చిత్రం: భోళా శంకర్
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్
దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: డడ్లీ
కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్
బ్యానర్స్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 11 ఆగష్టు 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2/5
శక్తి తరవాత మెహర్ రమేష్ మళ్లీ మెగాఫోన్ పట్టడానికి పదేళ్లు పడింది. అయితే ఈసారి తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డెరెక్ట్ చేసే అవకాశం రావడం, తమిళంలో సూపర్ హిట్టయిన `వేదాళం` కథ చేతిలో ఉండడంతో ఈసారైనా మెహర్ హిట్ కొడతాడేమో అనే ఆశ చిగురించింది. పైగా మాస్, మసాలా, యాక్షన్ చిత్రాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా `వాల్తేరు వీరయ్య`తో చిరు ఫామ్ లోకి వచ్చాడు. మరి... ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల మధ్య వచ్చిన `భోళా శంకర్` ఎలా ఉంది? మెహర్ హిట్టు కొట్టాడా, తనపై చిరు పెట్టుకొన్న నమ్మకాలు, అంచనాలు నిజమయ్యాయా?
కథ: శంకర్ (చిరంజీవి) తన చెల్లాయి మహాలక్ష్మి (కీర్తి సురేష్)ని తీసుకొని హైదరాబాద్ నుంచి కొలకొత్తాకు వస్తాడు. ఇక్కడ మహాని ఓ కాలేజీలో చేర్పిస్తాడు. తను టాక్సీ డ్రైవర్ గా మారతాడు. కొలకొత్తాలో ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ ముఠాని పట్టుకోవడానికి పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ సాధ్యం కాదు. కానీ శంకర్ ఇచ్చిన ఒక్క క్లూ వల్ల... ఆ ముఠాలోని కొంతమంది పోలీసులకు దొరికిపోతారు. దాంతో ముఠా నాయకుడు అలెగ్జాండర్ శంకర్‌పై కక్ష కడతాడు. శంకర్‌ని ఎలాగైనా పట్టుకోవాలని రంగంలోకి దిగుతాడు. తన కోసం అన్వేషిస్తాడు. అయితే శంకర్ కొలకొత్తా వచ్చింది అలెగ్జాండర్ ని పట్టుకోవడానికే అనే విషయం రివీల్ అవుతుంది. ఇంతకీ శంకర్ ఎవరు? తను కొలకొత్తాకి వచ్చిన కారణమేంటి? అనే విషయాలు తెలియాలంటే భోళా శంకర్ చూడాల్సిందే.
విశ్లేషణ: తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళం రీమేక్ ఇది. భోళా శంకర్ చూస్తే.. వేదాళం సినిమాలో రీమేక్ చేయడానికి ఏమున్నాయబ్బా? అనే డౌటు వేస్తుంది. ఎందుకంటే ఇందులో కొత్త పాయింట్ అనేదే లేదు. ఇప్పటి వరకూ మనం చూసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని సీన్లే.. ఇందులోనూ కనిపిస్తాయి. బహుశా.. మూల కథలో మెహర్ చేసిన మార్పులు, చేర్పుల వల్ల ఆ ఎఫెక్ట్ రావొచ్చు. చిరంజీవి పరిచయం, ఆ తరవాత వెన్నెల కిషోర్ తో ఇంటర్వ్యూ ఎపిసోడ్, తమన్నాతో కోర్టు సీనూ.. ఇవన్నీ రెగ్యులర్ గానే సాగిపోతాయి. నటీనటులు కామెడీ చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప... ప్రేక్షకులకు నవ్వు రాదు. ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాని పోలీసులకు అప్పగించడం వెనుక శంకర్ తెలివి తేటలేం ఉండవు. ఆ సీన్‌ని సైతం చాలా సాదాసీదాగా తీశాడు దర్శకుడు. శంకర్ - మహాల మధ్య బాండింగ్ కూడా అంతగా ఏం చూపించలేకపోయాడు. తమన్నాతో చిరు ఎపిసోడ్లు కూడా రొమాంటిక్‌గా లేవు. దాంతో ఏ ఎమోషన్‌కీ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. ఇంట్రవెల్ ఫైట్ తో కాస్త ఊపిరి వస్తుంది. ద్వితీయార్థంలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉందని తెలుస్తుంది.
