బబుల్‌గమ్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: బబుల్‌గమ్

నటీనటులు: రోషన్ కనకాల,మానస చౌదరి
దర్శకత్వం: రవికాంత్ పేరేపు


నిర్మాతలు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్‌
 
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
కూర్పు: నిషాద్ యూసుఫ్


బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్‌
విడుదల తేదీ: 29 డిసెంబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5

 

సినీ నేప‌థ్యం వున్న మరో కుర్రాడు హీరోగా వచ్చాడు. త‌నే… రోష‌న్ క‌న‌కాల‌. సుమ‌, రాజీవ్‌ల వార‌సుడు. త‌న తొలి చిత్రం ‘బ‌బుల్ గ‌మ్‌’.  క్షణం, కృష్ణ అండ్ లీల చిత్రాలతో ఆకట్టుకున్న రవికాంత్ పేరేపు దర్శకుడు కావడం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం బాగస్వామ్యం కావడం,  ట్రైలర్ టీజర్ ఆసక్తికరంగా వుండటంతో ఈ చిత్రం అందరిద్రుష్టిని ఆకర్షించింది. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? హీరోగా రోషన్ ఆకట్టుకున్నాడా?

 

కథ:

ఆది (రోషన్ కనకాల) డీజె అవ్వాలని కలలు కంటాడు. ఓ క్లబ్ లో డిజే వద్ద సాహయకుడిగా పని చేస్తుంటాడు. ఒక రోజు ఆది డిజే ప్లే చేస్తుండగా జాన్వి( మానస చౌదరి) అక్కడికి వస్తుంది. జాన్విని తొలి చూపులోనే  ప్రేమించేస్తాడు. జాన్వి కూడా ఆదిని ఇష్టపడుతుంది.  అయితే జాన్వికి రిలేషన్షిప్ పై పెద్ద నమ్మకం వుండదు. ఆది తన మనసులో ప్రేమని జాన్వితో చెబుతాడు. తర్వాత ఏం జరిగింది ? అంతస్తుల పరంగా భిన్నద్రువాలైన ఈ ఇరివురి ప్రేమ ప్రయాణంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? తన ఆత్మ గౌరవం కోసం ఆది ఏం చేశాడు? అనేది మిగతా కథ.

 

విశ్లేషణ:

అమ్మాయి అబ్బాయి కలవడం, ఇష్టపడటం.. ఏవో కారణాల వలన విడిపోవడం.. మళ్ళీ కలవడం... ప్రేమకథలన్నీ దాదాపు ఇలానే  వుంటాయి. అయితే ఆ కథని చెప్పే విధానంలోనే కొత్తదనం వుండాలి. బబుల్‌గమ్ కూడా ప్రేమకథే. ఇందులో దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ కొత్తదే. సాదారణంగా ప్రేమలో ఓడిపోతే, అవమాన పడితే.. అమ్మాయి మోసం చేయడం వలనే ఇలా జరిగిందని బాధపడటం కామన్ గా కనిపిస్తుంటుంది. బబుల్‌గమ్ లో కొత్తదనం ఏమిటంటే..ప్రేమలో ఓడిపోయిన అబ్బాయి.. తన ఆత్మ గౌరవం కోసం జీవితంతో పోరాడుతాడు. ఈ పాయింట్ పేపర్ మీద బావుంది కానీ తెరపైకి వచ్చిన తీరు మాత్రం అసహజంగా, నీరసంగా వుంది.


రాణి పేద టైపులో ఈ ప్రేమకథని మొదలుపెట్టాడు దర్శకుడు. ఓ పెద్దింటి అమ్మాయి జాన్వి వెంటపడతాడు అది. అయితే ఈ రెండు పాత్రలు కాస్త అయోమయంగా వుంటాయి. ఆది పాత్ర కొంతలో కొంత నయం కానీ జాన్వి పాత్ర అయితే క్లూ లెస్ గా వుంటుంది. జీవితం మీద క్లారిటీ లేని మనిషిగా, అబ్బాయిలని వాడుకొని వదిలేసిన అమ్మాయిగా, రిలేషన్షిప్స్ అంటే గిట్టని అమ్మాయిగా.. ఇలా అనేక కోణాల్లో ఆ పాత్రని నడిపాడు దర్శకుడు. కొన్ని సీన్స్ అయితే ఏవో అనుమానాలు రేకెత్తించేస్తాయి. మరోవైపు డిజే కావాలనే తన కలని పక్కన పెట్టి జాన్వి వెంట తిరుగుతుంతాడు ఆది. ఎలాంటి మలుపులు, హై మూమెంట్స్ లేకుండా ఒకటో గేర్ లోనే ఆ ప్రయాణాన్ని ఇంటర్వెల్ వరకూ తీసుకోచ్చేస్తారు.


