నటీనటులు: రక్షిత్ శెట్టి,శాన్వీ శ్రీవాస్తవ,అచ్యుత్ కుమార్,బాలాజీ మనోహర్,ప్రమోద్ శెట్టి తదితరులు
దర్శకత్వం: సచిన్ రవి
నిర్మాతలు: పుష్కర మల్లిఖార్జున
సంగీతం: చరణ్ రాజ్
సినిమాటోగ్రఫర్ : కర్న్ చావ్లా
ఎడిటర్: సచిన్ రవి
విడుదల తేదీ: 1 జనవరి, 2020
రేటింగ్: 3/5
మొన్నటిదాకా కన్నడ సినిమా అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పరిశ్రమ అనే అభిప్రాయాలు వినిపించేవి. `కె.జి.ఎఫ్` తర్వాత ఆ పరిశ్రమ ముఖ చిత్రమే మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలు అక్కడ విరివిగా రూపొందుతున్నాయి. ఆ పరంపరలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే `అతడే శ్రీమన్నారాయణ`. మరి ఈ చిత్రం ఎలా ఉంది?
*కథ
అభీరుల వంశానికి చెందిన ఇద్దరు సోదరుల మధ్య రహస్య నిధి విషయంలో యేళ్లుగా వైరం నడుస్తుంటుంది. నిధి ఎక్కడుందనే విషయంలో రహస్యం వాళ్ల మధ్యే ఉంటుంది. కానీ అది వాళ్లకి తెలియదు. పదిహేనేళ్ల తర్వాత నారాయణ (రక్షిత్ శెట్టి) అనే ఓ ఇన్‌స్పెక్టర్ అన్నదమ్ముల మధ్యకి వస్తాడు. మరి అతను ఆ నిధిని ఎలా కనుక్కున్నాడు? ఇంతకీ ఎవరీ నారాయణ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
*విశ్లేషణ
ఇదొక కల్పిత గాథ. అమరావతి నగరం అనే ఒక కాల్పనిక నగరం నేపథ్యంలో సాగుతుంది. కథ కంటే కూడా, అది సాగే నేపథ్యాన్నే కొత్తగా చూపించి... ప్రేక్షకుడికి ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. దాంతో కథ సాగే కాలం, ప‌్రదేశం లాజిక్‌కి దూరంగా అనిపించినా... ప్రేక్షకుడికి పెద్దగా సందేహాలేమీ రావు. తొందరగానే కథలో లీనమవుతారు. ఆరంభం కాస్త గందరగోళంగా అనిపించినా.. కథ ముందుకు సాగుతున్నకొద్దీ ఆ పాత్రలతోనూ, ఆ నేపథ్యంతోనూ ప్రేక్షకుడు ప్రేమలో పడతాడు. నిధి కోసం సాగే వేట, దాని వెనక రహస్యాల్నిశోధించే క్రమం ఒక పజిల్‌ని తలపిస్తుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత.
హీరోపాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అపాయకరమైన ఇద్దరు ముఠా నాయకుల మధ్యకి చమత్కారంతో కూడిన హీరో పాత్రని ప్రవేశపెట్టారు. ఆ పాత్రలో కేవలం చమత్కారమే కాదు, సాహసాలు కూడా ఉంటాయి.దాంతో సన్నివేశాలన్నీసందడిగా మారిపోతాయి. హాస్యం, ఇంటెలిజెన్స్, హీరోయిజం... ఇలా అన్నీ పండతాయి. ఆ విషయంలో హీరో పాత్రపై పాశ్చాత్య సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి జోనర్ దక్షిణాది ప్రేక్షకులకు కొత్త. పాన్ ఇండియా సినిమాకి కావల్సిన లక్షణాలన్నీ ఇందులో కనిపిస్తాయి. మేకింగ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకి తగ్గట్టుగా ఉంటుంది. కాకపోతే నిడివే సినిమాకి సమస్యగా మారింది. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా నిండా ముఠాలు, వాళ్ల అనుచరులు, దానికితోడు అదనంగా ఒక కౌ బాయ్ సెట్టప్ ఉంటుంది. దాంతో తెరపై కనిపిస్తున్నది ఎవరో, ఏ గ్రూప్‌కి చెందినవాళ్లో అర్థం కాదు. అలా కొన్ని సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. కానీ ఇదొక కొత్త రకమైన జోనర్. ప్రేక్షకులకు ఓ కొత్త సినిమా చూసిన అనుభూతి మాత్రం మిగులుతుంది.
*నటీనటులు
రక్షిత్ శెట్టి పాత్ర, అందులో ఆయన నటనే ఈ సినిమాకి కీలకం. నారాయణ అనే పోలీస్ అధికారిగా ఆయన ఒదిగిపోయాడు. ఆద్యంతం హుషారుగా కనిపించాడు. మంచి హాస్యం పండించాడు. తన ఆలోచనల్లోంచి వచ్చిన పాత్రే కావడంతో, ఆ పాత్రలో ఎలా ఉండాలో బాగా అర్థం చేసుకుని అలా నటించాడు. శాన్వి తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర పరిధి తక్కువే కానీ, ఉన్నంతలో బాగా చేసింది. నాటక రంగానికి చెందిన పలువురు కళాకారులు ఇందులో కనిపిస్తారు. వాళ్లంతా సహజంగా నటించారు.
*సాంకేతికత
సాంకేతిక విభాగం సినిమాకి ప్రాణం పోసింది. ఈ సెట్టప్పే చీకటి నేపథ్యంలో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఛాయాగ్రహణం కుదిరింది. నేపథ్య సంగీతం కూడా సినిమాకి ప్రాణం పోసింది. సచిన్‌కి ఇదే తొలి చిత్రమైనా చాలా బాగా తీర్చిదిద్దాడు. ఆయనే ఈ చిత్రానికి ఎడిటర్. తీసిన సినిమాపై ప్రేమో, మరో కారణమో తెలియదుకానీ... కత్తెరకి పెద్దగా పనిచెప్పలేదు. నిర్మాణ విలువలు పాన్ ఇండియా సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గలేదు.
*ప్లస్ పాయింట్స్
నటన
కథ
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
*మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం లో కొన్ని సన్నివేశాలు
డబ్బింగ్
*ఫైనల్ వర్డిక్ట్: దక్షిణాదికి ఒక కొత్త జోనర్‌ని పరిచయం చేసిన చిత్రం... `అతడే శ్రీమన్నారాయణ`