అయితే ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే ఆ ఫీలింగ్ కూడా చప్పున చల్లారిపోతుంది. లోకల్ దాదాగా చిరుతో నడిపిన సన్నివేశాలన్నీ పేలవంగా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో సైతం చిరు - కీర్తిల బాండింగ్ ఏం లేదు. అన్నాచెల్లెళ్ల కథ, వాళ్ల మద్య సినిమా అంటే.. ఆ తరహా సన్నివేశాలు ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ దర్శకుడు ఈ కథని అలా తయారు చేసుకోలేకపోయాడు.కీర్తి ఇంట్లో చిరు గ్యాంగ్ చేసే అల్లరి సైతం రక్తి కట్టలేదు. పైగా ఖుషిలోని నడుం సీన్ కూడా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ముగిసిన వెంటనే కథ ఏ దారిలో వెళ్తుందో ఎలా ముగుస్తుందో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు. తలపై కొట్టగానే గతం మర్చిపోవడం, మరో దెబ్బ వేయగానే మళ్లీ గుర్తుకు రావడం ఇలాంటి పాత చింతకాయ పచ్చడి ట్రిక్కుల్ని వాడేశాడు మెహర్.దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉందో అంచనా వేయొచ్చు.
నటీనటులు: చిరంజీవి ఈజ్ చరిష్మా, గ్రేస్.. ఇవన్నీ ఈ సినిమాలోనూ కనిపించాయి. అయితే చిరుని సైతం తెరపై చూసినప్పుడు ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే ఈ పాత్రని దర్శకుడు సరిగా డిజైన్ చేసుకోలేదు. హీరో పాత్రలో ఎలివేషన్లు ఏం కనిపించవు. సీన్‌లో బలం లేనప్పుడు తెరపై మెగాస్టార్ ఉన్నా ఒకటే బర్నింగ్ స్టార్ ఉన్నా ఒక్కటే. భోళా శంకర్ లో అదే జరిగింది. మహానటి కీర్తి సురేష్‌ని తీసుకొచ్చినా, తనలోని టాలెంట్ బయట పెట్టించే సీన్ ఒక్కటీ లేదు.తమన్నాది కూడా ఆల్మోస్ట్ గెస్ట్ రోల్ లాంటిదే. జబర్‌దస్త్ గ్యాంగ్అంతమంది చిరు చుట్టూ ఉన్నా వాళ్లలో ఎవరికీ గుర్తు పెట్టుకొనే పాత్ర లేదు. ఆఖరికి వెన్నెల కిషోర్ కూడా నవ్వించలేకపోయాడు. సుశాంత్ ది అతిథి పాత్ర అనుకోవొచ్చు.
సాంకేతికత: చిరంజీవికి మణిశర్మ ఎన్నో సూపర్ హిట్టు ఇచ్చాడు. ఇప్పుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్‌కి చిరుతో పని చేసే అవకాశం దక్కింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాటలు సోసోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అంతే. సినిమా రిచ్‌గా ఉంది. నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడు. మెహర్ రమేష్ ఓ రీమేక్ చేతపట్టి, మినిమం గ్యారెంటీ సినిమా చేసే అవకాశం ఉన్నా, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎప్పుడో 1980 నాటి టేకింగ్ తో, సీరియల్ లా సినిమాని సాగదీశాడు. పదేళ్ల తరవాత తనకొచ్చిన ఛాన్స్ ని సరిగా వాడుకోకపోవడం ముమ్మాటికీ మెహర్ తప్పే.
ప్లస్ పాయింట్స్
చిరు
మైనస్ పాయింట్స్
మిగిలినవన్నీ..
ఫైనల్ వర్డిక్ట్ : బాలే.. శంకర్...