నటీనటులు : సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్దా దాస్, భ్రమ్మాజి తదితరులు
కథ : మేర్లపాక గాంధీ
దర్శకత్వం : కార్తీక్ రాపోలు
నిర్మాతలు : యువి కాన్సెప్ట్స్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫర్ : గోకుల్ భారతి
ఎడిటర్ : సత్య జి
రేటింగ్: 2.75/5
కొన్ని పాయింట్లు వినడానికి బాగుంటాయి. కొత్తగా అనిపిస్తాయి. అయితే.. ప్రతీ పాయింటూ సినిమా కథగా మారలేదు. అలా మార్చాలంటే చాలా తెలివితేటలుండాలి. `ఏక్ మినీ కథ`లోనూ ఓ ఆసక్తికరమైన పాయింట్ ఉంది.కాకపోతే... అది చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇలాంటి కథల్ని డీల్ చేయడం.. మరింత కష్టం. మరి ఆ కష్టాన్ని `ఏక్ మినీ కథ` టీమ్ ఎలా దాటేసింది? అనేది ఆసక్తిరకం. అమేజాన్ ప్రైమ్‌లో ఈరోజు (గురువారం) విడుదలైన సినిమా ఇది. రివ్యూలోకి వెళ్తే..
* కథ
సంతోష్ (సంతోష్ శోభన్)కి చిన్నప్పుడే తన ప్రైవేట్ పార్ట్ పై అనుమానం వస్తుంది. అది చాలా చిన్నదిగా ఉందన్నది తన భయం. స్నేహితులు కూడా అదే విషయమై హేళన చేస్తారు. అప్పటి నుంచీ... తాను సెక్స్‌కి పనికి రానేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది. ఆ అనుమానమే పెరిగి పెరిగి పెద్దదవుతుంది. కాలేజీ రోజుల్లో ఓ గాళ్ ఫ్రెండ్... ఇంటికి పిలిచి.. ఛీ కొడుతుంది. దాంతో... తను ఏ అమ్మాయినీ సుఖ పెట్టలేనని ఫిక్సయిపోతాడు.
ఇలాంటి పరిస్థితుల్లో అమృత (కావ్య థాపర్)తో పెళ్లి ఫిక్సవుతుంది. తనకేమో అన్నీ పెద్ద పెద్దవే కావాలి. తన వ్యవహారం తెలిసి ఎలాగైనా సరే, ఈ పెళ్లి రద్దు చేసుకోవాలనుకుంటాడు సంతోష్. కానీ అదీ కుదరదు. భజరంగీ దళ్... బలవంతంతో... వీళ్ల పెళ్లి పార్క్‌లోనే జరిగిపోతుంది. ఆ తరవాత శోభనం. దాన్ని వాయిదా వేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలెడతాడు. మరి ఆ ప్రయత్నాలు ఎలా సాగాయి? తన `మినీ` కథ బయటకు రాకుండా ఉండడానికి సంతోష్ ఏం చేశాడు? ఈ నిజం ఇంట్లో వాళ్లకు ఎలా తెలిసింది? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
కథానాయకుడికి ఓ సమస్య ఉండడం... దానిచుట్టూ వినోదపు సన్నివేశాలు అల్లుకోవడం... ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడం, హిట్టు కొట్టడం.. ఇది వరకు కొన్ని సినిమాల్లో చూశాం. ఈ సినిమాలోనూ హీరోకి ఓ సమస్య ఉంది. అది ఎవరికీ చెప్పుకోలేనిది. ప్రైవేట్ పార్ట్ కి సంబంధించినది. నిజానికి ఇలాంటి కథల్ని రాసుకోవడం కాదు, దాన్ని ఒప్పించగలం... అని నమ్మి సినిమాగా తీయడం గొప్ప విషయం. ఆ విషయంలో చిత్రబృందాన్ని అభినందించి తీరాలి. బోల్డ్ కంటెంట్ అయినా.. బోర్ కొట్టించకుండా... నడపగలిగారు. తొలి సగంలో కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.
