నటీనటులు: సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్, జోయల్ డేవిడ్ మోర్, దిలీప్ రావు తదితరులు
దర్శకుడు : జేమ్స్ కామెరూన్
నిర్మాతలు: జేమ్స్ కామెరూన్
సంగీత దర్శకులు: జేమ్స్ హార్నర్
సినిమాటోగ్రఫీ: మారో ఫియోర్
ఎడిటర్స్: స్టెఫాన్ రివ్కిన్, జాన్ రెఫూవా, జేమ్స్ కామెరాన్
రేటింగ్: 3.25/5
ప్రపంచ చలన చిత్ర చరిత్రలో `అవతార్` ది ఓ సువర్ణ అధ్యాయం. సినిమా స్టామినా ఏమిటో చెప్పిన ఘనత అవతార్‌ది. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమాకి కనీ వినీ ఎరుగని వసూళ్లు వచ్చాయి. `అవతార్` గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకొంది. అవార్డులకైతే లెక్కేలేదు. ఈ సినిమాతో జేమ్స్ కెమెరూన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా మారిపోయాడు. ఇప్పుడు అవతార్ 2 వచ్చింది. ఓ సీక్వెల్ కోసం పన్నెండేళ్లు ఎదురు చూడడం కోసం `అవతార్`తోనే. అవతార్ పెట్టుబడి, అది సాధించిన వసూళ్లతో పోలిస్తే.. `అవతార్ 2` బడ్జెట్ రెండు మూడు రెట్ల అధికం. దాదాపు 15 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. 160 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన `అవతార్ - ది వే ఆఫ్ వాటర్` ఎలా ఉంది..? అవతార్‌లా ఈ సినిమా కూడా అద్భుతాలు సృష్టించగలదా?
* కథ
పండోరా అనే ఓ గ్రహానికి సంబంధించిన కథ ఇది. అక్కడ `నావీ` అనే జాతి జీవిస్తుంటుంది. భూగోళంపై మానవాళికి కావల్సిన వనరులు దొరక్కపోవడంతో.. మరో గ్రహాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితుల్లో మనుషుల దృష్టి పండోరాపై పడుతుంది. అక్కడికి జేక్ ని పంపిస్తారు. జేక్ పండోరాలోని ప్రకృతికి దాసోహమైపోతాడు. అంతే కాదు.. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొని, తమపై దాడి చేయడానికి వస్తున్న మానవ జాతిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో జేక్, నావీ జాతి ఎలా గెలిచిందన్నది.. `అవతార్ 1` కథ.
ఇప్పుడు అవతర్ 2 విషయానికొద్దాం. పండోరాపై కక్ష సాధించి, జాక్‌నీ, అతని కుటుంబాన్నీ నాశనం చేయడానికి మరోసారి... దాడి మొదలవుతుంది. దాంతో.. జాక్ తన కుటుంబంతో సహా.. సముద్రం పక్కన ఉన్న ఓదీవికి వలసపోతాడు. అక్కడకి కూడా మానవాళి దాడికి దిగబడితే.. జేక్ ఈసారి ఎలా యుద్ధం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొన్నాడు? అనేది `అవతార్ 2` కథ.
* విశ్లేషణ
అవతార్ ఓ అద్భుతం. ఇందులో మరో మాటకు తావులేదు. అంతకు ముందెప్పుడూ అలాంటి విజువల్స్ చూసి ఉండకపోవడం వల్ల.... అవతార్ గొప్పగా అనిపించింది. అవతార్ తీయడానికి జేమ్స్ కెమెరూన్ దగ్గర రిఫరెన్సులు కూడా ఏం లేవు. కానీ అవతార్ 2 అలా కాదు. అవతార్ నే దానికి రిఫరెన్సు. అవతారే దానికి పోటీ. అవతార్ లో ఓ కొత్త విజువల్ వండర్ చూసేసిన ప్రేక్షకుడికి `అవతార్ 2`లో విజువల్స్ ఏం వింతగా అనిపించవు. అవతార్‌లోని అందమైన, ఊహకి అతీతమైన అడవి ఉంటే.. ఇక్కడ సముద్రం ఉంటుంది. అంతే. అయితే ఆ సముద్రాన్ని, అందులోని అందాల్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. ఈ సముద్రం విజువల్స్ కూడా ఇది వరకెప్పుడూ చూడనివే.
