నటీనటులు : కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్ తదితరులు
దర్శకత్వం : రవీంద్ర పుల్లే
నిర్మాతలు: కిరణ్ రామోజు, రాధా కృష్ణ తెలు
సంగీతం: నవ్ ఫల్ రాజా
సినిమాటోగ్రఫర్ : ఆష్కర్, వెంకట్ శాఖమూరి, ఈ జె వేణు
ఎడిటర్: ప్రతాప్ కుమార్
రేటింగ్: 2.5/5
జంతువు నుంచి మనిషి పుట్టాడు. కానీ... ఇప్పటికీ ఆ లక్షణాల్ని మనిషి వదల్లేదు. బలవంతుడిదే రాజ్యం అనేది జంత నీతి. అది.. ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా కులాల కోసం కొట్టుకోవడం, మతాల చిచ్చు రగిల్చుకోవడం - మనిషిలోకి క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశం బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛ అయితే పొందింది గానీ, ఇంకా మనిషి కులాల కంచెల్లోనే విలవిలలాడుతున్నాడు. ఆ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. అది చెప్పే కథ `అర్థ శతాబ్దం`. 2003 సిరిసిల్ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఓటీటీ వేదిక `ఆహా` ద్వారా నేరుగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఏ విషయాన్ని బలంగా చెప్పాలనిచూశారు..? అది ఎంత వరకూ చేరుతుంది? తెలుసుకుంటే...
* కథ
సిరిసిల్ల గ్రామం ఎప్పుడూ కులాల, మతాల గొడవలతో అట్టుడుకుతూనే ఉంటుంది. ఆ ఊరి సర్పంచ్‌కీ, సర్పంచ్ కావాలనుకునే వ్యక్తికీ మధ్య నిత్యం కొట్లాటే. ఆ ఊరిలో కరెంటు బల్బులు వెలిగిస్తూ.. బతుకుతుంటాడు కృష్ణ (కార్తీక్ రత్నం). తనకు పుష్ష (కృష్ణ ప్రియ) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ మూగగా ఆరాధిస్తూనే ఉంటాడు. కానీ పుష్ష తనని పట్టించుకోదు. అసలు తన వెంట ఒకడు తిరుగుతున్నాడన్న విషయాన్నే గుర్తించదు.
పుష్ష రోజూ వెళ్లే దారిలో.. ఓ షాపు ఉంటుంది. ఆ షాపు ఆవరణలో.. గులాబీ మొక్కకి పువ్వు పూస్తే.. తలలో పెట్టుకోవాలన్నది పుష్ష కోరిక. అయితే ఆ మొక్కకి పూలు రావు. ఆ మొక్కకి పూలు పూయించి, ఆ పువ్వు.. తన చేతులతో పుష్షకి ఇచ్చి, మనసులోని మాట చెప్పాలని కృష్ణ ఆరాటపడతాడు. ఆ మొక్కకి అన్ని రకాల సేవలూ చేస్తాడు. ఆ మొక్కకి మొగ్గ తొడిగి, పువ్వు పూసే సమయానికి ఎవరో కోసుకుని వెళ్లిపోతారు. అక్కడి నుంచి గొడవ మొదలవుతుంది. చివరికి ఊరంతా వల్లకాడు అవుతుంది. ఒక పువ్వు వల్ల ఇన్ని అనర్థాలు ఎలా జరిగాయో తెలుసుకోవాలంటే.. `అర్థ శతాబ్దం` చూడాలి.
* విశ్లేషణ
ఓ పువ్వు ముసుగులో .. ఊరు ఊరంతా కత్తులు దూసుకోవడం, చివరికి ఆ జంట కథ విషాదంతం అవ్వడం.. గుండెల్ని మెలి పెట్టే పాయింటే. ఇలాక్కూడా జరుగుతుందా? అని ఆలోచింపజేసే అంశమే. పైగా ఈ కథలో చాలా విషయాలున్నాయి. ముఖ్యంగా కులాల కోసం కుమ్ములాడుకుంటున్న నేటి సమాజ ప్రతిబింబాన్ని తెరపై చూపిస్తాడు దర్శకుడు. దానికో ప్రేమకథ జోడించాడు. ఇదంతా.. బాగానే ఉంది. కానీ... తెరపై చూపించిన విధానంలోనే తేడా వుంది.
