నటీనటులు: ఆది, మిస్తీ చక్రబోర్తి , నైరా షా, తదితరులు.
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
నిర్మాణ సంస్థలు: హెచ్ కె.శ్రీకాంత్ దీపాల
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫర్: రామ్ ప్రసాద్
విడుదల తేదీ: 5 జులై, 2019
రేటింగ్: 1.5/5
రచయితలు దర్శకులుగా మారితే చాలా సౌలభ్యాలుంటాయి. కొత్త కొత్త కాన్సెప్టులు బయటకు వస్తుంటాయి. మాటలూ తూటాల్లా పేలే ఛాన్సుంటుంది. కాకపోతే చాలామంది రచయితలు దర్శకులు కాలేకపోయారు. అయినా... రాణించలేకపోయారు.
రాయడం వేరు, తీయడం వేరు అని కొంతమంది తీసిన సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు `బుర్ర కథ`తో దర్శకుడిగా అవతారం ఎత్తారు డైమండ్‌రత్నబాబు. మరి మెగాఫోన్ పట్టిన `డైమండ్` మెరిశాడా? లేదంటే... చాలామంది రచయితల్లానే దర్శకత్వ బాధ్యతను మోయలేక చతికిల పడ్డాడా?
* కథ
ఈశ్వరరావు (రాజేంద్రప్రసాద్)కి లేకలేక పుట్టిన కొడుకు అభి రామ్ (ఆది). అభిరామ్ ఒక్కడే.. కానీ రెండు రకాలుగా ఆలోచిస్తాడు. ఇద్దరు మనుషుల్లా ప్రవర్తిస్తాడు. డాక్టర్లకు చూపిస్తే `ఒకే వ్యక్తిలో రెండు మెదళ్లున్నాయి` అని తేల్చేస్తారు.
అభిలా ఒకసారి రామ్‌లా ఒకసారి మారిపోతుంటాడు. అభి పక్కా మాస్ అయితే రామ్ క్లాస్. ఇద్దరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు చేసిన పని మరొకరికి గుర్తుండదు. మరి వీరిద్దరూ ఒకరిలా ఎప్పటి నుంచి ఆలోచించారు? ఈ ప్రయాణంలో అభిరామ్‌కి ఎదురైన అనుభవాలేంటి? అనేదే కథ.
* నటీనటులు
అదికి రెండు రకాల పాత్రలలో కనిపించే అవకాశం వచ్చింది. గెటప్, లుక్ అన్నీ ఒకలా ఉంటాయి. డైలాగ్ మాడ్యులేషన్ కాస్త మార్చాడంతే. తనకు పట్టున్న డాన్సులు, ఫైట్లలో మాత్రం రాణించాడు. మిస్తీ చక్రవర్తి పాత్ర శుద్ధ వేస్ట్.
వన్ అవర్ మదర్ థెరిస్సా అంటూ ఈ పాత్రకు కాస్త కొత్త తరహా కోటింగ్ ఇవ్వాలనుకున్నారు కానీ, అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఫృథ్వీ, పోసానీ రొటీన్ వేషాలతో విసిగించారు. రాజేంద్ర ప్రసాద్ కూడా అంతే. మిగిలినవాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.
* సాంకేతిక వర్గం
పాటలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. నేపథ్య సంగీతంలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ. దర్శకుడిగా మారిన రచయిత.. డైమండ్ రత్నబాబుకి రైటర్‌గానూ చెప్పుకోదగిన విజయాలేం లేవు. ముందు రచయితగా రాణించి, ఆ తరవాత మెగాఫోన్ పట్టుంటే బాగుండేది.
షార్ట్ ఫిల్మ్‌కి సరిపడ లైన్ పట్టుకుని సినిమా తీయలేం. ఈ విషయం నవతరం దర్శకులు గుర్తించుకోవాలి. హాస్య సన్నివేశాలకు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా ఇది. దురదృష్టం ఏమిటంటే ఆ హాస్యమే పండలేదు.
* విశ్లేషణ
వినడానికే విచిత్రంగా ఉన్న కథ ఇది. ఒకడు ఇద్దరిలా ఆలోచించడం, ఒకడికే రెండు ఇష్టాలుండడం, ఒకడు ఇద్దరిలిలా మారిపోవడం ఇవన్నీకన్‌ఫ్యూజ్ విషయాలే. తొలి సన్నివేశంలోనే ఈ రెండు బుర్రల కాన్సెప్టునీ ప్రేక్షకులకు కాస్త అర్థమయ్యేలా చెప్పగలిగాడు దర్శకుడు. అయినప్పటికీ కన్‌ఫ్యూజన్ తీరకపోతే - ఈ సినిమా ఎంతకీ అర్థం కాదు. ఒకడు ఇద్దరిలా ఆలోచించడంలో తప్పేముంది? అనుకుంటే ఈ సినిమాని ఈజీగానే ఫాలో అయిపోవొచ్చు.
అదెలా సాథ్యం అనుకుంటే మాత్రం మొదటి సీన్‌లోనే బుర్ర కథ బాల్చీ తన్నేస్తుంది. కాన్సెప్ట్ వరకూ ఓకే. అయితే రెండున్నర గంటల సినిమాకి అదొక్కటీ సరిపోదు. ఆ కాన్సెప్టుని సన్నివేశాలుగా మలచగలగాలి. ఆ విషయంలో దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు డైమండ్ రత్నబాబు. కామెడీ కోసం కొన్ని పాత్రల్ని, చాలా సన్నివేశాల్ని సృష్టించుకున్నప్పటికీ ఆ కామెడీ మాత్రం పండలేదు.పైగా విసుగుపుట్టిస్తాయి. లవ్ ట్రాక్ పూర్తిగా తప్పిపోయింది. విలనిజం కథకు దూరంగా ఎక్కడో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. విలన్ ట్రాక్‌కీ హీరో ట్రాక్‌కీ ఏమాత్రం సంబంధం లేకుండా కథ నడుస్తుంటుంది.
కేవలం ఆదితో ఫైట్లు చేయించడానికే ఈ ట్రాక్ పెట్టారంతే. ప్రధమార్థంలో ఏదోలా భరించొచేయొచ్చు. సెకండాఫ్ మరీ దారుణంగా మారింది. దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో, ఈ కథని ఎలా నడిపించాలనుకున్నాడో ఏం అర్థం అవ్వదు. ఈఎంఐ కాన్సెప్టు కూడా... కేవలం సన్నివేశాల్ని నింపడానికే. కథలో బలం లేనప్పుడు, సినిమాని సాగదీయాలనులకున్నప్పుడు అనవసరమైన సన్నివేశాలు ఎక్కువవుతాయి. `బుర్ర కథ`లో అవి చాలానే కనిపిస్తాయి. ద్వితీయార్థం మొదలైన కాసేపటికే... క్లైమాక్స్ అర్థమైపోతుంది. పతాక సన్నివేశాల వరకూ ఓపిక పట్టడం చాలా కష్టం.
* ప్లస్ పాయింట్స్
+లైన్
* మైనస్ పాయింట్స్
-ఫన్
* ఫైనల్ వర్డిక్ట్: బుర్ర తిరిగే గిర గిర.
- రివ్యూ రాసింది శ్రీ.