నటీనటులు : సాయి పల్లవి, ఫహద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం : వివేక్
నిర్మాతలు : సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్
సంగీతం : పి ఎస్ జైహరి, గిబ్రాన్
సినిమాటోగ్రఫర్ : అను మూతెడత్
ఎడిటర్: అయూబ్ ఖాన్
రేటింగ్: 2.75/5
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్స్.. మలయాళ చిత్రసీమ. తక్కువ బడ్జెట్ లో భలేటి కథలు తీస్తారు వాళ్లు. ముఖ్యంగా థ్రిల్లర్స్ తీయడంలో వాళ్లకు తిరుగులేదు. ఈమథ్య కాలంలో మలయాళం నుంచి వచ్చిన థ్రిల్లర్లు మరే భాషలోనూ రాలేదు. అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలన్నీ అయితే... రీమేకులు అవుతున్నాయి... లేదంటే తెలుగులో డబ్బింగ్ రూపంలో వస్తున్నాయి. తెలిసిన మొహాలుంటే, డబ్బింగ్ చేయడానికే మొగ్గు చూపిస్తున్నాయి. సాయిపల్లవి, ఫాజిద్, ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులుంటే.. కచ్చితంగా తెలుగులోనూ మార్కెట్ చేసుకోవొచ్చు. అందుకే రెండేళ్ల క్రితం విడుదలైన మలయాళ చిత్రం ఇన్నాళ్లకు తెలుగులో `అనుకోని అతిథి`గా డబ్ అయి వచ్చింది. ఆహాలో ఈరోజు (మే 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరింతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఆ అతిథి కథేంటి?
* కథ
ఊరికి దూరంగా, మారుమూల ప్రాంతంలో దట్టమైన అడవి మధ్య ఓ మానసిక వైద్యశాల ఉంటుంది. అందులో ఉండేది ఐదారుగురు పేషెంట్లు మాత్రమే. బెంజ్‌మెన్ (అతుల్ కులకర్ణి) అనే మానసిక వైద్యుడు.. వాళ్ల ఆలనా పాలనా చూస్తుంటాడు. ఆ పిచ్చాసుపత్రిలో పేషెంట్లంతా మామూలుగానే ఉంటారు. కానీ వాళ్ల చూపులు, చేష్టలు తేడాగా ఉంటుంటాయి. ఆ పిచ్చాసుపత్రిలో అనేక మతలబులు జరుగుతున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి వస్తుంది. వాటి సంగతేంటో తేల్చడానికి ప్రభుత్వం నుంచి ఓ ప్రత్యేకమైన అధికారి నందా (ఫాజిల్) ఆ ఆసుపత్రికి వస్తాడు.
నందా అక్కడికి రావడం బెంజ్‌మెన్‌కి ఇష్టం ఉండదు. తనని ఎలాగైనా అక్కడి నుంచి పంపించేయాలనుకుంటాడు. ఆ ఆసుపత్రిలో నిత్య (సాయి పల్లవి) అనే పేషెంట్ ని బంధీగా ఉంచుతారు. నిత్య ఎవరు? ఆమె వెనుక ఉన్న కథేంటి? అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? నందా అక్కడికి వచ్చిన పని అయ్యిందా, లేదా? మధ్యలో తనకు ఎదురయ్యే ఆటంకాలేంటి? అనే విషయాలు తెరపైనే చూడాలి.