హర్షవర్థన్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో కథ మొదలవుతుంది. సుదర్శన్ ఎంట్రీతో కామెడీ డోస్ పెరుగుతూ పోతుంది. వ్యభిచార గృహానికి వెళ్లడం... అక్కడ పోలీసులకు దొరికిపోవడం, డాక్టర్ తో `సైజు`కి సంబంధించిన డిస్కర్షన్ ఇవన్నీ సరదాగా సాగిపోయాయి. ద్వితీయార్థంలో శోభనాన్ని పోస్ట్ పోన్ చేయడానికి హీరో పడే పాట్లు నవ్విస్తాయి.
అయితే... కొన్ని అనవసరమైన పాత్రలు, వాళ్ల చేష్టలూ విసుగుతెప్పిస్తాయి. ఉదాహరణకు.. ఓ తాతయ్య పాత్రని తీసుకొచ్చారు. తనకు పూజా హెగ్డే కాళ్లంటే ఇష్టమట. ఆ పాత్ర కు చెప్పించిన డైలాగులు
మరీ ఓవర్ గా ఉండి విసుగు తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో ఇలాంటి పొరపాట్లు చాలా జరిగాయి. శ్రద్దాదాస్ పాత్ర వచ్చినప్పుడు కాస్తలో ఇంకో యాంగిల్ ఏదో ఉందనుకుంటాం. అది తుస్సుమంటుంది. నిజానికి ఆ పాత్రకు శ్రద్దాదాస్ అవసరం లేదు. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్ర అది. క్లైమాక్స్ లో హీరో - హీరోయిన్లు కలిసిపోవడం కూడా రొటీన్ గా ఉంటుంది. మధ్యలో సప్తగిరి కాస్త హడావుడి చేయగలిగాడు. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. సప్తగిరి ట్రాక్ లేకపోతే... సెకండాఫ్ చూడడం కష్టమయ్యేది.
* నటీనటులు
సంతోష్ ఈ సినిమాతో చాలా మెరుగయ్యాడు. కాస్త ముదిరినట్టు కనిపించినా, పాత్రకు సెట్ అయ్యాడు. చాలా సందర్భాల్లో సహజంగా నటించాడు. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ని ఒప్పుకోవడం ఏ నటుడికైనా ఛాలెంజ్. ఆ విషయంలో సంతోష్ ని మెచ్చుకోవాలి. కావ్య అందంగా కనిపించింది. ఓ ఏరోటిక్ పాటలో ఎంగిలి ముద్దులతో రెచ్చిపోయింది. మిగిలిన నటీనటుల్లో... సుదర్శన్ కి మంచి మార్కులు పడతాయి. బ్రహ్మాజీ కూడా ఓకే అనిపిస్తాడు.
* సాంకేతిక వర్గం
కథ సింపుల్ గా ఉన్నా, ఇలాంటివి డీల్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. సంభాషణలు సరదాగా ఉన్నాయి. చిన్న సినిమా అయినా క్వాలిటీ తగ్గలేదు. సంగీతం, ప్రొడక్షన్ డిజైనర్ పనితనం.. నచ్చుతాయి. సెకండాఫ్‌లో ఫ్లో దెబ్బతింది. లేదంటే.. మరింత బాగుండేది. కుటుంబ ప్రేక్షకులు కలసి చూడ్డానికి ఇబ్బంది పడే సన్నివేశాలు, డైలాగులు కొన్ని ఉన్నాయి. ఎలాగూ ఓటీటీలోకి వచ్చింది కాబట్టి... ఎవరికి వారు, ఒంటరిగా చూస్తూ.. మధ్యమధ్యలో ఫన్నీ బిట్లకు నవ్వుకోవొచ్చు.
* ప్లస్ పాయింట్స్
కథని డీల్ చేసిన విధానం
ఫస్ట్ ఆఫ్
కామెడీ
* మైనస్ పాయింట్స్
బోల్డ్ ఎటెమ్ట్
ఫ్యామిలీతో చూడలేం
సెకండాఫ్‌లో విసుగు
* ఫైనల్ వర్డిక్ట్: పక్కా ఓటీటీ సినిమా