నటీనటులు: ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు, తదితరులు
దర్శకత్వం : బి. జీవన్ రెడ్డి
నిర్మాత: వీ.ఎస్ రాజు
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
ఎడిటర్: అన్వర్ అలీ, ప్రభుదేవా
రేటింగ్ : 2/5
పూరి ఆకాశ్ ఊహ తెలిసినప్పటి నుండి సినిమాలు చేస్తున్నాడు. మాస్టర్ ఆకాష్ గా సక్సెస్ ఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్. అయితే హీరోగా మారిన తర్వాతే సక్సెస్ ముఖం చాటేసింది. స్వయంగా పూరి జగన్నాద్ రంగలో దిగి రెండు సినిమాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రొమాంటిక్ కాస్త ఫర్వాలేదనిపించింది కానీ సాలిడ్ సక్సెస్ కాదు. ఐతే ఇప్పుడు దళం, జార్జి రెడ్డి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో 'చోర్ బజార్' సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఆకాష్ కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.
కథ:
బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) హైదరాబాద్ చోర్ బజార్ అడ్డా. బయట ఖరీదైన కార్ల సామాన్లు కొట్టేసి చోర్ బజార్లో అమ్మడం బచ్చన్ షాబ్ దందా. మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)తో ప్రేమ కూడా వుంటుంది. ఐతే ఆ ప్రేమకి అమ్మాయి ఇంట్లో ఓకే చెప్తారా లేదా అనే సవాల్ కూడా వుంటుంది. ఇదీలావుండగా హైదరాబాద్ మ్యూజియం నుంచి మాయమైన 200 కోట్ల వజ్రం చోర్ బజార్ చేరుతుంది. దీంతో పోలీసులు చోర్ బజార్ పై ఫోకస్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది? ఆ డైమండ్ కి బచ్చన్ కి వున్న లింక్ ఏంటి ? బచ్చన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా ? డైమండ్ చోరి కథ చివరికి ఏమైయింది ? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
పూరి జగన్నాద్ చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్. బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేసిన డైనమిక్ దర్శకుడు. పూరి జగన్నాధ్ కి రెబల్ ఇమేజ్ వుంది. పూరి మాట్లాడిన మ్యూజింగ్స్ కూడా ఊరమాస్ గా వుంటాయి. అంతమాత్రాన ఆకాష్ పూరికి ఆ మాస్ ఇమేజ్ వుందని అనుకోవడం కేవలం భ్రమ. ఆకాష్ అందంగా ఉంటాడు. మంచి నటుడు. హీరోకి కావాల్సిన క్యాలిటీస్ అన్నీ వున్నాయి. అంతమాత్రాన ఒక సూపర్ హీరోలా అతడిని ప్రజంట్ చేసి కన్వేన్స్ చేయడం పూరి జగన్నాద్ వల్లే కాలేదు. అయినప్పటికీ ఆకాష్ దగ్గరికి వెళ్ళే దర్శకులు పద్దతి మార్చడం లేదు.
ఒక్క దెబ్బ కొడితే వంద మంది పడిపోయే కథలే ఆకాష్ దగ్గరికి వెళుతున్నాయనడానికి మరో ఉదాహరణ చోర్ బజార్. ఈ సినిమా చూసిన తర్వాత ఆకాష్ ని ద్రుష్టిలో పెట్టుకొని కాదు.. పూరి జగన్నాధ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఆకాష్ కోసం కథని రాస్తున్నారనిపించింది. ప్రతి సీన్ లో ఓవర్ బిల్డప్, క్యారెక్టర్ డామినేట్ చేసే డైలాగులు, కొట్టడాలు, నరకడాలు .. అంతా అనవసరమైన రచ్చ. పాపం చోర్ బజార్ లో ఆకాష్ ని చుసిన తర్వాత శక్తికి మించిన భారం మోస్తున్న కార్మికుడులా కనిపించాడు.
