చిత్రం: భగవంత్ కేసరి
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఛాయాగ్రహణం: సి రామ్ ప్రసాద్
కూర్పు: తమ్మి రాజు
బ్యానర్స్: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 19 అక్టోబర్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3/5
హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్స్ నందమూరి బాలకృష్ణ. ఆయన ఏం చేసినా అభిమానులు చూస్తారు. ఎవ్వరూ ఎక్కడా లాజిక్కులు అడగరు. ఆయన్ని దర్శకులు కూడా అలానే చూపించడానికి ఇష్టపడతారు. అయితే ఏ నటుడికైనా తన ఇమేజ్ ఛట్రం నుంచి అప్పుడప్పుడూ బయటకు రావాలని అనిపిస్తుంటుంది. బహుశా.. బాలయ్యకూ అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. తనలోని మార్పుకి `భగవంత్ కేసరి`తో శ్రీకారం చుట్టారు. అనిల్ రావిపూడి పై కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దర్శకుడిగా ముద్ర ఉంది. అందులోంచి బయటకు వచ్చి, కొత్తగా తనని తాను చూపించుకోవడానికి తనకీ ఓ అవకాశం కావాలి. అలా.. బాలయ్యకు, అనిల్ రావిపూడికీ ఇద్దరికీ దొరికిన ఛాన్స్ `భగవంత్ కేసరి`. మరి తమ ఇమేజ్ కి భిన్నంగా ట్రాకులు మార్చిన ఈ ఇద్దకరికీ `భగవంత్ కేసరి` ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ఈ సినిమాలో అభిమానులకు నచ్చే అంశాలేంటి? ఈ దసరా పండక్కి ఈ సినిమా కచ్చితమైన వినోదాన్ని అందించిందా?
కథ: నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) హత్యానేరం మీద జైల్లో ఉంటాడు. అతని కథ తెలుసుకొన్న జైలర్ (శరత్ కుమార్) కేసరిని విడిపిస్తాడు. దాంతో జైలర్‌కి, ఆయన కుమార్తె విజ్జు (శ్రీలీల)కూ దగ్గరవుతాడు భగవంత్ కేసరి. జైలర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే... విజ్జూ బాధ్యతని తాను తీసుకొంటాడు. విజ్జూని ఆర్మీకి పంపాలన్నది జైలర్ కల. ఆ కలని తాను నిజం చేయాలనుకొంటాడు. విజ్జీకి మాత్రం ప్రేమించి, పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలైపోవాలని అనుకొంటుంది. అందుకే.. భగవంత్ ని దూరం పెట్టాలనుకొంటుంది. అనుకోకుండా విజ్జి జీవితం ప్రమాదంలో పడుతుంది. రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) అనే వ్యాపార వేత్త గ్యాంగ్ విజ్జిని చంపాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్లకీ విజ్జీకి ఉన్న సమస్యేంటి? విజ్జీని కేసరి ఎలా కాపాడాడు? అసలు భగవంత్ కేసరి ఎవరు? నేలకొండలో ఏం చేస్తుండేవాడు? తనకీ.. రాహుల్ సంఘ్వీకీ ఉన్న లింకేంటి? ఇదంతా మిగిలిన కథ.
విశ్లేషణ: బాలయ్య రూటు మార్చి, తనలో ఉన్న కొత్త యాంగిల్ ని చూపించుకోవడానికి అనిల్ రావిపూడికి దొరికిన అవకాశం ఈ సినిమా. దాన్ని అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తగానే వాడుకొన్నాడు. బాలయ్యని కొత్తగా చూపిస్తూనే అడుగడుగునా కమర్షియల్ ప్యాకేజీతో, ఎలివేషన్లతో ఊపు తీసుకొచ్చాడు. బేటీకో షేర్ బనావో అనే కాన్సెప్ట్ కూడా ఈ కథకు బలాన్ని తీసుకొచ్చింది. జైల్ ఫైట్.. బాలయ్య ఫ్యాన్స్‌కి కావల్సిన మాస్ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. పోలీస్ స్టేషన్‌లో ఎస్.ఐకి టీ వేడి చేసి ఇవ్వడం మరో మంచి ఫన్ మూమెంట్. అక్కడి నుంచి ప్రతీ పది నిమిషాలకూ ఓ కమర్షియల్ ప్యాకేజీ పేర్చుకొంటూ వెళ్లాడు. కాజల్ తో ట్రాక్ దగ్గర.. కథ కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. అయితే...రవిశంకర్ దగ్గర భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ చెప్పే సీన్‌లో మంచి ఎలివేషన్ వచ్చింది. అక్కడి నుంచి ఇంట్రవెల్ వరకూ కథ, ఎలివేషన్లూ ఆగలేదు. ఇంట్రవెల్ సీన్‌లో హీరోకీ, విలన్‌కీ ముడి పెట్టిన స్క్రీన్ ప్లే టెక్నిక్ కూడా బాగా పండింది.
