆ విషయంలో మహి మంచి హోం వర్కే చేశాడనిపిస్తుంది. ట్విస్ట్ రివీల్ చేసిన పద్ధతి బాగుంది.
లెక్కకు మించిన పాత్రలు రావడం, వాటిలో చాలా వరకూ పాసింగ్ క్యారెక్టర్లు కావడంతో... ఆయా సన్నివేశాలు రక్తి కట్టవు. మొత్తానికి దెయ్యాలు మనుషులకు భయపడడం అనే కాన్సెప్ట్ మాత్రం చక్కగానే డీల్ చేశాడు. ఆ భయపడానికి కారణాలూ బాగానే రాసుకొన్నాడు దర్శకుడు. హారర్ కామెడీలో ఎవరూ టచ్ చేయని పాయింట్ కాబట్టి.. ఆ మేర టికెట్ కొన్న ప్రేక్షకుడికి డబ్బులు గిట్టుబాటు అవుతాయి. అయితే బేసిగ్గా హారర్ సినిమాలో ఉండాల్సిన భయం అనే ఎలిమెంట్ ఈ సినిమాలో బాగా మిస్ అయ్యింది.
* సాంకేతికంగా...
మహి స్క్రిప్టు వరకూ బాగానే రాసుకొన్నాడు. తన పాయింట్ కొత్తది. అయితే.. మిగిలిన హారర్ కామెడీ ఫార్మెట్‌లోనే ఈ కథ చెప్పాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆర్.ఆర్‌లో కొత్త సౌండింగ్ కనిపించింది. ఉన్నది ఒకే ఒక్క పాట. దాన్ని వాడుకొన్న తీరూ బాగుంది.
* ప్లస్ పాయింట్స్
+ వినోదం
+ కాన్సెప్ట్
+ నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
- భయం తగ్గింది
- రొటీన్ సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: భయం తక్కువ.. కామెడీ ఎక్కువ
రివ్యూ బై శ్రీ