బాహుబలి వచ్చాక.. దర్శక నిర్మాతల ఆలోచనలన్నీ మారిపోయాయి. ఏదైనా సరే, అంతర్జాతీయ స్థాయిలో తీయాలి... అంతలా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయి దాటి హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అలాంటి కథలే వస్తున్నాయి కూడా. తాజాగా విక్రమ్ కె.కుమార్ కూడా ఓ బాహుబలి రేంజ్ కథని తయారు చేస్తున్నారు. కానీ ఇది యానిమేషన్ ప్రాజెక్టు.
13 బి, మనం, 24.... ఇలా ప్రతీ సినిమాతోనూ తన దైన ముద్ర వేశాడు విక్రమ్ కె.కుమార్. హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలు నిరాశ పరిచాయి. ప్రస్తుతం నాగచైతన్యతో `థ్యాంక్యూ` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఓ భారీ యానిమేషన్ సినిమా తీస్తానని ప్రకటించాడు విక్రమ్. ఇది దాదాపు నాలుగేళ్ల ప్రాజెక్ట్ అని, స్క్రిప్టు పనులు సగం పూర్తయ్యాయని, ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తారని చెప్పుకొచ్చాడు విక్రమ్ కె.కుమార్. అల్లు అర్జున్ తో విక్రమ్ ఓ సినిమా చేయాల్సివుంది. ఇదివరకెప్పుడో ప్రకటన వచ్చినా, ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టుపై కూడా విక్రమ్ స్పందించాడు. ``బన్నీతో సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. కథ సిద్ధం అవుతోంది. త్వరలోనే మా కాంబోలో సినిమా ఉంటుంది`` అని క్లారిటీ ఇచ్చాడు.