సెకండాఫ్‌లో నేలకొండలో భగవంత్ కేసరి ఏం చేసేవాడు? అనేది చూపించారు. అక్కడ విలన్ తో సంఘర్షణ మొదలవుతుంది. అయితే.. ఈ సీన్లు చాలా సాదా సీదాగా ఉన్నాయి. మధ్యలో అనిల్ రావిపూడి మార్క్ డైలాగులు, కామెడీ టైమింగ్ కుదిరాయి కాబట్టి సరిపోయింది. లేదంటే.. సెకండాఫ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోదును. కళ్లల్లో కళ్లు పెట్టి చూడూ.. అనే పాటని ఓ ఫైట్ కోసం వాడుకోవడం మంచి ఆలోచన. దాంతో రొటీన్ ఫైట్, ఎలివేషన్ల దగ్గర కూడా కొత్తగా ఏదో ట్రై చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆడపిల్లల్ని పులిలా పెంచాలి అనే కాన్సెప్ట్ ని సైతం దర్శకుడు బాగా వాడుకొన్నాడు. ఆ పాయింట్ వల్లే.. ఈ సినిమా రెగ్యులర్ పేట్రన్‌లోకి వెళ్లకుండా సేఫ్ అయ్యింది. క్లైమాక్స్ ఎప్పటిలా రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తుంది. అక్కడ ట్రిమ్ చేయాల్సిన సీన్లు కొన్ని కనిపిస్తాయి. చివర్లో శ్రీలీలతో కలిసి బాలయ్య ఫైట్ చేయడం బాగుంది. అక్కడ కాస్త హుషారొస్తుంది. మొత్తానికి దర్శకుడు తాను అనుకొన్న టార్గెట్ ని రీచ్ అయ్యాడనిపిస్తుంది.
నటీనటులు: బాలయ్య వన్ మాన్ షోకి ఈ సినిమా మరో నిదర్శనం. తన గెటప్, డైలాగ్ డెలివరీ అన్నీ పర్‌ఫెక్ట్ గా కుదిరాయి. ఎక్కడా అతికి పోలేదు. ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య తన అనుభవాన్నంతా చూపించాడు. శ్రీలీల పాత్ర కూడా కొత్తగా ఉంది. ఇప్పటి వరకూ మంచి డాన్సర్ గానే చూసిన శ్రీలీలలోని నటిని ఈసినిమా బయటకు తీసుకొచ్చింది. కాజల్ కి ఇది కమ్ బ్యాక్ ఫిల్మ్ అని చెప్పలేం కానీ, ఉన్నంతలో తాను కూడా బాగానే కనిపించింది. ఆమె ట్రాక్ ని కథలోకి తీసుకురావడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. అర్జున్ రాంపాల్ మరో స్టైలీష్ విలన్ గా అవతారం ఎత్తాడు. ఈ కథలో చాలా పాత్రలున్నాయి కానీ.. కొన్నింటికే స్క్రీన్ స్పేస్ దక్కింది.
సాంకేతిక వర్గం: తమన్ మరోసారి తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. తన థీమ్ మ్యూజిక్ బాగా వర్కవుట్ అయ్యింది.అనిల్ రావిపూడి రొటీన్ ఫక్తు కమర్షియల్ కథే ఎంచుకొన్నా.. తనదైన కొత్త కోణాన్ని చూపేందుకు ప్రయత్నించాడు. డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిజం ఎలివేట్ చేసేటప్పుడు తన పెన్ మరింత స్పీడుగా పరిగెట్టింది. క్వాలిటీ మేకింగ్ కనిపించింది. అక్కడక్కడ కొన్ని డల్ మూమెంట్స్, సాగదీత ఉన్నా.. భగవంత్ ఎక్కడా నిరాశ పరచడు. బాలయ్య అభిమానులకే కాకుండా, నాన్ ఎన్ బీ కే ఫ్యాన్స్ కి కూడా నచ్చేలా ఈ సినిమా డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి.
ప్లస్ పాయింట్స్
బాలయ్య
శ్రీలీల
డైలాగులు
బేటీ కో షేర్ బనావో కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్
కాజల్ ఎపిసోడ్
పాటలకు స్కోప్ లేకపోవడం
రొటీన్ కథ
ఫైనల్ వర్డిక్ట్: ఈ దసరా బాలయ్యదే...!