సినిమా విషయానికి వస్తే అత్యంత నిర్లక్ష్యంతో కథని కధనాన్ని డీల్ చేసిన వైనం కనిపిస్తుంది. రోబరీ సీన్ తో ఆసక్తికరంగా కథని మొదలుపెట్టిన దర్శకుడు చోర్ బజార్ కి వచ్చిన తర్వాత కథని కంగాలి చేసి పారేశాడు. ప్రధాన పాత్రలకి ఒక్కో ఉపకథ పెట్టి చోర్ బజార్ ని కాస్త బోర్ బజార్ చేసి పారేశాడు. సీన్లు వస్తుంటాయి పోతుంటాయి. సీన్ కి సీన్ కి మధ్య ఎమోషనల్ కనెక్షన్ వుండదు. ఆ మూగ ప్రేమ కథ ఒకటి. ప్రేమపైనే విరక్తి పుట్టించేస్తుంది. దళం, జార్జ్ రెండూ సహజమైన చిత్రాలే. తనూ కమర్షియల్ సినిమా తీయగలని చెప్పి జీవన్ రెడ్డి చోర్ బజార్ స్క్రిప్ట్ రాసినట్లుంది.
ఐతే కమర్షియల్ అంటే ఏమిటో తనకి సరైన అవగాహన లేదని చోర్ బజార్ చూస్తే అర్ధమౌతుంది. ఆకాష్ ని రొమాంటిక్ లో గ్యాంగ్ స్టార్ గా చూపించాడు పూరి. దానికి ఆయన ఎంచుకున్న నేపధ్యం ఫర్వాలేదనిపించింది. కానీ జీవన్ రెడ్డి, ఆకాష్ ని చూపించిన విధానం అస్సల్ నమ్మబుల్ గా వుండదు. ప్రతిది ఓవర్ బిల్డప్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఆకాష్ తప్పులేదు. 'ఈ కథలో నీ పేరు బచ్చన్' అని దర్శకుడు చెప్పినపుడే ''బచ్చన్ కి మా నాన్న ఫ్యాన్ గానీ నేను కాదు భయ్యా. అంత భారం నేను మోయలేను'' అని చెప్పుంటే ఈ కళాఖండం బయటికి వచ్చేది కాదు. పైగా బచ్చన్ టైటిల్ జస్టిఫీకేషన్ కోసం పెట్టిన ట్రాక్ అయితే అదో కళాఖండం. చాలా బలహీనమైన కథ ఇది. కొత్తదనం లేదు సరికదా.. అడుగడుగునా సహనానికి పరీక్ష పెడుతూ సాగే సన్నీవేశాలతో సినిమా ఒక వికారంగా మారింది.
నటీనటులు:
ఆకాష్ బాగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ బావున్నాయి. ఐతే అవేవీ ఈ కథలో బాగం కాకుండా విడిగానే కనిపిస్తాయి. మాస్ ఇమేజ్ కోసం ఆకాష్ చేస్తున్న ప్రయత్నాలని పక్కన పెట్టి ముందు కంటెంట్ పై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఈ సినిమా మరోసారి చెప్పింది.
కథానాయికగా నటించిన గెహనా ఓకే. ఆమె పాత్ర అంత బలంగా వుండదు. సీనియర్ నటి అర్చన చాన్నాళ్ల తర్వాత చూడటం కొత్తగా వుంటుంది కానీ ఆమె పాత్ర కూడా సగటు కమర్షియల్ తల్లిపాత్రే. సునీల్, సుబ్బరాజు చాలా మంది నటులు వున్నా ఎవరూ లేనట్లే. అలా డిజైన్ చేశారు ఆ పాత్రలు.
టెక్నికల్ గా:
నిర్మాణ పరంగా సినిమా ఓకే. తెలంగాణ యాస పలకడానికి నటులు చాలా కష్టపడినట్లనిపించింది. దర్శకుడు జీవన్ రెడ్డి స్క్రిప్ట్ కనీసం యావరేజ్ గా నైన రెడీ చేయాల్సింది, సురేష్ బొబ్బిలి సంగీతం కలసిరాలేదు.రిపీట్ సీన్లు లేపేసే అవకాశం వున్నా ఎడిటర్ ఆ చాయిస్ తీసుకోలేదు.
ప్లస్ పాయింట్స్
ఆకాష్ పూరి
మైనస్ పాయింట్స్
కథ, కథనం
బోరింగ్ ట్రీట్మెంట్
ఓవర్ బిల్డప్
ఫైనల్ వర్దిక్ట్.. సారీ పూరీ