జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి దాదాపుగా రెండేళ్ల నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలానా సినిమాలో తననే హీరోయిన్ గా తీసుకొన్నారని, ఈసారి జాన్వీ తెలుగు సినిమా చేయడం ఖాయమని రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. జాన్వీ మాత్రం తెలుగు తెరపై కనిపించలేదు. జాన్వీ పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తోందని, అసలు తనకు తెలుగులో సినిమాలు చేయడమే ఇష్టం లేదని, తన దృష్టంతా బాలీవుడ్ పైనే అని కూడా చెప్పుకొన్నారు. అయితే ఎట్టకేలకు జాన్వీ ఎంట్రీ ఖాయమైంది. ఎన్టీఆర్ సినిమాతో తను తెలుగులో అరంగేట్రం చేయబోతోంది.
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. ఇటీవల ముంబైలో.. జాన్వీ, కొరటాల మధ్య చర్చలు జరిగినట్టు, జాన్వీ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నట్టు సమాచారం అందుతోంది. ఈ నెలాఖరున ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, జాన్వీ కూడా అతి త్వరలోనే సెట్లో అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది. ఈసారైనా జాన్వీ ఎంట్రీ ఖాయం అవుతుందా? లేదంటే జాన్వీ పై పుట్టిన రకరకాల వార్తల్లో ఇదొకటా..? అంటూ సినీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అయితే ఈసారి జాన్వీ ఎంట్రీ ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే జాన్వీ ఎంపిక గురించి అధికారిక ప్రకటన కూడా రావొచ్చని టాక్.