సముద్రం లోపల ఓ అద్భుతమైన సృష్టి చేశాడు జేమ్స్. వాటిని చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోవాల్సిందే. సముద్రంలోని జీవరాసి, ఆ మెక్కలు, రంగుల పువ్వులూ.. అబ్బుర పరుస్తాయి. విజువల్‌గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో.. హ్యూమన్ ఎమోషన్ విషయంలోనూ అంతే బలమైన సన్నివేశాలు రాసుకొన్నాడు దర్శకుడు. ఓ తండ్రి తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడు అనేది సోషల్ పాయింట్. దాన్ని సైన్స్ ఫిక్షన్‌కి ముడి పెట్టాడు. తమ భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే.. ఎవరైనా సరే, తిరుగుబాటు చేస్తారు. ఇది కూడా సోషల్ పాయింటే. దాన్ని... అందమైన చందమామ కథలా మలిచాడు దర్శకుడు.
తొలి 30 నిమిషాల్లో సీన్లు `అవతార్ 1`ని, అందులోని లొకేషన్లనీ గుర్తు చేస్తాయి. అవతార్ 1 చూడని వాళ్లకు కూడా ఆ లోకాన్ని పరిచయం చేయాలని జేమ్స్ కెమరూన్ భావించి ఉంటాడు. అందుకే పార్ట్ 2 ( ద వే ఆఫ్ వాటర్)లోకి వెళ్లడానికి సమయం తీసుకొన్నాడు. ఎప్పుడైతే సముద్ర మార్గంలోకి కథ తీసుకెళ్లాడో.. అక్కడి నుంచి.. విజువల్ వండర్ మొదలైపోతుంది. చూస్తోంది గ్రాఫిక్స్ అనే సంగతి మర్చిపోయి.. ఓ కొత్త లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరీ ముఖ్యంగా చివరి.. 30 నిమిషాలైతే.... అవతార్ స్థాయిని మరింత పెంచుతాయి. నీటిలో సాగే ఆ యుద్ధం.. కళ్లారా చూడాల్సిందే. మాట్లాడుకోవడానికి ఏం లేదు. కేవలం ఆ సన్నివేశం కోసమే ఏళ్ల తరబడి శ్రమించి ఉంటారు. సముద్ర గర్భంలో ఉండే తిమింగలం లాంటి జీవి.. ఈ యుద్ధంలో పాల్గొనడం, శత్రు మూకని చల్లా చెదురు చేయడం.. క్లైమాక్స్ మొత్తానికే గూజ్ బమ్స్ తెప్పించే మూమెంట్.
* నటీనటులు
అవతార్ లో చూసిన పాత్రలే.. పార్ట్ 2లోనూ కనిపిస్తాయి. ఇంకొన్ని కొత్త పాత్రలు కథా ప్రకారం ఎంట్రీ ఇచ్చాయి. ఎవరెవరు ఎలా చేశారు? అనేదేం గుర్తుండదు. కేవలం విజువల్స్ కళ్లముందు కదులుతాయంతే.
జేక్స్ కి పిల్లలుగా నటించిన వాళ్లంతా బాగా చేశారు. ఓరకంగా కథానాయకుడి కంటే.. పిల్లల క్యారెక్టర్లు, ఆ పాత్రల నిడివే ఎక్కువ సేపు ఉంటాయి. సముద్ర జీవుల్ని కూడా పాత్రధారులుగా మలిచాడు కామరూన్.
*సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉంది. విజువల్స్‌కీ, వాటి డిటైలింగ్ కీ సాహో అనాల్సిందే. ఈ సినిమాని త్రీడీలో చూస్తే ఇంకా ఇంపాక్ట్ గా ఉంటుంది. కొన్ని విజువల్స్, వాటిని డిజైన్ చేసిన పద్ధతి.. మాటల్లో వర్ణించలేం. వెండి తెరపై చూడాల్సిందే.
సౌండ్ డిజైనింగ్, కెమెరా వర్క్. ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీని కనిపెట్టారంటే.. సాంకేతికంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు. కాకపోతే.. 192 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇది. అందుకే విజువల్ గా ఎంత బాగున్నా.. అక్కడక్కడ బోర్ కొడుతుంటుంది.
* ప్లస్ పాయింట్స్
విజువల్స్
ఎమోషన్
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
నిడివి
* ఫైనల్ వర్డిక్ట్ : విజువల్ వండర్