* విశ్లేషణ
చాలా తక్కువ పాత్రలు, అతి తక్కువ లొకేషన్లతో పూర్తయ్యే సినిమా ఇది. మహా అయితే... తెరపై రెండే రెండు లొకేషన్లు కనిపిస్తాయి. ఒకటి... ఆసుపత్రి, రెండోది ఫ్లాష్ బ్యాక్‌లో నిత్య ఇల్లు. వాటి చుట్టూనే కథ నడిపాడు. ఓ థ్రిల్లర్ కి కావల్సిన లక్షణాలన్నీ ఈ కథలో ఉన్నాయి. ఆసుపత్రిలో ఏం జరుగుతోంది.. అక్కడి మిస్టరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ప్రేక్షకులలో కలిగించాడు దర్శకుడు. కథ నడుస్తున్న కొద్దీ ఫజిల్స్ ఎక్కువ అవుతుంటాయి. ఏ పాత్రని అనుమానించాలో, ఏ పాత్రని నమ్మాలో అర్థం కాదు. ఓ దశలో ప్రతీ సన్నివేశం ఓ ఫజిల్ లా ఉంటుంది. ఇంట్రవెల్ కి ముందు.. ఫాజిల్ ని కుక్కలు వెండించే సీన్.. చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు దర్శకుడు. నిత్య ఫ్లాష్ బ్యాక్ అంత ఆసక్తిగా ఏం ఉండదు. ఫ్లాష్ బ్యాక్ లో ఏదో జరిగిపోతుందనుకుంటారంతా. అదంతా చప్పగా నడుస్తుంది.
మిస్టరీ వెనుక కథ కూడా అంత ఆసక్తిని రేకెత్తించదు. ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నాడా? అనేది మరీ.. పాత చింతకాయ పచ్చడి వ్యవహారం. అయితే చివరి పది నిమిషాల్లో కథ లోని అసలు ట్విస్టు బయటకు వస్తుంది. అది థ్రిల్లింగ్ కలిగిస్తుంది. అయితే... రెగ్యులర్ గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు... అది కూడా ముందే ఊహిస్తారు. తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా ముగింపు కొత్త కాబట్టి.. ఓకే అనుకోవొచ్చు. అయితే ప్రతీ సన్నివేశాన్ని డిటైల్ గా చూపించాలనుకోవడం, అనవరమైన లెంగ్తీ సీన్లు... ఇవన్నీ.. కాస్త విసుగు పుట్టిస్తాయి. క్లైమాక్స్ కి ముందు వరకూ కథ ఎటు తిరుగుతుంది? అసలు ఏమవుతుంది? అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్టు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం తప్ప మరో మార్గం ఉండదు. ఒకట్రెండు పాటలే ఉన్నా... అవి కూడా అనవసరం అనిపిస్తాయి.
* నటీనటులు
ట్రాన్స్ లాంటి డబ్బింగ్ సినిమాలతో ఫాజిద్ కూడా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడు అయిపోయాడు. పైగా `పుష్ష`లో తాను కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి.... ఇప్పుడు తాను తెలుగు నటుడే. తన నటన.. అత్యంత సహజంగా సాగింది. అలవాటైన దారిలో చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇక నిత్యకు మహా అయితే ఒకట్రెండు డైలాగులు ఉంటాయంతే. కానీ... తనదైన హావభావాలతో ఆకట్టుకుంది. మానసిక వికలాంగులు ఎలా ఉంటారో తెలుసుకుని, ఆ పాత్రకు జీవం పోసింది. అతుల్ కులకర్ణి తన అనుభవాన్నంతా రంగరించాడు. ప్రకాష్ రాజ్ చివర్నో వస్తాడంతే. తన పాత్ర వచ్చిన తరవాతే అసలు ట్విస్టు రివీల్ అవుతుంది.
* సాంకేతిక వర్గం
భారీ బడ్జెట్ అవసరం లేని సినిమా ఇది. సాంకేతికంగా మాత్రం బాగుంది. రెండే లొకేషన్లయినా.. బోర్ కొట్టించకుండా తీశారు. ఆర్ట్ పనితనం బాగుంది. నేపథ్య సంగీతం కూడా కొత్తగా వినిపిస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. అయితే అక్కడక్కడ విసుగెత్తిస్తుంది. చివర్నో ట్విస్టు లేకపోతే... ఈ సినిమా చూడడం బేకార్.
* ప్లస్ పాయింట్స్
నటీనటులు
క్లైమాక్స్ ట్విస్టు
* మైనస్ పాయింట్స్
కొంతమందికే నచ్చే జోనర్
లూజ్ ఎండ్స్
* ఫైనల్ వర్డిక్ట్: అనుకోని ట్విస్టు