చిత్రం: బ్రో
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్
దర్శకత్వం: సముద్రఖని
నిర్మాత: టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల
సంగీతం: థమన్ ఎస్
ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్
కూర్పు: నవీన్ నూలి
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 28 జులై 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్ .. ఇద్దరూ కలసి సినిమా చేస్తున్నారంటే మెగా ఫ్యాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తినెలకొంది. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ‘వినోదయసిత్తం’ తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు అదే సినిమాను ఈ ఇద్దరూ కలసి బ్రో గా చేశారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాయడం మరో ఆకర్షణగా నిలిచింది. మరి ఇలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ లో వచ్చిన బ్రో ఎలాంటి వినోదాల్ని పంచింది ? అసలు బ్రో కథ ఏమిటి ?
కథ: మార్కండేయ అలియాస్ మార్క్ (సాయిధరమ్ తేజ్) ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి మరణం తర్వాత అన్ని బాధ్యతల్నీ తన భుజాన మోస్తుంటాడు. తల్లిని చక్కగా చూసుకోవాలని, ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు స్థిరపడాలని, జాబ్ లో తను మరింత ఎదగాలని కాలంతో పరుగు పెడుతూ శ్రమిస్తుంటాడు. ఐతే ఓ రోజు అనుకోని పరిస్థితిలో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. తనన్ని తీసుకెళ్లడానికి వచ్చిన కాలం (పవన్ కళ్యాణ్)తో... తనవాళ్లెవరూ జీవితంలో స్థిరపడలేదని, తాను చేయాల్సిన ఎన్నో పనులు మిగిలిపోయాయని, తనకి అప్పుడే చనిపోవాలని లేని దయచేసిన కొంత కాలం ఇవ్వాలని ప్రాధేయపడతాడు. దాంతో కనికరించిన కాలం 90 రోజులు అతని జీవితకాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్నవన్నీ చేశాడా? ఆ 90 రోజుల సమయంలో ఎలాంటి జీవిత సత్యాలని తెలుసుకున్నాడనేది మిగతా కథ.
విశ్లేషణ: కాలం ఎవరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ఒకసారి పోయిన ప్రాణం మళ్ళీ తిరిగిరాదు. అయితే ఆ కాలం ఒకరికి తిరిగి బతుకునిస్తే, ఆ మనిషి ఏం తెలుసుకుంటాడు ? ఎలాంటి పాఠాలు నేర్చుకొంటాడా? అనేది 'వినోదయ సిత్తమ్' పాయింట్. బ్రో రిమేక్ లో కూడా ఇదే పాయింట్ వుంది. ఐతే చేసిన మార్పు ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ పాత్రని ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా చాలా ఎంటర్ టైనింగ్ గా మలిచి బ్రోని తీశారు. సినిమా ఆరంభంలోనే కథలోకి వెళ్ళిపోతాడు దర్శకుడు. మార్క్ పరిచయం, అతని జీవిత ఆశయాలు ఇవన్నీ కథ లోకి తీసుకెళ్లిపోతాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత కథ మరింత జోరు అందుకుంటుంది. చావుని వాయిదా వేసి, మళ్లీ ప్రయాణం సాగించిన మార్క్ పాత్ర ఈ కథకు చాలా కీలకం. టైమ్, మార్క్ మధ్య సన్నివేశాలు సహజంగా, సరదాగా వచ్చాయి. తొలిసగం సరదాగానే సాగిపోతుంది.
ఐతే తొలిసగంలో కాన్సెప్ట్ రివిల్ అయిపోతుంది. తర్వాత కథని నడిపించే డ్రామా సెకండ్ హాఫ్ లో కొరవడింది. చూసిన సీన్లని మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ రూపంలో ఒక బలమైన స్టార్ వున్నప్పటికీ ఆయన పాత్రకి కొన్ని పరిమితులు వున్నాయి. నిజానికి ఒరిజినల్ సినిమా బావుందనిపించడానికి కారణం.. దానిపై పెద్ద అంచనాలు లేవు. కాన్సప్ట్ తో క్లిక్ అయిన సినిమా అది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ వున్నారు. ఆయన ఇమేజ్ ని మ్యాచ్ చేసేలా హై మూమెంట్స్ బ్రోలో కరువయ్యాయి. అలాగే ఈ కథ ముగింపు కూడా ముందే తెలిసిపోవడంతో కథ ఎటు వెళుతుందో ముందే అర్ధమైపోవంతో తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా రక్తికట్టించవు. ఐతే చివర్లో మార్క్ కుటుంబం నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు మాత్రం కదిలించేలా వుంటాయి.
నటీనటులు: పవన్ కళ్యాణ్ పాత్ర ఈ సినిమాకి అసలు బలంగా నిలిచింది. త్రివిక్రమ్ ఈ పాత్రలో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి చాలా పరిమితులున్న పాత్రలో డిజైన్ చేయడం అంత తేలిక కాదు. ఇందులో ఆయన యాక్షన్ లేదు. ఒక పాత్రని ఫాలో అవుతూ కేవలం మాటలకే పరిమితమయ్యే పాత్ర. కానీ పవన్ కళ్యాణ్ గ్రేస్ స్టయిల్ మేనరిం వింటేజ్ సాంగ్స్ .. ఇవన్నీ ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా అనిపిస్తాయి. సాయి ధరమ్ తేజ్ నటనలో ఈజ్ కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా అభినయించాడు. కేతిక శర్మ పాత్రకు అంత ప్రధాన్యత లేదు. రోహిణి , ఇద్దరు చెల్లెలకు కీలక పాత్రలు దక్కాయి. తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్ పాత్రలన్నీ పరిధిమేర కనిపించారు.
టెక్నికల్: తమన్ పాటలు కంటే నేపధ్య సంగీతం బావుంది. బ్రో టైటిల్ ట్రాక్ ఆకట్టుకునేలా వుంటుంది.. కెమరాపనితనం బావుంటుంది. సీజీ వర్క్ మరింత బెటర్ గా చేయాల్సింది. నిడివి తక్కువే. వీలైనంత త్వరగా ముగించే ప్రయత్నం చేశారు. తివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఆయన మార్క్ లో సాగుతాయి. స్క్రీన్ ప్లే లో చేసిన మార్పులు పవన్ పాత్రకు బాగా వర్క్ అవుట్ అయ్యాయి కానీ లవ్ ట్రాక్ మాత్రం తేడా కొట్టింది. దర్శకుడు సముద్రఖని పై పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేసే అదనపు భారం కూడా పడింది. ఆయనకు సాధ్యమైనంత చేశారు.
ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్, సాయి తేజ్
కాన్సెప్ట్
నేపధ్య సంగీతం, డైలాగ్స్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
పాటలు
ఫైనల్ వర్దిక్ట్ : ఫ్యాన్స్ కి ఓకే 'బ్రో'...