తారాగణం: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ & తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వి.యస్
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
రేటింగ్: 2.75/5
ఎంత కష్టపడి సినిమా తీశాం అన్నది కాదు... ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ అయ్యేలా ఉందా? లేదా? అనేది ముఖ్యం.
ప్రేక్షకుడి ఆలోచనలకు, ఆశలకు దూరంగా ఉంటే.. ఎంత కష్టపడినా వృథానే. కొత్త కథలు చెప్పాలనుకున్నప్పుడు, ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రిస్కులు ఉంటూనే ఉంటాయి. వాటిని దాటుకుని సినిమా తీయడం, కమర్షియల్ మార్గాన్ని పక్కన పెట్టి, కొత్త దారులు వెదుక్కోవడం అభినందించదగిన విషయాలు. 'కంచె'తో ఇలాంటి ప్రయత్నమే చేశాడు వరుణ్‌తేజ్. 'ఘాజీ'తో సంకల్ప్‌రెడ్డి కూడా ఇలాంటి కొత్త బాటలోనే నడిచి విజయం అందుకున్నాడు. వీరిద్దరూ కలసి చేసిన సినిమా.. 'అంతరిక్షం'. మరి ఇదెలా ఉంది? ఈ ప్రయోగంతో ఫలితం ఎవరికి దక్కింది??
కథ
దేవ్ (వరుణ్‌తేజ్) ఓ ఆస్ట్రోనాట్. తన ఉద్యోగం అంటే తనకు ప్రాణం. ఎన్నో విజయవంతమైన ప్రయోగాల్లో తన భాగస్వామ్యం ఉంది. జానకి (లావణ్య త్రిపాఠి)ని ప్రేమిస్తాడు దేవ్. మీరా అనే శాటిలైట్ ని తన బిడ్డలా భావిస్తాడు. అయితే.. అంతరిక్షంలో ఈ ప్రయోగం విఫలమవుతుంది. ఓ ప్రమాదంలో జానకి కూడా మరణిస్తుంది. దాంతో ఉద్యోగాన్ని వదిలి దూరంగా వెళ్లిపోతాడు. మళ్లీ ఐదేళ్ల తరవాత.. దేవ్ అవసరం భారత అంతరిక్షయాన సంస్థకు అవసరం అవుతుంది. ఓ క్లిష్టమైన సమస్య దేవ్ ముందుకు వెళ్తుంది. దాన్ని దేవ్ ఎలా పరిష్కరించాడు? అనేదే కథ.
నటీనటుల పనితీరు..
వరుణ్‌తేజ్ కథల్ని ఎంపిక చేసుకునే విధానం ఎప్పుడూ బాగానే ఉంటుంది. ఇదో ప్రయోగాత్మక చిత్రమని వరుణ్‌కి తెలుసు. తనక్కూడా ఇలాంటి కథలంటే ఇష్టం కాబట్టి ఆ రిస్క్ తీసుకోగలిగాడు. నటన పరంగా తన వైపు నుంచి పెద్దగా లోపాలు కనిపించవు. లావణ్యది చిన్న పాత్రే. కానీ బాగానే చేసింది. అతిథిరావు హైదరీకి కీలక పాత్రదక్కింది. రఘు.. ఓకే అనిపిస్తాడు. అవసరాల శ్రీనివాస్ పాత్ర అంతంత మాత్రంగానే సాగింది. సత్యదేవ్ ద్విపాత్రాభినయం చేశాడు.
విశ్లేషణ...
'ఘాజీ'లానే అంతరిక్షం కూడా ఓ విభిన్నమైన ప్రయత్నం అని చెప్పుకోవాలి. తొలి సినిమా నీటిలో సాగితే... ఈసారి అంతరిక్షంలోకి వెళ్లాడు సంకల్ప్ రెడ్డి. రొటీన్ కరమ్షర్షియల్ సినిమాల మధ్య అంతరిక్షం అనే ఆలోచన, ఊహ కొత్తగా ఉంటాయి. అయితే ఇలాంటి ఆలోచన రావడం ఒక్కటే సరిపోదు. దాన్ని.. తెరపై తీసుకురావడంలోనూ నేర్పు చూపించాలి. ఈ రెండు విషయాల్లోనూ సంకల్ప్‌రెడ్డి విజయం సాధించాడనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఇలాంటి కథల్ని చెప్పడం చాలా పెద్ద సాహసం. తొలి సగంలో దేవ్‌కి సంబంధించిన కథ, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఓ మోస్తరుగా సాగుతుంది. ద్వితీయార్థంలో అంతరిక్షానికి సంబంధించిన ఎపిసోడ్స్ వస్తాయి.
హాలీవుడ్ చిత్రాలు ఇంటర్‌సెల్లార్, గ్రావిటీ చూసినవాళ్లకు అంతరిక్షం లో విషయం పెద్దగా లేదనిపించొచ్చు. గ్రావిటీకి సంబంధించిన సన్నివేశాలు తేలిపోయినట్టు అనిపించొచ్చు. కాకపోతే.. మనకున్న బడ్జెట్, పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఆ సన్నివేశాలు బాగానే తీసినట్టు భావించాలి.
ఈ సినిమాకి సంబంధించిన అతి పెద్ద చిక్కు.. ఇందులోని సాంకేతిక పదజాలం. అవేం.. సగటు ప్రేక్షకుడికి అర్థం కాకపోవొచ్చు. శాటిలైట్ వ్యవస్థ, దానికి సంబంధించిన పనితీరు, స్పేస్ షిప్.. వీటికి సంబంధించిన విషయాలు తెలియకపోతే సినిమా అంతా గందరగోళంగా ఉంటుంది. తెరపై ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వస్తుంది. సైన్స్ విద్యార్థులకు మాత్రం ఆ ఇబ్బంది లేకపోవొచ్చు. ఎమోషన్ పరంగా... ఈ కథతో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. దాంతో `ఘాజీ`లా జాతీయ భావం ఉప్పొంగే అవకాశం చాలా తక్కువ. కథనం నత్తనడకతో సాగడం మరింత ఇబ్బంది పెడుతుంది. కొత్త సినిమాలు కోరుకునేవాళ్లు అంతరిక్షం ఓపిగ్గా చూడొచ్చేమో గానీ, రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు మాత్రం.. ఇదేదో చాదస్తంగా, సైన్స్ పాఠంలా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం...
సంకల్ప్ రెడ్డి రాసుకున్న కథని తెరపైకి తీసుకురాడం అంత సులభం కాదు. కానీ.. టెక్నికల్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. గ్రావిటీకి సంబంధించిన సన్నివేశాలు తేలిపోయినా.. మిగిలిన చోట వాళ్ల కష్టం కనిపిస్తుంది. సంభాషణలు సింపుల్‌గా ఉన్నాయి. ఇలాంటి సినిమా కమర్షియల్‌గా ఆడుతుందా, లేదా? అని ఆలోచించకుండా.. కథని, కొత్తదనాన్ని నమ్మి కోట్లు పెట్టారు నిర్మాత. వారి అభిరుచి అభినందనీయం.
* ప్లస్ పాయింట్స్
- కథా నేపథ్యం
- ద్వితీయార్థం
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
- అర్థం కాని టెర్మినాలజీ
పైనల్ వర్డిక్ట్: అంతరిక్షం.. ఓ సైన్స్ పాఠం
రివ్యూ రాసింది శ్రీ.