దర్శకుడు చెప్పాలనుకున్నది సమాజంలో జరుగుతున్న విషయమే. అయితే దాన్ని పూర్తిగా డ్రమెటిక్ గా మార్చేశాడు. ప్రేమకథ నుంచి మొదలైన సినిమా.. కులాల పేరిట మారణ హోమం సృష్టించుకునేంత వరకూ సాగింది. ఈమధ్యలో చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు. కానీ అవేమీ ప్రభావవంతంగా లేవు. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలు మరీ ఎక్కువ అయిపోవడంతో దేనికీ పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయాడు. నక్సలిజం, రాజ్యాంగం అంటూ చాలా బలమైన అంశాలు మేళవించాడు ఈ కథలో. అయితే వాటిని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా, అర్థం చేసుకునేలా... చెప్పలేకపోయాడు. ఉదాహరణకు సాయికుమార్ పాత్రనే తీసుకుందాం. తనని ఓ మాజీ నక్సలైట్ గా చూపించారు. కానీ నక్సలిజం అనే అంశాన్ని పైపైన, రేఖామాత్రంగా చూపించారు.
ఇలాంటి పాయింట్లు చాలా ఉన్నాయి. మనిషిలోని మృగతృష్ట ఎలా మొదలైంది? జాతులు ఎలా ఏర్పడ్డాయి? కులాలు, మతాలు ఎలా వచ్చాయి? ఇలాంటివి శుభలేఖ సుధాకర్ పాత్ర ద్వారా చెప్పించారు. అవి కూడా అరిగిపోయిన సీన్లు లానే కనిపిస్తాయి. మరో కీలకమైన విషయం.. ఈ సినిమాలో హింస, రక్తపాతం, బూతులు... ఇవి మూడూ హద్దులు దాటేశాయి. అవన్నీ కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాని దూరం చేస్తాయి. అభ్యుదయ భావాలున్న సినిమాల్ని ఓ వర్గం ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది. అయితే.. ఈ సినిమా వాళ్లకూ నచ్చకపోవొచ్చు. ఈ సినిమాలో వర్గ పోరాటం ఎంత కీలకమో, ప్రేమ కథ కూడా అంతే ప్రధానం. అయితే ఆ ప్రేమలో ఫీల్ లేదు. వన్ సైడ్ లవ్ స్టోరీ అవ్వడం వల్ల, ఆ ప్రేమతో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. అందుకే పతాక సన్నివేశాల్లో అంత తీవ్రత ఉన్నా, తేలిపోయినట్టు అనిపిస్తాయి.
* నటీనటులు
`కేరాఫ్ కంచర్లపాలెం`తో ఆకట్టుకున్న నటుడు కార్తీక్ రత్నం. ఇందులోనూ అంతే సహజంగా నటించాడు. మూగ ప్రేమికుడుగా తన హావభావాలు ఆకట్టుకుంటాయి. కృష్ణ ప్రియ... చూడ్డానికి బాగుంది. తన నటన కూడా నచ్చుతుంది. పల్లెటూరి అమ్మాయిగా కట్టూ బొట్టూ బాగున్నాయి. సాయి కుమార్ , నవీన్ చంద్ర పాత్రల్ని పవర్‌ఫుల్ గా పరిచయం చేసినా, ఆ పాత్రలు రాను రాను తేలిపోయాయి. శుభలేఖ సుధాకర్, అజయ్ ... ఒక రూములో కూర్చుని సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికే సరిపోయారు.
* సాంకేతిక వర్గం
ఈ సినిమాలో వినిపించే పాటలు బాగున్నాయి. హృద్యంగా సాగాయి. సిరిసిల్ల గ్రామాన్ని కూడా ఓ పాత్రగా మలిచారు. ఈ సినిమా అంతా ఆ ఊరు చుట్టూనే తిరుగుతుంది. కొన్ని మాటలు బాగున్నాయి. పతాక సన్నివేశాల్లో వినిపించిన వాయిస్ ఓవర్ లో డెప్త్ ఉంది. అయితే... కథలోనూ అంతే డెప్త్ ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ బాగుండేది. దర్శకుడి లక్ష్యం మంచిదే అయినా... అది సరైన దారిలో సాగలేదు.
* ప్లస్ పాయింట్స్
నటీనటులు
పాటలు
* మైనస్ పాయింట్స్
హింస
బూతులు
* ఫైనల్ వర్డిక్ట్: అర్థం కాని ఆవేశం