ఇంటర్వెల్ లో నడిపిన డ్రామా అయితే కాస్త ఫోర్స్ద్ గా అనిపిస్తుంది. ఈ సీన్ లో దారుణంగా ప్రవర్తిస్తుంది జాన్వి. ఐతే కథలో ఆమె పాత్రలో అది సహజంగా ఇమడలేదు. ఎదో ఎమోషన్ రావాలని అది ఫోర్స్ గా చేసినట్లుగా వుంటుంది. విరామం తర్వాత బబుల్‌గమ్ మరీ చప్పబడిపోతుంది. ఒక్క పాటతో ఆది పాపులర్ అయిపోవడం, జాన్వి బొమ్మరిల్లు తరహాలో ఆది ఇంటికి వచ్చేయడం.. ఆది మనసు కావాల్సిననట్లు నడుచుకోవడం .. ఇవన్నీ కాలం చెల్లిన ట్రీట్మెంట్ లా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు తెగిన గాలిపటంలా ఎటుపడితే అటు తిరుగుతుంటాయి. ఇవి చాలవన్నట్టు జాన్వి తల్లితండ్రుల వివాహంతో ఇంకాస్త లేజీ డ్రామా నడిపారు. ఒక కథ ఎత్తుకున్న తర్వాత ఎక్కడో చోట ఆసక్తి మొదలవ్వాలి. ఇందులో మాత్రం ఏ దశలోనూ ప్రేక్షకుడికి ఆసక్తిని కల్పించలేకపోయారు.


అమ్మాయి అబ్బాయి చివర్లో కలవడమే ప్రేమకథకు పరిపూర్ణత. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ‘ఇజ్జత్’ కాబట్టి ఆ అవసరం లేదని ఫీలయ్యారు. అయితే దీనికి ఇచ్చుకున్న ముగింపు మాత్రం ప్రేక్షకులకు తృప్తిని ఇవ్వదు. తనకి జరిగిన అవమానం నుంచి కొత్త మనిషిగా మారిన ఆది.. తన కంటే జీవితంలో ప్రేమ గొప్పది కాదనే ధోరణికి వస్తాడు. మాటల్లో చెప్పుకోవడానికి తప్పితే .. ఆ మార్పు చేతల్లో కనిపించలేదు. తన క్యారెక్టర్ ఆర్క్ లో ఆ పరివర్తన లేదు. దీంతో దర్శకుడు ఇచ్చుకున్న ముగింపు అసంపూర్ణంగా మిగిలిపోతుంది.

 

నటీనటులు:

ఆది పాత్రలో రోషన్ సహజంగా కనిపించడానికి ప్రయత్నించాడు. తనకి ఇది తొలి సినిమా. అయితే కెమరా ఫియర్ లేకుండా చలాకీగానే నటించాడు. తనలో ఎమోషన్స్ బాగానే పలుకుతున్నాయి. అయితే చాలా చోట్ల మెరుగావ్వాలి. ముఖ్యంగా కామెడీ, ఫన్ టైమింగ్ ని మెరుగుపరుచుకోవాలి. బహుసా స్క్రిప్ట్ లో లోపం ఏమో కానీ.. 20 ఏళ్ల వయసు తగ్గ ప్రవర్తన తన పాత్రలో చాలా చోట్ల కనిపించలేదు. బ్రేకప్ ని తీసుకునే విధానంలో తలపండిన మనిషిలానే కనిపిస్తాడు. అక్కడ ఆది పాత్ర కాకుండా డైరెక్టర్ చెబుతున్న పాయింటే కనిపిస్తుంది. హీరోయిన్ మానసా అందంగా వుంది. నటనకి వచ్చేసరికి కొన్ని లోపాలు వున్నాయి. చాలా చోట్ల క్లూ లెస్ గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ ఇంకా మెరుగవ్వాలి. తన కాస్ట్యూమ్స్ మాత్రం బావున్నాయి. ఆది తండ్రి పాత్రలో చేసిన ఈశ్వర్ మెప్పిస్తాడు. తన డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. సహజంగానే నటించాడు. హర్ష వర్ధన్ ని రొటీన్ పాత్రే. వైవా హర్ష పాత్రని అయోమయంగా తీర్చిదిద్దారు. ఆ పాత్రని వాడుకున్న తీరు ఆకట్టుకోదు. మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు.

 

టెక్నికల్ గా :

సినిమా టెక్నికల్ గా బావుంది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం కొత్తగా ప్రయత్నించాడు. కొన్ని చోట్ల అది బాగా కుదిరింది. ఇంకొన్ని చోట్ల ‘ఎందుకింత చప్పుడు’అనేలా వుంది. సురేష్ రగుతు చాయాగ్రహణం డీసెంట్ గా వుంది. గుర్తుపెట్టుకునే డైలాగులు లేవు. కథకు తగ్గ నిర్మాణ విలువలు కనిపించాయి. దర్శకుడు పేపర్ పై వున్న ఆలోచనకు సరైన తెర రూపం ఇవ్వలేదనే చెప్పాలి.

 

ప్లస్ పాయింట్స్ 

యూత్ ఫుల్ ఎలిమెంట్స్ 
రోషన్ కనకాల, నిర్మాణ విలువలు

 

మైనస్ పాయింట్స్ 

కథ, కథనం 
గాడి తప్పిన సెకండ్ హాఫ్ 
ఆకట్టుకోని ఎమోషన్స్   

 

ఫైనల్ వర్డిక్ట్ : చప్పగా సాగిన బబుల్‌గమ్...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS