నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని తదితరులు
కథ: సాచి
దర్శకత్వం : సాగర్ కె చంద్ర
మాటలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంగీత దర్శకుడు: తమన్.ఎస్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్
ఎడిటర్ : నవీన్ నూలి
రేటింగ్: 3.25/5
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓ ప్రభంజనం. హిట్లు ఫాపులతో సంబంధం లేని హీరో పవన్ కళ్యాణ్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. 'భీమ్లా నాయక్' సినిమాపై కూడా అవే అంచనాలు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రిమేకు భీమ్లా నాయక్. అమోజాన్ ప్రైమ్ లో వున్న ఆ సినిమాని చాలా మంది చుసేశారు.
అయితే 'భీమ్లా నాయక్' పై ఎక్కడా అంచనాలు తగ్గలేదు. వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ పవన్ ని తెరపై చూడటానికి తహతహలాడిపోయారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ అంచనాలని భీమ్లా నాయక్ అందుకున్నాడా? ఒరిజినల్ తో పోలిస్తే భీమ్లా ఎంత కొత్తగా వున్నాడు ? త్రివిక్రమ్ చేసిన స్క్రీన్ ప్లేయ్ మ్యాజిక్కు ఏమిటి ? ఇవన్నీ తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ:
ఆంధ్రా తెలంగాణ బోర్డర్ లో కథ మొదలౌతుంది. భీమ్లా నాయక్(పవన్‌కల్యాణ్) నిజాయితీ గల సబ్ ఇన్‌స్పెక్టర్. ఆర్మీలో పనిచేసి రిటైరైన డానియల్ శేఖర్(రానా) రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక రోజు రాత్రి కారులో మద్యం సీసాలతో అడవి గుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు దొరుకుతాడు. పోలీసుల దగ్గర తన ఈగో చూపిస్తాడు డానీ.
డ్యూటీలో ఉన్న భీమ్లానాయక్.. డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. దీంతో డానీ ఈగో దెబ్బతింటుంది. పోలీస్ స్టేషన్ వెళ్ళిన డానీ.. తనకు తల నొప్పిగా వుందని, మందు లేకపోతే తగ్గదని చెప్తాడు. డానీ మాటలని సీరియస్ గా తీసుకున్న భీమ్లా నాయక్, డానీకి మందు పోస్తాడు. భీమ్లా నాయక్ మందు పోస్తుండగా వీడియో తీసిన డానీ ఆ వీడియోని బయటికి లీక్ చేస్తాడు. దీంతో భీమ్లా నాయక్ సస్పెండ్ అవుతాడు. అక్కడ నుంచి మొదలౌతుంది. అసలు సిసలైన యుద్ధం. మరి ఏమిటా యుద్ధం ? ఆత్మ గౌరవానికి అహంకారని మధ్య ఎవరు గెలిచారు? భీమ్లా నాయక్ గతం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా కథ చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్ లో భీమ్లా నాయక్ మందుపోసే సీన్ గురించి అంత వివరంగా ఎందుకు చెప్పారనే సందేహం రావచ్చు. ఆ సీన్ లోనే ఈ కథ మొదలౌతుంది. ఇద్దరి మధ్య వార్ కి ఆ సీనే కారణం. ఇది రెండు పాత్రల మధ్య జరిగే యుద్ధం. ఆ రెండు పాత్రల స్వభావాలు ఆ సీన్ లో ఎస్టాబ్లెస్ అవుతాయి. అంతకుముందు ఆ ఇద్దరికి పరిచయం కూడా వుండదు.
మొదటి పరిచయంలో ఒకరిని ఒకరు చంపుకోవాలనే కసి కనిపిస్తుంది. అదే కసి కథ మొత్తం కంటిన్యూ అవుతుంది. నువ్వా-నేనా అని సాగిన వార్ ప్రేక్షకులని అలరిస్తుంది. ఒరిజినల్ కథతో పోల్చుకుంటే మూలకథని మార్చకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని తగ్గట్టు కొన్ని మార్పులు జరిగాయి. స్క్రీన్ ప్లేయ్ అందించిన త్రివిక్రమ్, పవన్ ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా రాసుకున్నన కొన్ని ఎలివేషన్లు పండాయి.
ప్రారంభం నెమ్మదిగా ముందుకు సాగిన కథ.. ఎప్పుడైతే భీమ్లా సస్పెండ్ అవుతాడో అప్పటి నుంచి మాస్ ఎలివేషన్లతో ఊపందుకుంటుంది. ఇక అక్కడి నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ సీన్స్ ఒకొక్కటిగా వస్తుంటాయి. అయితే ఈ కథ మొత్తం ఒకే ఎమోషన్ చుట్టూ తిరగడం, భీమ్లా, డానీల మధ్య ఒకటే ఎమోషన్ క్యారీ కావడం 'అదే చూస్తున్నామా ?' అనే బావన కలుగుతుంది.
అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథలో చేసిన కొన్ని మార్పులు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కావాల్సినంత మాస్ తో పాటు దాన్ని తెలివిగా క్లైమాక్స్ కి ముడిపెట్టడం త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేయ్ మ్యాజిక్ కి అద్దం పట్టింది. దర్శకుడు శేఖర్ చంద్ర పవన్ కళ్యాణ్ తో డీసెంట్ మాస్ మ్యాజిక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. చివర్లో ఇచ్చిన కమర్షియల్ ఎండింగ్ కూడా ఆకట్టుకుంది.
నటీనటులు :
పవన్ కళ్యాణ్ బేసిగ్గానే మాస్. ఆయన ఏం చేసినా మాసే. భీమ్లా నాయక్ లో ఆ మాస్ డబుల్ అయ్యింది. భీమ్లా నాయక్ పాత్రకు పవన్ తప్పితే మరో హీరో సూట్ కాడనే స్థాయిలో కనిపించాడు. పవన్ కళ్యాణ్ యాక్షన్ , డైలాగ్స్ మరో స్థాయిలో వున్నాయి. తెరపై భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ ని చూసిన ఫ్యాన్స్ కి పండగే. పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధిగా కనిపించడం అంత తేలిక కాదు.
అయితే డానియల్ శేఖర్ గా రానా ధీటుగా కనిపించాడు. డానీ పాత్ర పండితేనే భీమ్లా నాయక్ పాత్ర పండుతుంది. డానీ పాత్రని పండించడంలో రానా అద్భుతంగా తన పాత్ర పోషించాడు.
నీత్య మీనన్ కు మంచి పాత్ర పడింది. భీమ్లా భార్యగా ఆకట్టుకుంది. డానియల్ భార్యగా సంయుక్త మేనన్ ఓకే. ఆ పాత్రని చివరిలో వాడుకున్న విధానం బావుంది. సముద్రఖని పాత్ర ఓకే. మిగతా పాత్రలు పరిధిమేర చేశారు.
టెక్నికల్ గా:
తమన్ మళ్ళీ అదరగొట్టాడు ‘లాలా.. భీమ్లా’ థియేటర్‌లో విజిల్స్ వేయిస్తుంది. నేపధ్య సంగీతం హైలెట్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను పవన్ ఫ్యాన్స్ ని మెప్పించేలా తీర్చిదిద్దడంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. ఆయన మార్క్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. పవన్ ని మాస్ గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సాగర్ చంద్ర విజయం సాధించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్, రానా
స్క్రీన్ ప్లేయ్
మాస్ సీన్స్, మాటలు, పాటలు
మైనస్ పాయింట్స్
మొదటి సగంలో కొంచెం నెమ్మదించడం
ఫైనల్ వర్దిక్ట్ : బ్లాక్ బస్టర్ నాయక్